ఉక్రెయిన్‌ పోరు ముగిసేనా !

Feb 14,2025 08:35 #Articles, #edit page, #Putin, #Trump, #Ukraine, #War

అమెరికా అధినేత డోనాల్డ్‌ ట్రంప్‌ బుధవారం నాడు రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌తో గంటన్నరపాటు ఫోన్లో చర్చలు జరిపారు. ఉక్రెయిన్‌ పోరును ముగించేందుకు సంప్రదింపులు ప్రారంభించేందుకు ఇద్దరూ అంగీకరించారు. ఇద్దరు నేతలూ సౌదీ అరేబియాలో భేఠీ అయ్యే ముందు ఇరు దేశాల ప్రతినిధి వర్గాలు చర్చలు జరుపుతాయి. ఇదీ బుధ, గురువారాల నాటి వార్తల సారం. మరోవైపున అంతకు ముందు రోజు ఉక్రెయిన్‌ నేత జెలెన్‌స్కీ ఏమన్నాడు! ఉక్రెయిన్‌ లేకుండా ఉక్రెయిన్‌ గురించి చర్చలు కుదరవు. మా భూభాగాలను తిరిగి ఇస్తే దానికి బదులుగా మేము ఆక్రమించుకున్న కురుస్క్‌ ప్రాంతాన్ని రష్యాకు అప్పగిస్తాం అన్నాడు. ససేమిరా అది కుదిరేది కాదని రష్యా స్పష్టం చేసింది. ఏ సంప్రదింపుల్లో అయినా ఐరోపా, ఉక్రెయిన్‌కు భాగస్వామ్యం ఉండాల్సిందే. ఉక్రెయిన్‌ భద్రతకు గట్టి హామీ కావాలంటూ బ్రిటన్‌, ఫ్రాన్సు, జర్మనీతో సహా ఏడు నాటో కూటమి దేశాలు ఒక సంయుక్త ప్రకటనలో స్పష్టం చేశాయి. ఇదీ తాజా పరిస్థితి. అనేక చిక్కుముడులు వున్నందున దీన్నుంచి ఎలా ముందుకు పోయేదీ తెరమీద చూడాల్సిందే తప్ప ఊహించి చెప్పలేము.

తాను అధికారానికి వచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే ఉక్రెయిన్‌ పోరును ముగిస్తా అని ట్రంప్‌ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే అది అంత తేలిక కాదని, ఒక వేళ ముగియాలన్నా కొన్ని నెలలు పడుతుందని అతగాడి యంత్రాంగం చెప్పిన తరువాత తీరు మారింది. తమ ఆయుధాలు అమ్ముకోవటానికి, లాభాలను కొనసాగించటానికి ఉక్రెయిన్‌ పోరు కొనసాగాలని అమెరికా ఆయుధ పరిశ్రమ ఒత్తిడి తెస్తున్నది. నిజానికి ఉక్రెయిన్‌ పోరుతో నిమిత్తం లేకుండానే నాటో కూటమి దేశాలు జిడిపిలో రెండు శాతం మొత్తాలను ఖర్చు చేయాలని ఎప్పటి నుంచో అమెరికా ఒత్తిడి తెస్తున్నది. ఐరోపా రక్షణకు తామెందుకు మూల్యం చెల్లించాలని తొలిసారి అధికారానికి వచ్చినపుడే ట్రంప్‌ ప్రశ్నించాడు. ఇప్పుడు కనీసం ఐదు శాతం ఉండాలని చెబుతున్నాడు. అమెరికా 3.4 శాతం, బ్రిటన్‌ 2.3, రష్యాకు దగ్గరగా ఉన్న పోలాండ్‌, బాల్టిక్‌ దేశాలు నాలుగు శాతానికి అటూ ఇటూగా ఖర్చు చేస్తున్నాయి. ఇదంతా రష్యాను బూచిగా చూపుతున్న ఫలితమే. ప్రతిదాన్నీ డాలర్లలో కొలుచుకొనే ట్రంప్‌కు ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని పరిష్కరిస్తే అమెరికన్లకు నష్టమే తప్ప లాభం ఉండదు. అందువలన పుతిన్‌తో చర్చలు జరిపినా నిజంగా పరిష్కారానికి ట్రంప్‌ ముందుకు వెళతాడా అన్నది సందేహమే. ఇజ్రాయిల్‌-హమాస్‌ మధ్య కుదిరిన ఒప్పందానికి విఘాతం కలిగించే విధంగా గాజా ప్రాంతం నుంచి పాలస్తీనియన్లు ఈజిప్టు, జోర్డాన్‌ వెళ్లి ఆ ప్రాంతాన్ని తమకు అప్పగించాలని ట్రంప్‌ కోరటం చూస్తున్నదే. ఒక వైపు 2014కు ముందు ఉన్న స్థితి గురించి ఉక్రెయిన్‌ పట్టుబడితే అది వాస్తవికతకు దూరం అని, కొన్ని ప్రాంతాలను వదులుకోక తప్పదనే సందేశాన్ని అమెరికా ఇస్తున్నది. మరోవైపు విలువైన ఖనిజ సంపదలున్న ప్రాంతాలను తమకు అప్పగిస్తే ఉక్రెయిన్‌కు సాయం చేస్తామని కూడా అది బేరం పెట్టింది. దీనికి ఐరోపాలోని ధనిక దేశాలు అంగీకరిస్తాయా అంటే లేదు అని వేరే చెప్పనవసరం లేదు.

చర్చలు జరపాలన్న ట్రంప్‌ ప్రతిపాదనను రష్యా వ్యతిరేకించదు. చర్చలు, పరిష్కారం తన ఎజెండా ప్రకారం జరగాలని అది కోరుకుంటున్నది. నాటోను తమ దిశగా విస్తరించకూడదు. ఉక్రెయిన్‌కు చోటు కల్పించకూడదన్న హామీ కావాలని అది తొలి నుంచీ డిమాండ్‌ చేస్తున్నది. దానికి తిరస్కరించిన కారణంగానే గతంలో తనలో భాగంగా ఉన్న క్రిమియా ప్రాంతాన్ని 2014లో ఉక్రెయిన్‌ నుంచి విలీనం చేసుకున్నది. తూర్పు, దక్షిణ ప్రాంతాలలో తలెత్తిన వేర్పాటువాదానికి మద్దతు ఇచ్చి ఇప్పటి వరకు దాదాపు 20 శాతం ప్రాంతాన్ని తమ అదుపులోకి తెచ్చుకుంది. దానితో పోలిస్తే జెలెన్‌స్కీ చెబుతున్న కురుస్కు ప్రాంతాన్ని అసలు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదు. దాన్నుంచి అది వెనక్కు తగ్గటం తప్ప తురుపు ముక్కగా వాడే పరిస్థితిలో లేదు. ట్రంప్‌, అతని అధికార గణం ఆలోచన ప్రకారం నాటోలో ఉక్రెయిన్‌ చేరకూడదు. నిజంగా అదే జరితే జెలెన్‌స్కీ రాజకీయంగా ఆత్మహత్యకు పాల్పడినట్లే. చర్చలు జరిగి ఒప్పందం అంటూ కుదిరితే అది కేవలం సైనిక చర్య నిలుపుదలకే పరిమితం అయితే ఐరోపా దేశాల పరువు పోవటం ఖాయం. ఈ మాత్రం దానికి మూడేళ్లు ఎందుకు ప్రతిఘటించినట్లు అని జనం కూడా ప్రశ్నిస్తారు. ఇంతకాలం జెలెన్‌స్కీ సేనలు రష్యన్లను ఎదుర్కొంటున్నాయంటే అవి ఇచ్చిన ఆయుధాలు, మద్దతే కారణం. ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార సమస్యలో అమెరికా-ఐరోపా దేశాల మధ్య మిత్ర వైరుధ్యం ఉన్నట్లు ఏడు దేశాల ప్రకటన సూచిస్తున్నది. పుతిన్‌తో చర్చల తరువాత జెలెన్‌స్కీ కూడా ట్రంప్‌తో మాట్లాడినప్పటికీ వివరంగా చర్చ జరిగినట్లు మాత్రమే చెప్పాడు తప్ప ఉత్సాహం కనపడలేదు. ఉక్రెయిన్‌ సంక్షోభం పరిష్కారం కావాలని అందరూ కోరుకుంటున్నారు. శాంతి చేకూరాలని కోరుకోవటమే కాదు, దానికి చిత్తశుద్ధితో చేతులు కలపటం కూడా ముఖ్యమే.

– ఫీచర్స్‌ అండ్‌ పాలిటిక్స్‌

➡️