పెను విపత్తులో పశ్చిమాసియా

అమెరికా అండ చూసుకుని ఇష్టానుసారంగా చెలరేగుతున్న యూదు దురహంకార ఇజ్రాయిల్‌ నేడు పశ్చిమాసియాకు పెను విపత్తుగా మారింది. గాజా, వెస్ట్‌బ్యాంక్‌లపై క్రూరమైన దాడులు చేస్తూ అమాయక పౌరులను పెద్దయెత్తున ఊచకోత కోస్తున్న యుద్ధోన్మాది నెతన్యాహు ఇప్పుడు లెబనాన్‌పై తెగబడ్డాడు. ఈ ప్రాంతంలో ఇరాన్‌కు మిత్రులుగా వున్న హిజ్బుల్లాలు, హౌతీలపైన ఏకపక్షంగా దాడులు చేయడం ద్వారా ఆ దేశాన్ని యుద్ధంలోకి లాగాలని, తద్వారా దీనిని ప్రాంతీయ యుద్ధంగా మార్చాలని అమెరికా, దాని తైనాతీల దుష్ట పన్నాగం. పాలస్తీనా భూభాగాలను చాలా వరకు కబళించిన ఇజ్రాయిల్‌ ఇప్పుడు పశ్చిమాసియాలోని ఇతర దేశాల భూభాగాలను కూడా ఆక్రమించుకోవాలని చూస్తోంది. గాజా నుంచి లెబనాన్‌కు, అటు నుంచి ఇరాన్‌కు యుద్ధాన్ని విస్తరింపజేయడం ద్వారా గ్రేటర్‌ ఇజ్రాయిల్‌తో బాటు ఈ ప్రాంతంలో తన భౌగోళిక రాజకీయ వ్యూహాన్ని నెరవేర్చుకోవచ్చన్నది అమెరికా పన్నాగం. అవినీతి, కుంభకోణాల్లో పీకల్లోతున కూరుకుపోయిన నెతన్యాహు తన పదవిని కాపాడుకోవడానికి యుద్ధాన్ని ఒక సాధనంగా వాడుకుంటున్నాడు. ఇందుకు లెబనాన్‌ను రెండో యుద్ధ ప్రయోగశాలగా చేసుకున్నాడు. పేజర్లు, వాకీటాకీలను బాంబులుగా చేసుకుని గత వారం ఉగ్రదాడికి తెగబడ్డాడు. ఈ వారం రోజుల్లో పిల్లలు, మహిళలతో సహా 550 మంది అమాయక పౌరుల ప్రాణాలను బలిగొన్నాడు. హిజ్బుల్లా చీఫ్‌ హసన్‌ నస్రల్లా హత్యతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. అంతకుముందు ఇరాన్‌ అధ్యక్షుడు విమాన ప్రమాదంలో మరణించడం వెనుక ఇజ్రాయిల్‌ హస్తం ఉన్నట్లు అనుమానాలున్నాయి. కొత్త అధ్యక్షుడు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన హమాస్‌ నేత హనియే హత్య, ఇరాన్‌ మిత్రులుగా ఉన్న సంస్థలపైన, వ్యక్తులను టార్గెట్‌గా చేసుకుని దాడులు చేసి చంపడం ఇవన్నీ ఇరాన్‌ను కవ్వించే చర్యలే. అయినా, ఇరాన్‌ రెచ్చిపోకుండా సంయమనం పాటిస్తోంది. అమెరికా, ఇతర పశ్చిమ దేశాల మద్దతుతో దురాగతాలకు పాల్పడుతున్న ఇజ్రాయిల్‌ను కట్టడి చేయాలని ఐరాస భద్రతామండలిని కోరింది.
ఈ ప్రపంచ సంస్థ వార్షిక సదస్సులో నెతన్యాహు మరింత బరితెగించి, యుద్ధాన్ని మరింత విస్తరింపజేస్తానంటూ హూంకరించాడు. ఆ తరువాత కొద్దిసేపటికే హిజ్బుల్లాలకు పట్టు ఉన్న దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయిల్‌ సైన్యం భీకర వైమానిక దాడులకు దిగింది. తాజాగా భూతల దాడులకు సైతం తెగబడింది. ఏడాది క్రితం తుమ్మితే ఊడే ముక్కులా ఉన్న ఇజ్రాయిల్‌లోని నెతన్యాహు సంకీర్ణ ప్రభుత్వం… పాలస్తీనా పౌరులపై దాష్టీకాలను, నిర్బంధాన్ని మరింత పెంచడం ద్వారా హమాస్‌ దాడులు చేయడానికి పరోక్షంగా పురికొల్పింది. హమాస్‌ దాడిని సాకుగా చూపి 40 వేల మందికిపైగా అమాయకులైన పాలస్తీనా పౌరులను ఊచకోత కోసింది. ఆకలి, వ్యాధులతో… దాదాపు రెండు లక్షల మంది మరణానికి పరోక్షంగా కారణమైంది.
పాలస్తీనా సమస్యకు రాజకీయ పరిష్కారం కనుగొనేందుకు యత్నించకుండా దాడులు, అణచివేత ద్వారా పరిష్కరించుకోవాలని చూడడం అవివేకం. ఆఫ్ఘనిస్తాన్‌లో 20 ఏళ్లపాటు యుద్ధం చేసి చివరికి ఏమీ చేయలేక అక్కడి నుంచి అవమానకరమైన రీతిలో అమెరికా నిష్క్రమించిన వైనం అందరికీ ఎరుకే. వియత్నాంలో అమెరికా చావు దెబ్బ తిన్న అనుభవం ఎవరూ విస్మరించరానిది. ఇప్పుడు ఇజ్రాయిల్‌ను పాలస్తీనాపై ఎగదోసి పశ్చిమాసియాలో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి అగ్ర రాజ్యం వేస్తున్న ఎత్తులు అరబ్బు దేశ ప్రజలు తిప్పికొట్టక మానరు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పచ్చిమితవాది డొనాల్డ్‌ ట్రంప్‌ బాహాటంగానే నెతన్యాహు తరపున వకాల్తా పుచ్కుకుంటుంటే, మరో అభ్యర్థి కమలా హారిస్‌ మౌనంగా మద్దతు తెలియజేస్తున్నారు. ఒక సార్వభౌమాధికార దేశంపై ఇజ్రాయిల్‌ దాడి చేస్తే దీనిని ఖండించాల్సిన భారత ప్రధాని నరేంద్ర మోడీ దీనికి భిన్నంగా నెతన్యాహుకు మద్దతుగా మాట్లాడడం దారుణం. ఈ స్థితిలో శాంతి, సంఘీభావ ఉద్యమాలే ఇజ్రాయిల్‌ దూకుడుకు అడ్డుకట్ట వేయగలిగే అత్యుత్తమ మార్గం. భారత్‌లో వామపక్షాలు అక్టోబరు 7న దేశ వ్యాపితంగా పాలస్తీనా సంఘీభావ దినం పాటించాలని పిలుపునిచ్చాయి. ప్రపంచ వ్యాపితంగా కూడా కార్మిక సంఘాలు సంఘీభావ ఉద్యమాలకు పిలుపునిచ్చాయి. ఈ సంఘీభావ ఉద్యమాలకు ప్రతి ఒక్కరూ బాసటగా నిలవాలి.

➡️