బిజెపి హఠావో.. ఢిల్లీ బచావో.. తీర్పు ఎటు?

దేశ రాజధాని మాత్రమేగాక బిజెపి భవిష్యత్తు అంచనాలపై తీవ్ర ప్రభావం చూపే ఢిల్లీ శాసనసభ ఎన్నికలు రానే వచ్చాయి. ఫిబ్రవరి 5న ఎన్నికలు, 8న ఫలితాల ప్రకటన ఎలా వుంటుందనే దానిపై దేశమంతా ప్రత్యేకాసక్తిగా ఎదురు చూస్తుంది. ఢిల్లీ రాజధాని మాత్రమే గాక వివిధ రాజకీయ శక్తుల మధ్య పోరాటంలో ఒక కీలక పాత్ర వహిస్తుంది. దీర్ఘకాలం పాటు బిజెపి పట్టులో వుండి తర్వాత కాంగ్రెస్‌ హ్యాట్రిక్‌లు చూసి ఆ పైన శాసనసభ వరకూ ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) కంచుకోటగా కనిపించిన ఢిల్లీ పయనం ఎటు? స్థానికంగానేగాక దేశ రాజకీయాల్లోనే కొత్త మలుపుగా ఏర్పడిన కొద్ది కాలంలోనే అధికార పార్టీగా మారి ఆ పైన పంజాబ్‌కూ విస్తరించిన తొలి ప్రాంతీయ పార్టీగా ఆప్‌ ఇక్కడ తన పట్టు నిలబెట్టుకుంటుందా? ఒక దశలో జాతీయ ప్రత్యామ్నాయంగా ప్రచారమై తర్వాత సిబిఐ, ఇ.డి కేసులలో వరుసగా సవాళ్లనెదుర్కొని పదవిని కూడా వదులుకున్న అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇతర నాయకుల ప్రభావం ఇప్పుడెలా వుంటుంది? కేంద్ర పాలిత ప్రాంతంగా వుంటూనే రాష్ట్ర హోదా పొందిన ప్రత్యేక రాజ్యాంగ నిబంధనల కింద అటు మోడీ ప్రభుత్వ చెలగాటాలకు కొట్టుమిట్టాడే ఎన్‌సిఆర్‌డి (నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌-ఢిల్లీ) ప్రతిపత్తి నిలబడుతుందా? ఈ కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన స్పష్టమైన తీర్పుల స్ఫూర్తి నిలబడేలా ప్రజల తీర్పు రావడానికి ఏం చేయాలి? ఇవన్నీ ఈ ఎన్నికలలో కీలక ప్రశ్నలుగా వున్నాయి.

ఆప్‌ తొలి అడుగులు

1952లో ఏర్పడిన ఢిల్లీ అసెంబ్లీ అనేక మలుపులు చూసింది. 1956లో దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా నేరుగా రాష్ట్రపతి ఆధ్వర్యంలోకి మార్చారు. మంత్రివర్గాన్ని, శాసనసభను రద్దు చేసి మునిసిపల్‌ కార్పొరేషన్‌గా చేశారు. పదేళ్ల తర్వాత 1966లో ఢిల్లీకి నిర్ణయాధికారాలు లేని మెట్రోపాలిటన్‌ కౌన్సిల్‌గా మార్చారు. ఆ కౌన్సిల్‌గా వున్నంత కాలం అప్పటి జనసంఘం, బిజెపి/ఆరెస్సెస్‌ల ఆధిపత్యమే నడుస్తుండేది. వాజ్‌పేయి, రాజేశ్‌ ఖన్నా, సిఎం స్టీఫెన్‌ వంటి హేమాహేమీలు పోటీ చేస్తుండేవారు. 1991లో 69వ రాజ్యాంగ సవరణ ద్వారా మళ్లీ అసెంబ్లీని తీసుకురావడమే గాక ఎన్‌సిఆర్‌డిగా ప్రకటించారు. 1993 ఎన్నికల్లో బిజెపి గెలిచాక మదన్‌లాల్‌ ఖురానా, తర్వాత సాహెబ్‌ సింగ్‌ వర్మ బిజెపి ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఖురానా అవినీతి ఆరోపణల్లో దిగిపోయాక వచ్చిన వర్మ కూడా విమర్శలపాలు కావడంతో ఆఖరి అస్త్రంగా సుష్మా స్వరాజ్‌ను కొద్ది వారాల ముఖ్యమంత్రిని చేశారు. కానీ కాంగ్రెస్‌ సీనియర్‌ షీలా దీక్షిత్‌ ముందు స్వరాజ్‌ తట్టుకోలేకపోయారు.1998 నుంచి 2013 వరకూ షీలా దీక్షిత్‌ అప్రతిహతంగా పాలించారు. అయితే కాంగ్రెస్‌ యుపిఎ2 వరుస కుంభకోణాల కేసులలో చిక్కిపోయాక అంతా తలకిందులైంది. సరిగ్గా ఆ అవినీతిపై పోరాటంలో అన్నా హజారేతో కలసి పనిచేసిన అరవింద్‌ కేజ్రీవాల్‌ మరికొందరు విద్యాధిక నేతలతో, మాజీ అధికారులతో కలసి ఆప్‌ స్థాపించారు. పౌర సమస్యల పరిష్కారం, అవినీతి నిర్మూలన వాగ్దానాలతో ప్రజల్లోకి చొచ్చుకెళ్లారు. 2013లో 28 స్థానాలతో ఆప్‌ పెద్ద పార్టీగా వచ్చింది. కాంగ్రెస్‌ 13 స్థానాలు పొందింది. కాంగ్రెస్‌ ఆలస్యంగా ఆప్‌కు మద్దతు ప్రకటించినా కేజ్రీవాల్‌ 49 రోజుల్లోనే రాజీనామా చేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించినా 2015లో జరిగిన శాసనసభ ఎన్నికలకు వచ్చేసరికి ఆప్‌ 70లో 67 సీట్లు గెలుచుకుని విజయ దుందుభి మోగించింది. కాంగ్రెస్‌కు ఒక్క స్థానం రాకపోగా బిజెపి మూడు సీట్లకు పరిమితమైంది. ఆప్‌ పాలనలో కొన్ని లోపాలు, అస్పష్టతలు వున్నా బిజెపి, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా ప్రజల మద్దతుతో 2020లో మళ్లీ విజయం సాధించగలిగింది. కాకపోతే ఈ సారి 62 స్థానాలకు పరిమితమవగా బిజెపి బలం పెంచుకుంది. కాంగ్రెస్‌ ఎంత హడావుడి చేసినా ప్రజల ఆదరణ పొందలేకపోయింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఆధిక్యత సాధించిన బిజెపి మరీ ముఖ్యంగా ప్రధాని మోడీ ఢిల్లీని కైవశం చేసుకోవడానికి అన్ని అస్త్రాలు ప్రయోగించారు. పైగా ఈలోగా 2022లో పంజాబ్‌లోనూ ఆప్‌ అధికారంలోకి రావడం వారికి మరింత కంటగింపుగా మారింది.

రాజ్యాంగ ప్రతిపత్తికే చేటు

రాజ్యాంగ రీత్యా ఢిల్లీ ప్రత్యేక పరిస్థితిని ఆసరా చేసుకుని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను అడ్డం పెట్టుకుని అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తూ వేధించారు. పోలీసుల పహారా నుంచి గాలింపుల దాకా, ఆర్థికాంశాలు కీలక నియామకాల దాకా ప్రతిదీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ చేస్తుంటే ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి నిస్సహాయంగా చూడవలసిన పరిస్థితి కల్పించారు. దీనిపై ఆప్‌ ప్రభుత్వం కేసు వేయగా సుప్రీం కోర్టు కూడా రాజ్యాంగ ప్రకారం భద్రత, పర్యావరణం వంటివి తప్ప మిగిలిన విషయాల్లో ఢిల్లీ ప్రభుత్వమే నిర్ణయాత్మకమని తీర్పు చెప్పింది. దాంతో 2023 మార్చిలో రాజ్యాంగాన్ని మార్చి ప్రభుత్వమంటే లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మాత్రమేనన్నట్టు సవరించారు. దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని కేజ్రీవాల్‌తో సహా అనేక మందిని అరెస్టు చేసి కేంద్ర పెత్తనమే సాగించారు. దేశానికి ప్రతీకగా భిన్న రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలతో కూడిన ఢిల్లీని వారి తీర్పు ప్రకారం గాక తమ రాజకీయ అవసరాల మేరకు పాలించాలనుకోవడం మోడీ సర్కారు నిరంకుశత్వానికి నిదర్శనం. లిక్కర్‌ స్కాం అనేది ఆధారంగా తీసుకుని ఆప్‌ నాయకత్వం కూడా ఒక దశలో మోడీ పట్ల మెతకదనం, కాశ్మీర్‌ 370 రద్దుకు మద్దతు వంటి పనులు చేసినా వీటన్నిటి తర్వాత కళ్లు తెరవక తప్పలేదు. ఇండియా వేదికలో భాగస్వామి కావడం తత్పఫలితమే గానీ ఢిల్లీ ఎన్నికల్లో మాత్రం ఆప్‌కూ కాంగ్రెస్‌కు లేక మరే భాగస్వాములకూ అవగాహన, సర్దుబాట్లు జరగలేదు. ఈ సమయంలో బిజెపిని ఓడించడం, ఢిల్లీ రాజ్యాంగ ప్రతిపత్తిని కాపాడుకోవడం ప్రధాన లక్ష్యం గనక అందుకు కారణమైన బిజెపిని ఓడించడం కీలకంగా ముందుకొచ్చింది. ఎన్నికల పోరాటం కూడా దానికి తగినట్టే జరగనుంది.

పోటీ ఇద్దరి మధ్యేనా?

మూడు పార్టీల మధ్య పోటీ అంటున్నా వాస్తవంలో బిజెపి, ఆప్‌లకే కీలక సమరం జరుగుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. 2020 ఎన్నికల్లో ఆప్‌కు 53.57 శాతం, బిజెపికి 38.5 శాతం ఓట్లు రాగా కాంగ్రెస్‌కు కేవలం 4.26 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. బిజెపి లోక్‌సభ స్థానాలన్నీ తెచ్చుకున్నా గతంలో వలెనే శాసనసభలో అది నిలుస్తుందా అనేది ప్రశ్నగా వుంది. ఇండియా వేదిక పార్టీల మధ్య తేడాలున్నా బిజెపి ఏకపక్ష దాడి నుంచి ఢిల్లీ రాజ్యాంగ స్థానాన్ని కాపాడుకోవాలన్న దానిపై ఏకాభిప్రాయం వుంది. వామపక్షాలు, సిపిఎం గట్టిగా అదే వైఖరి ప్రకటించాయి. సిపిఎం, సిపిఐ, ఎంఎల్‌ పార్టీలు చెరో రెండు స్థానాల్లో పోటీ చేస్తూ మిగిలిన సీట్లలో బిజెపిని ఓడించేవారికే మద్దతునివ్వాలని ప్రకటించాయి. సమాజ్‌వాది పార్టీ టిఎంసి ఆప్‌ను బలపరుస్తున్నాయి. కాంగ్రెస్‌ విషయానికి వస్తే ఇటీవల హర్యానా శాసనసభ ఎన్నికల్లో ఆప్‌కు కనీస స్థానాలు కేటాయించేందుకు నిరాకరించింది. తర్వాత మహారాష్ట్రలోనూ అంతే జరిగింది. తాను బలంగా వున్న చోట్ల ఇతర పార్టీలతో సీట్ల సర్దుబాటు చేసుకోకుండా తను లేని చోట మాత్రం ఇతరులు ఇవ్వాలని కోరుకోవడం ఇండియాలో భాగస్వాములు ఆమోదించడం లేదు. ఢిల్లీ వరకైతే ఆప్‌, కాంగ్రెస్‌ రెండూ వంటరిగానే వెళతామని గతంలోనే ప్రకటించాయి. ఆప్‌ కూడా అదే కోరుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఢిల్లీలో సిక్కులపై సాగిన మారణకాండ బిజెపి అమ్ముల పొదిలో నిరంతరం అస్త్రంగా వుంది. ఇప్పటికీ ఆ పార్టీ నాయకులు కాంగ్రెస్‌పై వ్యాఖ్యలతో చర్చ దారి తప్పించే ప్రయత్నం చేస్తూనే వుంటారు. తాజాగా బిజెపి మాజీ ఎంపి రమేష్‌ బిధూరి ఢిల్లీ రోడ్ల మరమ్మతుల సాకుతో ప్రియాంక పట్ల అభ్యంతరకరంగా మాట్లాడ్డం, ప్రస్త్తుత ముఖ్యమంత్రి అతిషి పైనా చవకబారు వ్యాఖ్యలు చేయడం ఇందులో భాగమే. అతిషిని అధికార నివాసం శేష్‌ మహల్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్న బిజెపి నేతలు దానిపైనే పెద్ద ఎన్నికల చర్చ చేసి దారి తప్పించాలని పాచికలు వేస్తున్నారు. కాంగ్రెస్‌, బిజెపి తమ ముఖ్యమంత్రి అభ్యర్థులెవరో చెప్పలేదు గానీ ఆప్‌ మాత్రం మళ్లీ కేజ్రీవాల్‌ను తేవాలన్నదే నినాదంగా చేసుకున్నది. ఇందుకోసం పంజాబ్‌ ముఖ్యమంత్రి మాన్‌తో సహా 70 మంది ఆప్‌ ఎంఎల్‌ఎలు వచ్చి ప్రచారం చేస్తున్నారు. పొలిటికల్‌ స్టార్టప్‌ లాంటి ఆప్‌ పదేళ్ల తర్వాత ఎలా తన స్థానం కాపాడుకుంటుందన్నదే అందరూ ఆసక్తిగా చూస్తున్న విషయం. 2027లో పంజాబ్‌ ఎన్నికలు వస్తాయి గనక ఢిల్లీని పోగొట్టుకుంటే అక్కడా నష్టం జరుగుతుందనే అంచనా ఆప్‌లో వుంది. వరుస ఆరోపణల తర్వాత ఆ పార్టీ కూడా కొంత ఆత్మవిమర్శ చేసుకుంటుందా లేదా అన్నది ముఖ్యమైన విషయం. ఊగిసలాటలు, అస్పష్టతలు, తొందరపాటు ప్రకటనలు మేలు చేయవని కూడా ఈ కాలంలో తేలిపోయింది.

పథకాలు, వాగ్దానాలు

కేంద్ర నిరంకుశత్వం, అక్రమ కేసులతో వేధింపులు, తమ సంక్షేమ పథకాలు కీలకంగా ఆప్‌ ప్రచారం చేసుకుంటుండటమే గాక కొత్త పథకాలు కూడా ప్రకటిస్తున్నది. విద్యుత్‌ నీటి సరఫరా, ఆరోగ్యం విద్య, మహిళల బస్సు ప్రయాణం ఉచితమన్నది వారి వాగ్దానం. దానికి తోడు ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్‌ యోజన కింద మహిళలకు రూ.2100 సహాయం చేస్తామంటున్నది. బిజెపి కూడా ఉచిత విద్యుత్‌ లాంటి వాగ్దానాలు చేయడంతో పాటు తాము వస్తే ఆప్‌ పథకాలను రద్దు చేస్తామన్నది ప్రచారం మాత్రమేనని ఖండిస్తున్నది. ఢిల్లీ ప్రచార భారం భుజాలపై వేసుకున్న ప్రధాని మోడీ మాట్లాడుతూ అన్నీ కొనసాగిస్తామని భరోసాతో ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌ ప్యారీ దీదీ యోజన జీవన్‌ రేఖ పేరిట రూ.2500 ఇస్తానంటున్నది. ఇలా మొత్తంపైన వాగ్దానాలు పథకాల పోటీగా ఎన్నికలు నడుస్తున్నాయి. వాస్తవానికి మీడియాను చూసే వారికెవరికైనా ఢిల్లీ కాలుష్యం గురించిన చర్చ, తీర్పులు కనిపిస్తాయి. ధరల భారం, నిరుద్యోగం వంటి వాటితో పాటు దేశ రాజధానిగా మౌలిక సమస్యలు, తీవ్ర కాలుష్యంపై తక్కువగా చర్చ నడుస్తుండడం ఒక విచిత్రం. బిజెపి అయితే వీటితో బంగ్లా శరణార్థులు రోహింగ్యాల రాకను ప్రధాన సమస్యగా మతపరమైన అంశాలను ముందుకు తెస్తున్నది. ఓటర్ల జాబితాలోనూ మైనార్టీలను పెద్ద ఎత్తున తొలగించారనే ఆరోపణలున్నాయి. అందుకే ఎన్నికల సంఘం వాటిని తిరస్కరించేందుకు చాలా పెనుగులాడింది. ఈ మధ్యనే రైతుల ఆందోళన పట్ల ఎలా వ్యవహరించారో చూశాం. ఢిల్లీ రాజధాని కావడంతో అక్కడ నిరసనలు తెలిపే హక్కు వంటి వాటిని కాపాడుకోవడానికి కూడా బిజెపిని ఓడించాలని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. స్వయంగా మోడీనే ప్రచార బాధ్యత మీద వేసుకోవడంతో పాటు ఎనిమిది నెలలుగా ఢిల్లీ ఎన్నికలకు సన్నాహాలు చేస్తున్నారు. ఆప్‌ను ఇక సహించం, మార్పు సాధిస్తాం అన్న ఎన్నికల నినాదం ఎత్తుకున్నారు. ఇన్నిటి మధ్యనా ప్రజల తీర్పు ఎలా వుంటుందో చూడాల్సిందే.

తెలకపల్లి రవి

➡️