సామ్రాజ్యవాదాన్ని ప్రతిఘటిస్తున్న పశ్చిమాఫ్రికా దేశాలు

పశ్చిమాఫ్రికాలో చాలా భాగం ఫ్రెంచి సామ్రాజ్యవాదుల వలస పెత్తనం కింద నడిచింది. ప్రస్తుతం అక్కడ అన్నీ స్వతంత్ర దేశాలే అయినా, భారతదేశం బ్రిటిష్‌ వలస పాలన నుండి విడగొట్టుకున్న మాదిరిగా ఆ దేశాలు ఫ్రెంచి సామ్రాజ్యవాద పెత్తనం నుండి విడగొట్టుకోలేదు. ఇప్పటికీ ఆ మాజీ ఫ్రెంచి వలస దేశాల కరెన్సీలు ఫ్రాంక్‌ తో స్థిర మారకపు రేటును కొనసాగిస్తున్నాయి. దాని పర్యవసానంగా ఆ దేశాలు తమవైన స్వంత ఆర్థిక విధానాన్ని గాని, ద్రవ్య విధానాన్ని గాని అమలు చేయగలిగే స్థితిలో లేవు. ఒకవేళ అలా గనుక స్వంత విధానాలను అనుసరిస్తే ఫ్రాంక్‌తో ఉన్న స్థిర మారకపు రేటు దెబ్బ తింటుంది. ఇక ఆ దేశాల విదేశీ మారకపు నిల్వలు అన్నింటినీ ఫ్రాన్స్‌ తన దగ్గరే అట్టిపెట్టుకుంది. భారతదేశం బ్రిటన్‌కు వలసగా ఉన్న కాలంలో మన విదేశీ మారకపు ద్రవ్య నిల్వలను బంగారం రూపంలో బ్రిటన్‌ తన వద్దే ఉంచుకునేది. ఇప్పుడు ఫ్రాన్స్‌ పశ్చిమాఫ్రికా దేశాల విషయంలో అదే విధంగా వ్యవహరిస్తోంది. పశ్చిమాఫ్రికా దేశాలు స్వతంత్రం పొందినట్టు అంగీకరించినా, వాటి ఆర్థిక విధానాలను ఇప్పటికీ తానే అదుపు చేస్తోంది. ఇక ఆ దేశాల సహజ వనరులు, ఖనిజ సంపద యావత్తూ సామ్రాజ్యవాద దేశాలలోని బహుళజాతి కార్పొరేట్ల ఆధీనంలో ఉన్నాయి. అంతటితో ఆగలేదు. ఫ్రాన్స్‌ సైన్యాలు ఇప్పటికీ ఆ పశ్చిమాఫ్రికా దేశాలలో మోహరించి వున్నాయి. మొదట్లో తమ ఆస్తులను, సంపదలను కాపాడుకోవడం కోసం ఆ సైన్యాన్ని అక్కడ ఉంచవలసి వచ్చిందని ఫ్రాన్స్‌ చెప్పింది. ఆ తర్వాత ఇస్లామిక్‌ ఉగ్రవాదం ప్రమాదం ముంచుకొస్తోంది గనుక దాని నుండి ఆ దేశాలను కాపాడడం కోసం తమ సైన్యాలను అక్కడ ఉంచవలసి వస్తోందని సమర్ధించుకుంది. నిజానికి ఇస్లామిక్‌ ఉగ్రవాదం ఆ ప్రాంతంలో బలం పుంజుకోడానికి సామ్రాజ్యవాదులే కారణం. లిబియా నేత గడాఫీని అంతమొందించే కుట్ర అనంతరమే ఆ ప్రాంతంలో ఇస్లామిక్‌ ఉగ్రవాదం కొంత బలపడింది. నిజానికి ఆ సైన్యాలు అక్కడ ఉన్నది ఆ దేశాలన్నీ తమ అదుపాజ్ఞల్లో నడిచేలా చేయడం కోసమే. ఒకవేళ ఏ దేశమైనా ఫ్రెంచి సైన్యాలు తమ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని ఆదేశిస్తే, ఆ విధంగా ఆదేశించిన ప్రభుత్వాన్ని కుట్ర ద్వారా కూలదోసి తమ తొత్తు ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేయడానికి ఫ్రాన్స్‌ వెనుకాడదు. బుర్కినా ఫాసో విషయంలో అదేమాదిరిగా జరిగింది.
ఆఫ్రికా దేశాలన్నీ సమైక్యంగా స్వతంత్రంగా ఉండాలని వాంఛించే మార్క్సిస్టు విప్లవకారుడు థామస్‌ సంకారా బుర్కినా ఫాసో లో అధికారాన్ని చేపట్టినప్పుడు ఫ్రెంచి సైన్యాలను తమ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని ఆదేశించాడు. అప్పుడు అతడి స్వంత పార్టీ లోని వ్యక్తులతోనే అతడిని హత్య గావించే కుట్ర పన్నింది ఫ్రాన్స్‌. ఐతే చాలా దేశాలలో తమకు అనుకూలంగా వ్యవహరించే పార్టీలనే అధికారంలో కూర్చోబెట్టి పరోక్షంగా తన పెత్తనాన్ని ఫ్రెంచి సామ్రాజ్యవాదం కొనసాగిస్తోంది. ఆ పార్టీలు ఏవి అధికారంలో ఉన్నా అవి ఫ్రెంచి సైన్యాలు తమ దేశంలో తిష్ట వేసుకుని వున్న విషయాన్ని చర్చలోకి రాకుండా చూసుకుంటాయి. ఆ విధంగా ఫ్రెంచి సైన్యాలు అక్కడి ప్రభుత్వాల ఆమోదంతోటే కొనసాగుతున్నట్టు ఒక ప్రజాస్వామ్య ముసుగు వేసుకుని వ్యవహారాన్ని నడుపుతోంది ఫ్రాన్స్‌.
ఐతే ఇటీవల కొన్ని పశ్చిమాఫ్రికా దేశాల్లో సైన్యం లోకి ప్రవేశించి బలపడిన విప్లవకర శక్తులు అక్కడ ఎన్నికైన తొత్తు ప్రభుత్వాలను సైనిక కుట్రల ద్వారా కూలదోసి సామ్రాజ్యవాద వ్యతిరేక వెల్లువకు తెర తీశాయి. సామ్రాజ్యవాదులు మాత్రం అక్కడ ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతం కలిగినట్టు గగ్గోలు పెడుతున్నారు. కాని ఆ దేశాల్లోని ప్రజానీకం మాత్రం ఈ విప్లవకర సైనిక ప్రభుత్వాలకు మద్దతుగా ఉన్నారు. తాము ఎన్నికల ద్వారా గెలిపించిన ప్రభుత్వాలనే ఈ సైనిక శక్తులు కుట్ర ద్వారా కూలదోసినప్పటికీ ప్రజలు వాటికి తమ మద్దతు తెలుపుతున్నారు.
నిజానికి ఈ దేశాల్లోని పరిణామాలు ప్రస్తుతం అమలౌతున్న ఎన్నికల ప్రజాస్వామ్యానికి ఉన్న పెద్ద లోపాన్ని ఎత్తిచూపుతున్నాయి. మామూలుగా సార్వత్రిక ఓటు హక్కు ద్వారా ఎన్నికల్లో గెల్చిన పార్టీ అధికారంలోకి రావడం అనేది ప్రజాస్వామ్యయుతంగా కనిపిస్తుంది. పౌరులెవరైనా, వారి ఆర్థిక, సామాజిక స్థితిగతులతో నిమిత్తం లేకుండా ఎన్నికల్లో పోటీ చేయవచ్చుని, అందరికీ సమాన హక్కులు ఉంటాయని, ఎవరైనా రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసుకోవచ్చునని చెప్తూ ఈ ఎన్నికల ప్రజాస్వామ్య విధానాన్ని సమర్ధిస్తారు. ఐతే, ధన ప్రభావం విపరీతంగా పెరిగి సామాన్యులెవరూ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధం కాలేని పరిస్థితి నేడు నెలకొంది. అందుచేత ఎన్నికల విధానం అనేది నేటి పరిస్థితుల్లో అందరికీ సమాన అవకాశాలు గ్యారంటీ చేయలేకపోతోంది. ఐనప్పటికీ పైకి చూసినప్పుడు ఎన్నికల ప్రజాతంత్రం చాలా బాగా నడుస్తోందని సామ్రాజ్యవాదులు చెప్పుకోవచ్చు. ఆ ఎన్నికల్లో ప్రజలను నిజంగా కలవరపరిచే సమస్యలేవీ చర్చకే రావు. అదే మాదిరిగా పశ్చిమాఫ్రికా దేశాలలో ప్రజలందరూ తమ తమ దేశాల నుండి ఫ్రెంచి సైన్యాలు ఖాళీ చేయాలని బలంగా కోరుతున్నా, అక్కడ ఎన్నికైన ప్రభుత్వాలు మాత్రం ఆ విషయాన్ని చర్చకే రానివ్వడం లేదు.
అయితే, ఇందుకు భిన్నంగా మూడు దేశాలు-బుర్కినా ఫాసో, నైగర్‌, మాలి-ఫ్రెంచి సైన్యాలు వెంటనే తమ దేశాలను ఖాళీ చేయాలని ఆదేశించాయి. అక్కడ ఇప్పుడు నడుస్తున్నవి సైనిక ప్రభుత్వాలు. అక్కడ ఎన్నికల ద్వారా అధికారం చేపట్టిన తొత్తు ప్రభుత్వాలను కూలదోసి ఈ దేశాల్లో సైన్యం అధికారం చేపట్టింది. ఇక ఇస్లామిక్‌ ఉగ్రవాదం ప్రమాదాన్ని నిలవరించే విషయంలో మాలి ‘వేగర్‌’ అనే రష్యన్‌ సాయుధ బలగాల సహాయాన్ని తీసుకుంటోంది. ఇప్పుడు ఆ వేగర్‌ బలగాలు రష్యన్‌ ప్రభుత్వ సైన్యంలో విలీనం అయాయి. జులై 2024లో ఈ మూడు దేశాలూ కలిసి ”సాహెల్‌ దేశాల కూటమి”గా ఏర్పడ్డాయి. విశాల ఆఫ్రికా ఐక్యతకు, సామ్రాజ్యవాద వ్యతిరేకతకు ఈ కూటమి కట్టుబడి వుంది. ఇప్పుడు బుర్కినా ఫాసో మరో అడుగు ముందుకేసి తన దేశంలోని బంగారపు గనులను జాతీయం చేసింది. ఇంత వరకూ ఆ గనులు ఎండెవర్‌ మైనింగ్‌ కంపెనీ అనే బ్రిటిష్‌ బహుళజాతి కార్పొరేట్‌ ఆధీనంలో ఉండేవి. బుర్కినా ఫాసో ప్రపంచంలో అత్యధికంగా బంగారం ఖనిజపు నిల్వలు కలిగివున్న దేశాలలో 13వ స్థానంలో ఉంది. సాలీనా ఆ దేశం నుండి ఉత్పత్తి అయ్యే బంగారం 100 టన్నులకు పైబడి వుంటుంది. దాని విలువ 600 కోట్ల డాలర్లకు పైబడి ఉంటుంది. కాని అందులో అధిక భాగాన్ని మైనింగ్‌ కంపెనీలు కాజేస్తున్నాయి. అందుచేత ఇంత బంగారపు నిల్వలు ఉండి కూడా బుర్కినా ఫాసో స్థూల జాతీయోత్పత్తి కేవలం 1937 కోట్ల డాలర్లు మాత్రమే ఉంది. ఇబ్రహీం ట్రావోర్‌ నాయకత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం బంగారు గనులను జాతీయం చేయడంతోబాటు ముడి ఖనిజాన్ని శుద్ధి చేసే కర్మాగారాన్ని కూడా అక్కడ నెలకొల్పుతోంది. ఆ దేశంలో ఉత్పత్తి అయ్యే బంగారం విలువలో కేవలం 200 కోట్ల డాలర్ల వరకే పొందగలిగినా, ఆ మొత్తంతో ఆ దేశపు ప్రజల వైద్య, విద్యా, కనీస అవసరాలనన్నింటినీ తీర్చగల శక్తి ఆ ప్రభుత్వానికి వస్తుంది.
ఏ దేశానికైనా ఖనిజ వనరులు పునరుత్పత్తికి అవకాశం లేని విలువైన సంపదగా ఉంటాయి. అందువలన వాటిని వెలికితీయడం ద్వారా ఆ దేశం అత్యధిక ప్రయోజనాలు పొందగలిగేలా ప్రభుత్వ విధానం ఉండాలి. అలా కాకుండా, తక్షణ ప్రయోజనాలను ఆశించి ఖనిజ సంపద మీద పెత్తనాన్ని బహుళజాతి సంస్థలకు అప్పజెప్తే ఆ దేశం శాశ్వతంగా నష్టపోతుంది. మన పొరుగునే ఉన్న మయన్మార్‌ విషయంలో జరిగిందిదే. ఆ దేశంలో ఉన్న ముడిచమురు నిల్వలను బహుళజాతి కంపెనీలకు అప్పజెప్పడం వలన మొదట్లో కొంత ఆదాయం ఆ దేశానికి లభించింది. దాంతో ఒక తాత్కాలిక ఊపు అక్కడి ఆర్థిక వ్యవస్థకు వచ్చింది. లాభాల్లో అత్యథిక భాగం బహుళజాతి కంపెనీలు కాజేశాయి. అక్కడ చమురు నిల్వలు పూర్తిగా తరిగిపోయాక ఆ బహుళజాతి కంపెనీలు మూటా ముల్లే సర్దుకుని వెనక్కి పోయాయి. మయన్మార్‌ ఇప్పుడు ఐరాస మాటల్లో చెప్పాలంటే అత్యంత హీనమైన వృద్ధి సాధించిన దేశాలలో ఒకటిగా ఉంది.
ఏ దేశానికైనా తన ఖనిజ సంపదపై పూర్తి అధికారం ఉండాలన్న సూత్రాన్ని బుర్కినా ఫాసో బాగా అర్ధం చేసుకుంది. ఐతే ఈ విషయంలో పశ్చిమాఫ్రికా దేశాలను సామ్రాజ్యవాదులు అంత తేలికగా విడిచి పెడతారని అనుకోలేం. మూడవ ప్రపంచ దేశాల వనరుల మీద తమ ఆధిపత్యాన్ని ఎలాగైనా నిలుపుకోవడం కోసం సామ్రాజ్యవాదులు ఎంతవరకైనా పోగలరని గతానుభవాలు సూచిస్తున్నాయి. ఇరాన్‌లో మొస్సాద్‌ ప్రభుత్వాన్ని కూలగొట్టిన నాటి నుండీ అనుభవాలు మన ముందున్నాయి. సామ్రాజ్యవాదులు ఎంతకు తెగించడానికి సిద్ధపడినప్పటికీ, ఇప్పటికీ చాలా మూడవ ప్రపంచ దేశాలలోని సహజ వనరుల మీద సామ్రాజ్యవాదులు పట్టు ఇంతవరకూ సాధించలేకపోయారు. అందుచేతనే సామ్రాజ్యవాదులు మూడవ ప్రపంచ దేశాలను నయా ఉదారవాద చట్రం లోకి తెచ్చి ఉచ్చు బిగించి షరతుల పేరుతో ప్రభుత్వ రంగాన్ని తిరిగి బహుళజాతి గుత్త సంస్థల పరం చేయడానికి, వాటికే ఈ దేశాల సహజ వనరులను, ఖనిజ సంపదను ధారాదత్తం చేసేలా ఒత్తిడి చేయడానికి పూనుకున్నారు. సామ్రాజ్యవాదుల పన్నాగం ఏమిటో పశ్చిమాఫ్రికా దేశాల ప్రభుత్వాలు, ప్రజలు గుర్తిస్తున్నారు. ఇది చాలా ప్రాధాన్యత గల పరిణామం. తమ వనరుల మీద, తమ సహజ సంపద మీద తమకే పూర్తి ఆధిపత్యం ఉండాలని వారు పట్టుదలగా ఉన్నారు.
భారతదేశంలో రాజకీయ స్వాతంత్య్రం సాధించిన తర్వాత ఆర్థికంగా స్వంత కాళ్ళ మీద నిలబడడానికి చేసిన పోరాటం చాలా ప్రాధాన్యత కలిగినటువంటిది. ఆ రోజుల్లో సోవియట్‌ యూనియన్‌ అందించిన తోడ్పాటు చాలా కీలకమైనది. మనం మన సహజ వనరులమీద తిరిగి అధికారం సాధించుకున్నాక ఇప్పుడు నయా ఉదారవాద చట్రంలో ఇరుక్కుని గతంలో సాధించిన సార్వభౌమాధికారాన్ని కోల్పోతున్నాం. సామ్రాజ్యవాదుల ముందు దాసోహం అంటున్నాం. పశ్చిమాఫ్రికా దేశాల అనుభవాలను చూసిన తర్వాతనైనా మన ప్రభుత్వాలకు జ్ఞానోదయం కలిగి ప్రభుత్వ రంగాన్ని కాపాడుకుని, దేశ సహజ సంపద మీద పట్టు నిలుపుకునే దిశగా పునరాలోచన చేయాలని కోరుకుందాం.
మన దేశంలో ఉన్న ప్రైవేటు రంగం కూడా ఈ విషయంలో బహుళజాతి కార్పొరేషన్లకన్నా ఏ విధంగానూ మెరుగ్గా లేవు. అందుచేత ప్రభుత్వ రంగానికి ప్రత్యామ్నాయం లేదని, ఆ రంగం ద్వారా మాత్రమే మన దేశ సహజ వనరులను పూర్తిగా దేశ ప్రయోజనాల కోసం వినియోగించుకోగలుగుతామని గ్రహించాలి. ప్రభుత్వ రంగంలో ఎక్కడైనా అవినీతి ఉందనో, సామర్ధ్యం కొరవడిందనో చెప్పి ఆ సాకులతో ప్రైవేటు పరం చేయడం సమర్ధనీయం కానే కాదు. అటువంటి లోపాలను సరిచేసుకుంటూ దేశాభివృద్ధికి తోడ్పడే విధంగా ఉపయోగించుకోగలిగేది ప్రభుత్వ రంగం మాత్రమే. ప్రైవేటు రంగం ద్వారా ఆ పని జరగదు. ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించడం అనే లక్ష్యానికి కట్టుబడ్డ ప్రభుత్వానికి ఆ రంగంలోని లోపాలను సరి చేయడం కూడా సాధ్యమే.

( స్వేచ్ఛానుసరణ )

ప్రభాత్‌ పట్నాయక్‌

➡️