బడ్జెట్‌కి ముందు వెలువరించే ఆర్థిక సర్వే ప్రకారంగా వివిధ తరగతులకు లబ్ధి జరిగేలా బడ్జెట్ రూపొందించవలసిన అవసరం ఉంది. ఆదివాసీ విద్య, వైద్యం విషయమై నిర్లక్ష్యం జరిగిందని ఆర్థిక సర్వే తెలిపింది. దీనికి అనుగుణంగా కాకుండా వివిధ వర్గాలకు అన్యాయం చేసేలా ముఖ్యంగా ఆదివాసులపై మరింత దోపిడీ పెంచేవిధంగా, ఆదివాసీ ప్రాంత వనరులను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే విధంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గిరిజనుల అభివద్ధికి నిధులు కోత పెట్టారు.
రూ.50,65,345 కోట్ల బడ్జెట్‌లో జనాభా నిష్పత్తి ప్రకారం గిరిజనులకు ఏమాత్రం కేటాయింపులు జరిగాయో చూద్దాం. దేశ గిరిజన జనాభా సుమారు 8.8 కోట్లు. జనాభా నిష్పత్తి ప్రకారం కేటాయింపులు 8.6 శాతం అంటే రూ. 5,88,993 కోట్లు కేటాయించాల్సి ఉండగా కేవలం ఈ ఏడాది రూ.1,29,249 కోట్లు మాత్రమే కేటాయించి గిరిజనులకు తీరని అన్యాయం చేశారు. ఇందులోనే గిరిజన వ్యవహారాల శాఖకు ఈ ఏడాది కేవలం రూ.14,925 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారు. గిరిజనుల అభివృద్ధికి నేరుగా ఉపయోగపడే రంగాల్లో కేటాయింపులు పూర్తిగా తగ్గించి కార్పొరేట్లు, బడా కాంట్రాక్టర్లు, ధనవంతులకు లబ్ధి చేకూర్చే రంగాల్లో మాత్రం గణనీయమైన కేటాయింపులు చేశారు.
ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు గతేడాది రూ.440 కోట్లు కేటాయించగా ఈ ఏడాది రూ.313 కోట్లు, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు గతేడాది రూ.2432 కోట్లు కేటాయించగా ఈ ఏడాది రూ.30 కోట్లు మాత్రమే అదనంగా పెంచి చూపించారు. దేశంలో గణనీయంగా పెరుగుతున్న గిరిజన విద్యార్థుల సంఖ్యతో పోల్చుకుంటే ఇవి ఏ మాత్రం సరిపోదు.
రాజ్యాంగబద్ధంగా 275(1) అధికరణ ద్వారా షెడ్యూల్డ్ ప్రాంత గిరిజనుల అభివృద్ధికి గ్రాంట్‌గా ఇవ్వాల్సిన నిధులను సైతం పెంచకపోవడం దుర్మార్గం. దీనికి గతేడాది రూ. 1541 కోట్లు కేటాయించగా ఈ ఏడాది ఒక్క రూపాయి కూడా అదనంగా కేటాయించలేదు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో భాగంగా తెలంగాణ, ఆంధ్రలో గిరిజన యూనివర్సిటీలు మంజూరు చేసి పదేళ్లు దాటినా అతీగతీ లేదు. ఈ బడ్జెట్‌లో ఆంధ్ర, తెలంగాణ యూనివర్సిటీలకు కలిపి ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా గిరిజనులను కేంద్రం మోసం చేసింది. రాజ్యాంగం ప్రకారం గిరిజనులకు హక్కుగా కేటాయింపులు చేయాల్సిన గిరిజన సబ్‌ప్లాన్‌ను సైతం రద్దు చేసింది.
ఆదివాసీలకు ఉపాధి వంటి రంగాల్లో కీలకమైన స్కిల్ డెవలప్‌మెంట్‌కు నిధులను అధికంగా కేటాయించకపోవడం బాధాకరం. ఆదివాసీ నిరుద్యోగులు ఉద్యోగావకాశాలు పొందేలా ఈ బడ్జెట్‌లో కేటాయింపులు లేవు. చేసిన కొద్దిపాటి కేటాయింపు సైతం డేటా సెంటర్లకు లాభాలు కల్గించేలా ఉంది. ఈ రంగానికి బడ్జెట్‌లో రూ.317 కోట్ల నిధులు కేటాయించారు. గత ఏడాది రూ.470 కోట్లు కేటాయించారు. అంటే పోయిన సంవత్సరం కేటాయించిన బడ్జెట్‌లో కోత విధించారన్నమాట.
గిరిజనుల్లో పారిశ్రామిక వ్యాపార అవకాశాలు పొందే విధంగా కేటాయింపులు లేవు. గతేడాది చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి బడ్జెట్ కేటాయింపులు చూసినప్పుడు గతేడాది రూ.10,881 కోట్లు ఈ ఏడాది రూ.2116 కోట్లు నిధులు మాత్రమే కేటాయించారు. ఆ నిధుల కేటాయింపు కూడా కార్పొరేట్ సంస్థల ఖాతాలో స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో పోతుంది.
గిరిజన శాఖల నిధులను ప్రభుత్వం దారి మళ్లిస్తున్నది. ఉదాహరణకు గత ఏడాది రూ.16,300 కోట్లు నిధులను హైవే రోడ్లకు కేటాయించారు. ఇదిలా వుండగా ఆదివాసుల గ్రామాల్లో రోడ్లు, మౌలిక వసతులు లేని కారణంగా రోజూ డోలీ మోతలే కనిపిస్తాయి. పైగా కేటాయించిన నిధులను కూడా ఖర్చు చెయ్యడం లేదు.
బడ్జెట్ కేటాయింపులలో ఆదివాసీలకు ఉపాధి భరోసా ఇవ్వలేదు. బడ్జెట్ కేటాయింపులో కేవలం రూ.2 వేల కోట్ల నిధులు చూపించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో నియామకాలు లేవు. బ్యాక్‌లాగ్ పోస్టుల ఉసే లేదు. వలసల నివారణకు చర్యలు లేవు. అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలపై ఎటువంటి నిధులూ కేటాయించలేదు. 2021-22 కేంద్ర బడ్జెట్‌లో రూ.155 కోట్ల నిధులు కేటాయించిన తర్వాత ఇప్పటి వరకూ రూపాయి కేటాయించలేదు.
గత ఏడాది ఆర్టికల్ 275(1) ప్రకారం రూ.1541 కోట్లు కేటాయించగా ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపులు లేవు. ఈ నిధులు ఎక్కువగా ఆదివాసీ ప్రాంతంలో సంక్షేమం కోసం ఖర్చు చేస్తుంది. ఐటిడిఎలో ఈ నిధులతోనే గతంలో సంక్షేమ పథకాలకు కొంత సహాయం అందేది. ఇప్పుడు నిధులు లేక ఐటిడిఏలు ఉత్సవ విగ్రహాలుగా తయారయ్యాయి.
ప్రధాన మంత్రి జన్మభూమి యోజన (పి.ఎమ్ జన్మన్) లక్ష్యం ప్రాథమిక సదుపాయాల కల్పన, ఆరోగ్యం, విద్య, ఆవాసాల నిర్మాణం, పోషకాహారం అందించడం. దేశంలో 75 రకాల ఆదిమజాతి పివిటిజి వెనుకబడిన ఆదివాసీ గిరిజన తెగల వారు జీవిస్తున్నారు. బడ్జెట్ కేటాయింపులు వారి జీవన ప్రమాణాలు పెంచేవిధంగా లేవు. ఆదివాసులకు ఇళ్ల నిర్మాణానికి, మౌలిక వసతులు, విద్య, వైద్యం, పౌష్టికాహారం కల్పించేందుకు పివిటిజి పథకాన్ని 2023 అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ బల్లుగూడలో ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు. ప్రతిష్టాత్మకంగా ఈ పథకానికి ఐదేళ్లపాటు ఖర్చు చెయ్యడానికి రూ.24 వేల కోట్లు కేటాయిస్తునట్లు ప్రచారం చేశారు. ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.6 వేల కోట్లు కేటాయించారు. జన్మన్ యోజన పథకం ద్వారా ఇంటి నిర్మాణానికి ఈ నిధులు చాలడంలేదు. ఇళ్ల నిర్మాణానికి కనీసం రూ.5 లక్షలు నిధులు కేటాయించాలి.
అటవీ ఉత్పత్తుల గిట్టుబాటు ధరల కోసం 2021, 2022లో రూ.155 కోట్ల నిధులు విడుదల చేశారు. ఆ తర్వాత నిధులు కేటాయింపు లేవు. దేశంలో కోట్లాది మంది ఆదివాసీ ప్రజలు ఆధారపడి జీవిస్తున్న అటవీ ఉత్పత్తుల గిట్టుబాటు ధరల ఊసే లేదు.
షెడ్యూల్ ప్రాంతంలో టూరిజం అభివృద్ధికి భారీ ఎత్తున ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు సుమారు రూ.20 వేల కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రకటించింది. కానీ వాస్తవానికి సహజ వనరులను, అడవిని, భూమిని కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పేందుకే ఈ ఎత్తుగడ. దీనికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సభాపతి 1/70 చట్టాన్ని సవరించాలని ప్రకటించారు.
ఆదివాసీలకు అన్యాయం చేసిన కేంద్ర బడ్జెట్‌పై నిరసన కార్యక్రమాలు చేపట్టాలి. ప్రభుత్వంపై ఒత్తిడి చేసి బడ్జెట్ కేటాయింపులు పెంచుకోవాలి.
– వ్యాసకర్త : కిల్లో సురేంద్ర, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు,
సెల్ : 9490630715