వలస కార్మికులకు ఏది భరోసా?

ఎక్కడ నుంచో వచ్చి పని చేస్తున్న తమకు హక్కూ, చట్టమూ వుందని తెలీక కాంట్రాక్టర్‌ ఇచ్చిన కూలి తీసుకోవడం తప్ప ఎదిరించడంలేదు. చేయమన్నంత కాలం పని చేయడమే తప్ప పని గంటల లెక్క వారికి తెలీదు. ఇచ్చినంత పుచ్చుకోవడమేగానీ ఇంత తక్కువ ఇచ్చారేమని అడిగే ధైర్యమూ వారికి లేదు. ఇంటికి వెళ్లకూడదంటే బాధతో పని చేయడమే తప్ప ఎందుకు పంపరని ప్రశ్నించడంలేదు. ఎక్కడ పనిచేయాలని చెబితే అక్కడ పనిచేయడమే తప్ప అది ప్రమాదకర ప్రదేశమని, ఏ చిన్న ప్రమాదం జరిగినా తాను చనిపోతానని ఏ కోశానా అనుకోడు. ఇదంతా తన కుటుంబాన్ని పోషించుకోవడానికి చేస్తున్న పనిగానే వలస కార్మికుడు భావిస్తున్నాడు. ఇదే పరిశ్రమాధిపతులకు, లేబర్‌ కాంట్రాక్టర్లకు ఒక వరంగా మారింది. వలస కార్మికులను మోసగించడానికి ఇదొక అస్త్రమైంది.

విద్యార్హతలు కల్గిన వారికి ఎక్కువ జీతం ఇవ్వాల్సి వస్తుందని, తక్కువ జీతానికి పనిచేస్తున్న వలస కార్మికులను ప్రమాదకర ప్రదేశాల్లో పెట్టుకొని పనిచేయించడంతో ప్రతీ ప్రమాదంలోనూ వీరు చనిపోవడమో, తీవ్రంగా గాయపడ్డమో జరుగుతోంది. అచ్యుతాపురం సెజ్‌లోని అసెన్షియా, సీనర్జిన్‌ కంపెనీ, వివిధ పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాల్లో చనిపోయిన, గాయపడినవారు ఎక్కువ మంది వలస కార్మికులే. యజమానులు ఏ పరిహారం చెల్లించకుండా, వైద్యం చేయించకుండానే వారిని సొంత ప్రాంతాలకు పంపిస్తున్న ఘటనలున్నాయి. సిఐటియు జోక్యం చేసుకున్న చోట బాధిత వలస కార్మిక కుటుంబాలకు కొంత న్యాయం జరుగుతున్నా, బయటకు తెలీని ప్రమాదాల్లో వారు తీవ్రంగా నష్టపోతున్నారు. మృత దేహాలను, క్షతగాత్రులను రహస్యంగా సొంత ప్రాంతాలకు పంపిస్తున్నారు. అనకాపల్లి జిల్లాలోని పరవాడ జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మా సిటీ (జెఎన్‌పిసి), అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా, ఇతర పరిశ్రమలు, హెటిరో, డెక్కన్‌ కెమికల్‌ పరిశ్రమలోనూ, ఎన్‌ఎఒబి నిర్మాణంలోనూ జరిగిన ప్రమాదాల్లో ప్రాథమిక వైద్యం చేయించకుండానే ఇళ్లకు పంపిన విషాదకరమైన పరిస్థితులున్నాయి.

అస్సాం, బీహార్‌, చత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది వలస కార్మికులు ఇక్కడ వివిధ పరిశ్రమల్లో పని చేస్తున్నారు. వీరికి పని, వేతన భద్రత లేదు. కనీస సదుపాయాల్లేని జైలు కంటే ఘోరమైన చీకటి రేకుల షెడ్లలో బంధించినట్లు వలస కార్మికులను పెడుతున్నారు. మంచినీటి సదుపాయం, మరుగుదొడ్లు సౌకర్యం వీరికి వుండదు. రాత్రి డ్యూటీ చేసుకొని నిద్ర పోదామన్నా సరైన వసతి లేదు. పరిశ్రమల్లోనే కాదు, ప్రమాదకరమైన, కఠినమైన నిర్మాణ పనుల్లోనూ వలస కార్మికులు వున్నారు. ఎన్‌ఎఒబి నిర్మాణ పనుల్లో స్థానిక నిర్వాసిత, ప్రభావిత గ్రామాలకు చెందిన 371 మంది వుండగా, ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు దాదాపు నాలుగు వేల మంది వున్నారు. ప్రతీ 20 మంది కార్మికులలో ఒకరు వలస కార్మికుడు అని అంచనా. దేశంలో వలస కార్మికుల ఆకలి కేకలు, మరణాల వార్తలు పదే పదే వస్తున్నాయని.. వారికి సాయం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు చేపట్టాయని సుప్రీంకోర్టు పలుసార్లు ప్రశ్నించింది. కోవిడ్‌ సందర్భంలో తమ సొంత ప్రాంతాలకు వెళ్లడానికి వలస కార్మికులు పడ్డ కష్టాలపై సుప్రీంకోర్టు చలించిపోయింది. ”స్వస్థలాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వలస కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలు మాకు ఆందోళన కలిగిస్తున్నాయి. వారికి రిజిస్ట్రేషన్‌, రవాణా, ఆహారం, తాగునీరు అందించడంలో పలు లోపాలను మేం గుర్తించాం” అని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది.

అప్పటి నుంచి ఇప్పటి వరకు వలస కార్మికుల బతుకుల్లో ఏ మార్పూ లేదు. ఏ సదుపాయాలూ వారు పొందడంలేదు. వలస కార్మికుల చట్టం 1979 ప్రకారం వారికున్న హక్కులేవీ అమలుచేయడంలేదు. వలస కార్మికులను పనిలో నియమించుకొనే కాంట్రాక్టర్లు లైసెన్సులు పొందాలన్న నిబంధన సరిగా పాటించడంలేదు. పాటించిన కొంతమంది కాంట్రాక్టర్లు వారికి నివాసిత ప్రాంతాల్లో కనీస వసతులు కల్పించడంలేదు. వలస కార్మికుల నుంచి కమీషన్‌ పొందడంపై వున్న శ్రద్ధ, వారి బాగోగులపై వుండడంలేదు. కుటుంబాలకు విద్య, వైద్య సదుపాయం కల్పించాలన్న నిబంధన అమలుచేయడంలేదు. ప్రయాణ చార్జీలు ఇవ్వడం లేదు. సెలవులు సరిగా ఇవ్వరు. కనీస వేతనాలు చెల్లించరు. అత్యవసర పరిస్థితుల్లో ఇళ్లకు వెళ్లాలన్నా పంపించరు.
వలస కార్మికుల చట్టం 1979 కార్మికుల హక్కులను, ప్రయోజనాలను పరిరక్షించే అతి ముఖ్యమైన చట్టం. యజమానుల దోపిడి నుంచి రక్షించే చట్టం ఇది. వలస కార్మికుడిని పనిలో పెట్టుకొనేముందు ప్రతీ కాంట్రాక్టర్‌ తప్పనిసరిగా సంబంధిత అధికారి నుంచి లైసెన్స్‌ పొందాల్సి వుంది. వలస కార్మికులను గుర్తించి, వారి ప్రాంతాలను నోటిఫై చేసే బాధ్యతను కార్మికశాఖ తీసుకోవడంలేదు. ఏ వివరాలనూ గుర్తించడంలేదు. ఏ వర్కర్‌ ఎక్కడ నుంచి ఎప్పుడొచ్చాడో, ఏ పరిశ్రమలో ఎంతమంది వలస కార్మికులు ఏ పని చేస్తున్నారో సమాచారం సేకరించరు. వారికి కనీస సదుపాయాలు, వసతులు లభిస్తున్నాయో లేదోనన్న స్థానిక పరిశీలన అసలే లేదు. కనీస వేతనాల చట్టం 1948 నిబంధనల ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వలస కార్మికులకు షెడ్యూల్‌ ఉద్యోగులతో సహా వేతనాలు సవరించాల్సి వుంది. వలస కార్మిక చట్టంలోని సెక్షన్‌ 13 ప్రకారం అంతర్రాష్ట వలస కార్మికులకు కనీస వేతనాల చట్టం 1948 సెక్షన్‌ 41 ప్రకారం నిర్ణయించిన వేతనాల కంటే తక్కువ చెల్లించకూడదు. పని, నివాసిత ప్రాంతాల్లో వలస కార్మికులపై ఎటువంటి దౌర్జన్యాలకు పాల్పడకుండా తగిన రక్షణ చట్టాలున్నాయి. అయితే, సరళీకరణ నేపథ్యంలో పరాయీకరణ పెరిగింది. యాజమానులు తమ దోపిడీని మరింత విస్తృతం చేసుకోవడానికి వలస కార్మికులతో రాత్రి, పగలు అత్యధిక గంటలు పని చేయిస్తున్నారు.

అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వలస కార్మికుల చట్టాల అమలుపై శ్రద్ధ పెట్టడం లేదు. యాజమాన్యానికి అనుకూలమైన విధానాలు, చట్టాలను తీసుకొచ్చాయి. దీంతో అవి దేశంలో 4.14 కోట్లకు పైగా వున్న వలస కార్మికులతో వెట్టి చాకిరీ చేయించుకొనే అమానవీయ పద్ధతులను అనుసరిస్తున్నాయి. ప్రధానంగా సెజ్‌లలో కార్మిక సంఘాలు పెట్టుకొనే అవకాశం లేకపోవడంతో కాంట్రాక్టర్లు, యజమానులకు వలస కార్మికులను దోపిడీ చేయడం, మోసగించడం మరింత సులభమైంది. అయితే, కేరళలో సిపిఎం నాయకత్వంలోని వామపక్ష ప్రభుత్వం వలస కార్మికులను అతిథి కార్మికులుగా గుర్తించి ప్రత్యేక చట్టాలు చేసింది. కనీస వేతనాలు అమలు చేస్తోంది. సంక్షేమ పథకాలు వర్తింపజేస్తోంది. ఈ తరహా రక్షణ మిగిలిన రాష్ట్రాల్లో చేయాల్సిన అవసరముంది.

మన రాష్ట్రంలో వలస కార్మికులకు పని ప్రాంతంలో రక్షణకు ప్రతి ఒక్కరికి గుర్తింపు కార్డులు మంజూరు చేయాలి. సొంత రాష్ట్ర ప్రజల వలె ఉచిత వైద్యం, ఉచిత రేషన్‌ సౌకర్యం కల్పించాలి. ప్రభుత్వ పథకాలు అందజేయాలి. పిల్లలకు ఉచిత విద్య అందించాలి. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వలస కార్మికులను గుర్తించి ప్రభుత్వ వెబ్‌సైట్లో వారి వివరాలు నమోదు చేయాలి. వారికి స్థానికంగా ఏ సమస్య వచ్చినా పరిష్కరించే లైజనింగ్‌ అధికారిని నియమించాలి. స్థానిక ప్రాంతాల్లో ఉపాధి లేక కుటుంబ పోషణ కోసం వేర్వేరు ప్రాంతాల్లో పని చేసే వలస కార్మికులను మనుషులుగా గుర్తించాలి. అన్ని రక్షణలూ వారికి కల్పించాలి.

వ్యాసకర్త సిఐటియు అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి జి. కోటేశ్వరరావు

➡️