సనాతన ధర్మం అంటే ఏమిటి?

”సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం కుదరదు, దాన్ని డెంగూ, మలేరియాల్లాగ నిర్మూలించవలసిందే” అని ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్య హిందుత్వ శక్తులను తీవ్రంగా కలచివేసింది. స్టాలిన్‌ వ్యాఖ్యలకు వాళ్లు హిందువుల ఊచకోతకు పిలుపుగా అర్థం చెపుతున్నారు.
మరి అసలు సనాతన ధర్మం అంటే ఏమిటి?
ధర్మం అంటే జీవితమూ విశ్వమూ ఆధారపడే విలువలు, నమ్మకాలు, వ్యవస్థలు, పద్ధతులు (”ధరయతి ఇతి ధర్మా”) అని అర్థం. సనాతన అంటే సంస్కృతంలో ”శాశ్వతమైన” అని అర్థం. కనుక ”సనాతన ధర్మం” అంటే ”శాశ్వతమైన ధర్మం” లేదా ఎప్పటికీ మారని విశ్వధర్మం.
సనాతన ధర్మం అంటే మతమే అని విశ్వసించేవాళ్లు సాధికారికమైనవని నమ్మే పవిత్ర గ్రంథాల ప్రకారం శాశ్వతమైనదీ, మారనిదీ అయిన విశ్వధర్మం ఏమిటి?
ధర్మానికి వేదాలు, స్మృతులు, సదాచారం, ఆత్మతుష్టి అనే నాలుగు మౌలిక లక్షణాలున్నాయని మనువు అన్నాడు (”వేద: స్మృతి సదాచార స్వస్య చ ప్రియమాత్మన:/ఏతశ్చతుర్విదం ప్రాహు: సాక్షాద్‌ ధర్మస్య లక్షణమ్‌” మనుస్మృతి 2.12). సదాచారమంటే ఆర్యావర్తంలో (లేదా బ్రహ్మావర్తంలో) అనాదిగా ఉన్న సాంప్రదాయికమైన వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించడమే అని మనుస్మృతి నిర్వచించింది. స్వధర్మమంటే వర్ణధర్మమే అని కూడ మనువు నిర్దేశించాడు (”వరం స్వధర్మే విగుణ: న పారక్య: స్వానుష్ఠిత:/పరధర్మేణ జీవన్‌ హి సధ్య: పతతి జాతిత:” మనుస్మృతి 10.97)
భాగవత పురాణం కూడ ధర్మం అంటే వర్ణాశ్రమ ధర్మమే అని స్పష్టం చేసింది (”వర్ణాశ్రమవతాం ధర్మే నష్టే వేదపథే నృణాం” (12.2.12). విరాట్పురుషుని ఉన్నత అవయవాల నుంచి పుట్టిన వారిని గౌరవించాలని, విరాట్పురుషుని నిమ్న అవయవాల నుంచి పుట్టినవారిని నిమ్నంగా చూడాలని కూడ అది చెప్పింది (”వర్ణానామాశ్రమాణాం చ జన్మభూమ్యనుసారిణీ:/ ఆసను ప్రకృతయో నృణాం నీచైర్నిచోత్తమోత్తమ:” 11.17.15)
వర్ణాశ్రమ ధర్మం అంటే ఏమిటి?
”వర్ణాశ్రమం అంటే నాలుగు వర్ణాల వంశ పారంపర్య విధానం, దానితో పాటు, అనుమతించిన వర్ణాంతర సంబంధాల వల్ల జన్మించిన వారు (అనులోమ సంబంధాలలో జన్మించిన అంతరాలులు)” అని మనుస్మృతి చెప్పింది (”తస్మిన్‌ దేశే య ఆచార: పారంపర్య క్రమాగత:/వర్ణానాం సాంతరాలానాం స సదాచార ఉచ్యతే”, మనుస్మృతి, 2.18)
వర్ణాశ్రమ ధర్మం ప్రతి వర్ణానికీ నిర్దిష్ట పాత్రలను, విధులను నిర్దేశించింది. మనుస్మృతి ప్రకారం బ్రాహ్మణుల స్వధర్మం అధ్యయనం, అధ్యాపనం, యాజనం (కానుకలు స్వీకరించడం), యజ్ఞం. అందుకు భిన్నంగా, శూద్రుల విధి ద్విజుల సేవ చేయడం (”ద్విజాతి శుశ్రూష”). శూద్రుడికి సంపద పోగు చేసుకునే హక్కు లేదు. విద్యాధ్యయనం చేసే హక్కు లేదు. సేవ తప్ప మరే ఇతర కార్యకలాపానికీ హక్కు లేదు. ఇక చండాలురనైతే (మన జనాభాలో అత్యధికులైన అస్పృశ్యులతో సహా), ధర్మ శాస్త్ర రచయితలు ”నడిచే శ్మశానాలు” అని పరిగణించారు.
వ్యవహార మాల అనే గ్రంథం (దీనికి అనేక పాఠాంతరాలున్నాయి. నేను ప్రస్తావిస్తున్నది తిరువనంతపురం ప్రాచీన ప్రతుల గ్రంథాలయంలో ఉన్న ప్రతి) ప్రతి ఒక్క వర్ణానికీ నిర్దేశించిన వృత్తిని కొనసాగించడమే ధర్మం అని ప్రకటించింది. ప్రతి ఒక్కరూ తమ వర్ణానికి నిర్దేశించిన వృత్తిలో మాత్రమే ఉండాలని అది చెప్పింది. ఇతర వర్ణాలకు నిర్దేశించిన వృత్తిని గనుక చేసినట్టయితే ప్రళయాన్ని ఆహ్వానించినట్టే అంది (”సర్వేషామేవ వర్ణానాం ఏవం ధర్మ్యో ధనాగమ:/విపర్యాదధర్మస్యాన్న చేదాపద్‌ గరీయసి”). మరి వర్ణం పుట్టుకతో మాత్రమే వస్తుంది గనుక, ఏ వర్ణంలో పుట్టారో ఆ వర్ణపు వృత్తిని కాక, మరొక వర్ణపు వృత్తిని చేపట్టడం శిక్షార్హమైన నేరమని వ్యవహార మాల చెప్పింది. బ్రాహ్మణుల లాగ జంధ్యం ధరించే శూద్రులను శిక్షించాలని అది రాజులను ఆదేశించింది (”తానూ సర్వాన్‌ ఖాదయేద్రాజా శూద్రంశ్చ ద్విజ లింగిన:”).
గొప్ప జ్ఞానంగా ప్రశంసలు అందుకుంటున్న శంకరాచార్యుల అద్వైత సిద్ధాంతం చాతుర్వర్ణ వ్యవస్థను ఆమోదించింది. భగవంతుడే చాతుర్వర్ణాలను సృష్టించాడని భగవద్గీతలోని భగవానువాచ (”చాతుర్వర్ణ్యం మయా సృష్టం”) గురించి వ్యాఖ్యానిస్తూ, గీతా భాష్యంలో శంకరాచార్యులు రుగ్వేదంలోని పురుష సూక్తం సరైనదేనన్నాడు. పురుష సూక్తంలో విరాట్‌ పురుషుడి వేరువేరు అవయవాల నుంచి భగవంతుడు నాలుగు వర్ణాలను సృష్టించాడని, ”బ్రాహ్మణులను ముఖం నుంచి సృష్టించాడ”ని, మిగిలిన వారందరికీ మానవుల కన్న తక్కువ స్థాయి ఉందని చెప్పారు (”చత్వార్‌ ఏవ వర్ణా: చాతుర్వర్ణ్యం మయా ఈశ్వరేణ సృష్టం ఉత్పాదితం బ్రాహ్మణో స్య ముఖమాసీద్‌ ఇత్యాది శృతే:”). అలాగే శంకరాచార్యులు రచించిన బృహదారణ్యక ఉపనిషద్‌ శంకర భాష్యంలో వర్ణాశ్రమ విభజనను ఆమోదించి, ”బ్రహ్మ” అనే మాటకు ”బ్రాహ్మణ కులాభిమాన రక్షణకు మూలం” అని వ్యాఖ్యానించాడు (”బ్రాహ్మణ జాత్యభిమానానాత్‌ బ్రహ్మేత్యభిధీయతే”, 1.4.11)
ఈ ధర్మానికి హాని జరిగితే, తత్ఫలితంగా అసహ్యకరమైన సంకర, అపరిశుద్ధ జాతులు నిండిన ప్రపంచం ఏర్పడుతుందని అర్థశాస్త్రం హెచ్చరించింది(”తస్యాతి క్రమే లోక: సఇంకరాదృచ్ఛిధ్యేతే). వర్ణాల మధ్య నిషేధించబడిన అంతర్వివాహాలు, అంతస్సంబంధాలు ఏర్పడితే వాటి ద్వారా వర్ణ సంకరం జరుగుతుందని, తద్వారా వర్ణ ధర్మానికి హాని వాటిల్లుతుందని మనువు అన్నాడు (”వ్యభిచారేణ వర్ణానామవేద్‌ యా వేదనేన చ/ స్వకర్మణాం చ త్యాగేన జాయంతే వర్ణ సయింకరా:”). వర్ణాల మధ్య అంతస్సంపర్కం జరిగితే, వర్ణ పారిశుధ్యానికి హాని జరిగి, దేశస్తులతో సహా దేశమే అంతరించిపోతుందని మనువు అన్నాడు (”యత్ర త్వేతే పరిధ్వంసా జాయంతే వర్ణ దుష్కా: / రాష్ట్రికై: సహ తద్రాష్ట్రంట్ర క్షిప్రమేవ వినశ్యతి”, మనుస్మృతి, 10.16).
భగవద్గీతలో అర్జునుడు కూడ కుల ధర్మాన్ని ఉల్లంఘించే వివాహాలు జరగడం వల్ల కులం అంతరించిపోతుందని విచారిస్తాడు (గీత, 1.40). వర్ణాశ్రమ ధర్మానికి హాని జరిగి, అది ధ్వంసమైపోయే పరిస్థితుల్లో భగవాన్‌ వాసుదేవుడు అవతారం ఎత్తి వర్ణాశ్రమ ధర్మాన్ని పరిరక్షిస్తాడని భాగవత పురాణం చెప్తుంది (”తావహత్యై కలేరంతే వాసుదేవాను శిక్షితౌ/ వర్ణాశ్రమయుతం ధర్మం పూర్వవత్ప్రథాయిష్యతే”, 12.3.38).
అందువల్ల ధర్మం అంటే ఏమిటో ధర్మ శాస్త్రాలు, పురాణాలు వాచ్యంగా నిర్వచించిన, వ్యాఖ్యానించిన ప్రకారం నిస్సందేహంగా సనాతన ధర్మం అంటే వర్ణాశ్రమ ధర్మం అని మాత్రమే. వర్ణాశ్రమ సాంఘిక ధర్మాన్నీ, ప్రాపంచిక దృక్పథాన్నీ శాశ్వతంగా పరిరక్షించవలసిన విధి గురించే అవి చెప్పాయి.
”ధర్మం” ముసుగులో వాస్తవంగా సాగుతున్నది కుల వ్యవస్థను ప్రోత్సహించడమే అని నారాయణ గురు శిష్యుడు, సుప్రసిద్ధ సాంఘిక సంస్కర్త, ఆలోచనాపరుడు ‘సహోదరన్‌’ అయ్యప్పన్‌ 1950 జనవరిలో కేరళలోని శివగిరిలో ఒక ఉపన్యాసంలో ప్రత్యేకంగా హెచ్చరించాడు. ఆయన రాసిన పరివర్తనం అనే కవిత్వంలో ”సనాతన ధర్మం”, ”వర్ణాశ్రమ” ధర్మం అనే పేర్లతో సాగేది వాస్తవంగా బ్రాహ్మణులు నిర్మించిన మతమేననీ, అది సవర్ణులు కాని వారందరినీ తక్కువగా చూసే ఆలోచన అనీ రాశాడు. మహాత్మా గాంధీ 1934లో కేరళ పర్యటనకు వచ్చినప్పుడు సహోదరన్‌ ఆయనకు ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చాడు. అందులో ఆయన వర్ణాశ్రమ ధర్మం అనబడే ”క్రూర” ధర్మం భారత ప్రజానీకాన్ని అభాగ్యులుగా మారుస్తున్నదని అన్నాడు. అలాగే, ”హేతుబద్ధతను తిరస్కరించే, నైతికను తోసివేసే వేదాలను, శాస్త్రాలను డైనమైట్‌ పెట్టి పేల్చివేయాలి” అని డా||బి.ఆర్‌.అంబేద్కర్‌ రాశారు. ఎందుకంటే వేదాలు, ధర్మశాస్త్రాలు వర్ణాశ్రమ ధర్మపు కుల హింసతో కూడిన నిచ్చెన మెట్ల సామాజిక వ్యవస్థను పరిరక్షించే పునాది ప్రవచనాలు అని ఆయన అన్నారు.
”ఉజ్వలమైన”, ”సనాతన” సంప్రదాయం అనే ముసుగు తొడుగుతూ కుల వ్యవస్థను బలోపేతం చేసే ప్రయత్నాన్ని నారాయణ గురు, సహోదరన్‌ అయ్యప్పన్‌, పెరియార్‌, అంబేద్కర్‌ సాహసోపేతంగా తిరస్కరించారు. బ్రాహ్మణ భావజాలం సాగించిన హింసాత్మక దాడులను కూడ ఎదిరించి తన లక్షలాది అనుచరులతో బౌద్ధం స్వీకరించిన అంబేద్కర్‌ సనాతన ధర్మాన్ని పూర్తిగా నిరాకరించారు.
ఇవాళ ”సనాతన ధర్మం” అంటే ఏమిటో అర్థం చేసుకోవడంలో అంబేద్కర్‌ మన దారిదీపం కావాలి. ”సనాతన దర్మం” అంటే అమానవీయమైన, సంఘ వ్యతిరేకమైన కుల వ్యవస్థను కొత్త అలంకారంతో తీసుకురావడం, కొనసాగించడం, బలోపేతం చేయడం కన్న మరేమీ కాదు.

(డా||టి.ఎస్‌.శ్యాం కుమార్‌ కేరళలో, కాలడి లోని శ్రీ శంకరాచార్య సంస్కృత విశ్వవిద్యాలయం నుంచి సంస్కృత సాహిత్యంలో డాక్టరేట్‌ పొందారు. ఆయన ‘సుప్రభాతం’ అనే మలయాళ పత్రికలో రాసిన ఈ వ్యాసపు ఇంగ్లిష్‌ అనువాదాన్ని ‘ది వైర్‌ డాట్‌ ఇన్‌’ 2023 సెప్టెంబర్‌ 6న ప్రచురించింది.)

➡️