బధిరులకు మెరుగైన సంకేత భాష అందేదెన్నడు ?

Mar 2,2024 07:15 #Editorial
  • మార్చి 3న అంతర్జాతీయ వినికిడి దినోత్సవం

2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం 40 శాతం వైకల్యం కలిగిన వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు పొందేందుకు అర్హులు. కానీ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు మూగ, చెవిటి వికలాంగులకు 51 శాతం వైకల్య ధ్రువీకరణ పత్రం ఉంటేనే ప్రభుత్వ పథకాలు ఇస్తున్నాయి. అంటే 2016 ఆర్‌పిడబ్ల్యుడి చట్టాన్ని తుంగలో తిక్కుతున్నట్లే. 40 శాతం వైకల్యం కలిగిన మూగ చెవిటి వికలాంగులకు సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. బధిరుల కోసం సైన్‌ లాంగ్వేజ్‌ పాఠశాలలు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వాల సమాచారం, జీవోలు సైన్‌ లాంగ్వేజ్‌లో తేవాలి.

                  మాటలు రావడానికి వినికిడి అత్యంత కీలకం. మనిషి మనుగడ సాగించాలంటే వినికిడి మూలమనే విషయాన్ని గుర్తించకపోవడం వలన పుట్టిన శిశువుల్లో అనేక మంది మూగ, చెవిటి పిల్లలుగా మారుతున్నారు. అందుకే వినికిడి లోపాన్ని గుర్తించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ 2007లో మార్చి 3ను అంతర్జాతీయ వినికిడి దినోత్సవంగా ప్రకటించింది. వినికిడి లోపానికి గురైన వారికి మెరుగైన చికిత్స, వినికిడి సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల ప్రజలలో అవగాహన కల్పించడమే ప్రపంచ వినికిడి దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం. ప్రపంచ జనాభాలో 20 శాతం కంటే ఎక్కువ మంది వినికిడి సమస్య కలిగి ఉన్నారు. 2050 నాటికి 700 మిలియన్ల మంది ప్రజలు వినికిడి లోపం కలిగి ఉంటారని అంచనా. 1000 మందిలో 1-3 మంది పిల్లలు వినికిడి లోపంతో పుడుతున్నారని, ప్రతి వెయ్యి మందిలో ఒకరిద్దరు బాల్యంలోనే శాశ్వత వినికిడి లోపంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం 110 కోట్ల మంది యువత వినికిడి లోపంతో బాధపడుతున్నారని అంచనా.

34 మిలియన్ల మంది పిల్లలు వినికిడి లోపం కలిగి ఉన్నారు. వినికిడి లోపం కలిగిన వారిలో 60 శాతం మందికి వినికిడి లోపం నివారించడానికి అవకాశం ఉంది. ప్రజల ఆరోగ్యాలను ప్రభావితం చేస్తున్న అనేక అంశాలలో వినికిడి సమస్య కూడా ఒక్కటి. పెద్ద శబ్దానికి గురికావడం, వృద్ధాప్యం, జ్వరాలు, చెవి ఇన్ఫెక్షన్లు వంటి కారణాలతో వినికిడి సమస్య ఏర్పడుతుంది. వినికిడి లోపం వలన అనేక మంది శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. వినికిడి లోపం కలిగిన వారిలో 80 శాతం మందికి పైగా వినికిడి లోపం నివారణ కోసం ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు అందుబాటులో లేవు. అభివృద్ధి చెండుతున్న దేశాల్లో వినికిడి లోపం కలిగిన విద్యార్థులకు పాఠశాలలు అందుబాటులో లేవు. పుట్టిన ప్రతి శిశువుకు వినికిడి పరీక్షలు చేయించాలి. ఆటోఎకోస్టిక్‌ ఎమిషన్‌ పరీక్ష చేసి వినికిడి సామర్థ్యాన్ని గుర్తించాలి. వినికిడి సామర్థ్యం 30 డిసిబెల్స్‌ కంటే ఎక్కువ ఉంటే భవిష్యత్తులో వినికిడి లోపం ఏర్పడే ప్రమాదం ఉంటుంది. బ్రెయిన్‌ స్టెమ్‌ ఎవకోడ్‌ రెస్పాన్స్‌ ఆడియోమెట్రి (బేరా) పరీక్ష ద్వారా వినికిడి లోపం ఎంత ఉందో తెలుస్తుంది. వినికిడి లోపాన్ని ముందే గుర్తిస్తే వినికిడి పరికరాలు వాడడం, కాక్లియర్‌ ఇంప్లాంట్‌ అమర్చడం వలన వినికిడి లోపం కలిగిన పిల్లలు కూడా అందరి పిల్లలతో సమానంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

ఇండియాలో వినికిడి లోపం సమస్య రోజురోజుకు తీవ్రమవుతున్నది. నేషనల్‌ శాంపిల్‌ సర్వే రిపోర్ట్‌ ప్రకారం ప్రతి లక్ష మందిలో 291 మంది తీవ్రమైన వినికిడి లోపం కలిగి ఉన్నారని, 14 ఏళ్ల లోపు చిన్నారుల్లో వినికిడి లోపం తీవ్రత ఎక్కువగా ఉందని అంచనా. దేశంలో ప్రతి సంవత్సరం సుమారుగా 30,000 మంది వినికిడి లోపంతో పుడుతున్నారని అంచనా. 50 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న డయాబెటిక్‌ వ్యాధిగ్రస్థుల్లో 70 శాతం మందికి వినికిడి లోపం ఉంది. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో వాహనాలు పెరగడం వలన, తీవ్రమైన శబ్ద కాలుష్యం వలన వినికిడి లోపం ఏర్పడడానికి మరో కారణం. వినికిడి లోపాన్ని గుర్తిస్తే తగ్గించడానికి అవకాశం ఉంది. పిల్లలు తల్లి కడుపులో ఉండగానే 16 వారాల గర్భ సమయంలోనే శబ్దాలను వినడం, పుట్టిన వెంటనే తల్లి గొంతును గుర్తుపట్టడం జరుగుతుంది. కొద్దిమంది పిల్లల్లో పుట్టుకతోనే వినికిడి లోపం ఉంటుంది. టీవీ సౌండ్‌ పెద్దగా పెట్టడం, దూరం నుండి పిలిస్తే పలకకపోవడం వంటి సమస్యలను పిల్లల వయస్సుతో పాటు వచ్చే మార్పులలో తేడా కన్పిస్తే వినికిడి లోపం ఉందో లేదో గమనించవచ్చు. వినికిడి లోపానికి మందు లేదు. వినికిడి పరికరాలు వాడడమే పరిష్కారం. ఇయర్‌ఫోన్స్‌ అతిగా వాడడం వలన వినికిడి శక్తి కోల్పోవడంతో పాటు మానసిక ఇబ్బందులు, అసహనం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, నిద్ర లేకపోవడం, తలనొప్పి వంటి సమస్యల బారిన పడుతున్నట్లు అనేక సర్వేల్లో వెల్లడైంది.

భారత ప్రభుత్వం 2000 ఫిబ్రవరిలో తీసుకువచ్చిన శబ్ద కాలుష్య చట్టం ప్రకారం పారిశ్రామిక ప్రాంతాల్లో పగటి పూట 75 డెసిబుల్స్‌, రాత్రి పూట 70 డెసిబుల్స్‌, వాణిజ్య ప్రాంతాల్లో పగటి పూట 65 డెసిబుల్స్‌, రాత్రిపూట 55 డెసిబుల్స్‌, నివాస ప్రాంతాల్లో పగటి పూట 55 డెసిబుల్స్‌, రాత్రి పూట 45 డెసిబుల్స్‌, నిశ్శబ్ద ప్రాంతాల్లో పగటి పూట 50 డెసిబుల్స్‌, రాత్రి పూట 40 డెసిబుల్స్‌ పరిమితి మాత్రమే ఉండాలి. కానీ విద్యాసంస్థలు, హాస్పిటళ్లు, కోర్టు భవనాలున్న ప్రాంతాల్లో 100 మీటర్ల దూరం వరకు నిశ్శబ్ద జోన్లుగా ప్రభుత్వం తీర్మానం చేసింది. వీటిని అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలది. 2000 సంవత్సరంలో ప్రభుత్వం ఆమోదించిన చట్టం అమలు, పర్యవేక్షణ లేకపోవడంతో శబ్ద కాలుష్యం తీవ్రత పెరగడం వలన వినికిడి లోపం ఏర్పడుతుంది. శబ్ద కాలుష్యన్ని నియంత్రిన పెంచాల్సిన అవసరం ఉంది.

2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం 40 శాతం వైకల్యం కలిగిన వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు పొందేందుకు అర్హులు. కానీ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు మూగ, చెవిటి వికలాంగులకు 51 శాతం వైకల్య ధ్రువీకరణ పత్రం ఉంటేనే ప్రభుత్వ పథకాలు ఇస్తున్నాయి. అంటే 2016 ఆర్‌పిడబ్ల్యుడి చట్టాన్ని తుంగలో తిక్కుతున్నట్లే. 40 శాతం వైకల్యం కలిగిన మూగ చెవిటి వికలాంగులకు సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. బధిరుల కోసం సైన్‌ లాంగ్వేజ్‌ పాఠశాలలు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వాల సమాచారం, జీవోలు సైన్‌ లాంగ్వేజ్‌లో తేవాలి. సామూహిక ప్రాంతాల్లో బాధిరుల కోసం సైన్‌ లాంగ్వేజ్‌ సహాయకులను ఏర్పాటు చేయాలి. 77 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో నేటికీ అమెరికన్‌ సైన్‌ లాంగ్వేజ్‌నే వాడుతున్నాం. ఇండియన్‌ సైన్‌ లాంగ్వేజ్‌ అభివృద్ధి పట్ల మన పాలకులకు చిత్తశుద్ధి లేదు. ఇండియన్‌ సైన్‌ లాంగ్వేజ్‌ అభివృద్ధితో దేశంలో ఉన్న మూగ, చెవిటి వికలాంగుల జీవితాల్లో వెలుగులు నిండుతాయి.

పెద్ద పెద్ద శబ్దాలు లేకుండా చూడడం, ఇయర్‌ ప్లగ్‌ వంటి రక్షణ పరికరాల వాడకం తదితర ప్రజారోగ్య చర్యలు చేపట్టడం వలన 50 శాతం వినికిడి లోపాన్ని నివారించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. గర్భిణీ స్త్రీలలో సైటో మేఘలో వైరస్‌ ఇన్ఫెక్షన్‌ నివారించడం, గర్భధారణకు ముందు రుబెల్లా వ్యాక్సిన్‌ వాడడం, బాలికలు, స్త్రీలలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు మందులు వాడకం ద్వారా పుట్టుకతో వచ్చే వినికిడి లోపాన్ని నివారించవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ప్రతిరోజు వ్యాయామం చేయడం, ధూమపానం, మద్యపానాన్ని నివారించడం వలన కూడా వినికిడి లోపాన్ని అరికట్టవచ్చు. సమాజంలో వినికిడి లోపం కలిగిన వారు ఒంటరి వారు కాదు. స్పీచ్‌ థెరపిస్ట్‌, వినికిడి సహాయ పరికరాలు అందుబాటులో ఉండడంతో పాటు సరైన చికిత్స తీసుకోవడం వలన వినికిడి లోపం కలిగిన వారు సాధారణ జీవితాన్ని కొనసాగించే అవకాశం ఉంది.

/వ్యాసకర్త ఎన్‌పిఆర్‌డి జాతీయ ఉపాధ్యక్షులు/ యం. అడివయ్య
/వ్యాసకర్త ఎన్‌పిఆర్‌డి జాతీయ ఉపాధ్యక్షులు/ యం. అడివయ్య
➡️