భారత వ్యవసాయ రంగ ప్రగతిలో జాతీయ వ్యవసాయ పరిశోధనా మండలి, ప్రాంతీయ వ్యవసాయ విశ్వవిద్యాలయాల పాత్ర కీలకం. వాటిలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఒకటి. దానిని రైతు ఉద్యమ నాయకుడు, అఖిల భారత కిసాన్ సభ మొదటి కార్యదర్శి అయిన ఆచార్య ఎన్.జి.రంగా పేరు మీద మార్పు చేసుకొన్నాం. అటువంటి అనేక మంది రైతు నాయకుల స్ఫూర్తితో, రైతు వ్యవసాయాన్ని రక్షించుకోవాలని లక్ష్యంగా పెట్టుకొన్నాం. దేశం సాధించిన హరిత, క్షీర, నీలి విప్లవాలకు దోహద పడిన మానవ వనరు-విద్య విస్తరణ పరిశోధనకు తగినట్లుగా-రూపొందించుకొంటున్నాం. దానికి జాతీయ, అంతర్జాతీయ గుర్తింపుగా అనేక పురస్కారాలు లభించాయి. స్వపరిపాలన మొదటి దశలో కేవలం 50 మిలియన్ టన్నులున్న తిండి గింజల ఉత్పత్తిని మూడు నాలుగు దశాబ్దాల కాలంలో ఐదారు రెట్లు పెంచుకోవటానికి దోహదపడ్డాం. అదే విధంగా పాలు, చేపలు, గుడ్లు, మాంసం, పండ్లు, కూరగాయల ఉత్పత్తులు పెరిగే సాంకేతికాల్ని అభివృద్ధి చేశాం. దేశం ఆహార భద్రతకు చేరగలిగింది.
అయితే, 1990 నుండి మన వ్యవసాయం మరో మలుపు తిరిగింది. కేవలం ఉత్పత్తులపై కేంద్రీకరించిన ఫలితంగా, వ్యవసాయ వనరులు దిగజారాయి. ముఖ్యంగా మన కుటుంబ వ్యవసాయానికి కీలకమైన సన్న-చిన్న కారు రైతులు ప్రతికూల స్థితికి నెట్టబడ్డారు. పర్యావరణ పరంగా, ప్రజారోగ్య రక్షణ పరంగా నష్టపోతూ వస్తున్నాం. ప్రపంచ స్థాయి సంస్థలు క్రోడీకరించిన అంశాల్ని గుర్తించి, వ్యవసాయ పరంగా మార్పులు చేసుకోవాలనే స్థితికి వచ్చాము. లేకుంటే జరుగుతున్న పరిణా మాలు మనల్ని మళ్లీ ఆహార భద్రత లేని దేశంగా మార్చే దశలోకి వస్తామని గుర్తించాము. 2013లో మనం చేసుకొన్న ‘ఆహార హక్కు చట్టం’ నీరు కార్చే స్థితిలోకి వచ్చిందా? అని గందరగోళం వైపు నెట్టబడ్డామా? దీనికి ప్రపంచ వాణిజ్య సంస్థ (గాట్) తెచ్చిన, మేధోపర హక్కు నియమాలు (ఐ.పి.ఆర్) వ్యవసాయాన్ని కూడా ప్రభావితం చేశాయి. భారత దేశానికి అనువైన కుటుంబ వ్యవసాయం బదులుగా ఐరోపా, అమెరికా, జపాన్, ఇజ్రాయిల్ కార్పొరేషన్ల వ్యవసాయాన్ని మనం కూడా అమలు చెయ్యాల్సిన స్థితికి నెట్టబడ్డాం. వ్యవసాయం ముఖ్య మానవ వనరైన సన్న చిన్నకారు రైతులు, దిన కూలీలు నిరుద్యోగులుగా మారుతున్న దశ మొదలయ్యింది. పంటల విత్తనాలు కంపెనీల గుత్త సొమ్ముగా మారాయి. అలాగే వ్యవసాయ రసాయనాలు, ఇతర ఉపకరణాలు అత్యంత ‘ఖరీదుగా’ మారాయి. పంటల ఉత్పత్తి పెట్టుబడులు అనూహ్యంగా పెరిగాయి.
ఈ పరిణామాల్ని గుర్తించిన కొందరు వ్యవసాయ రంగ అనుభవ నేపథ్యమున్న వారు ‘మన కోసం మనం’ అనే డా.వర్గీస్ కురియన్ తాత్వికతను ముందుకు తెచ్చే ప్రయత్నం 2012లో గుంటూరు జిల్లాలో మొదలెట్టారు. ముఖ్యంగా పంట విత్తనాలపై హక్కు రైతుకు వుండాలని రైతులు తక్కువ పెట్టుబడితో సాగు వైపు మరలే విధంగా పరిశోధనా రంగం, విస్తరణ శాఖలు పని చేయాలని ఉద్యమాన్ని మొదలెట్టారు. ప్రాంతీయంగా గుంటూరు ప్రకాశం, కృష్ణా, ఖమ్మం జిల్లాల పత్తి రైతుల్ని పరస్పర సహకార సహాయ సంఘాల ద్వారా ప్రభావితం చేసే ప్రయత్నాలు మొదలెట్టారు. వారికి సహకారంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ‘లాం’, శాస్త్రవేత్తలు, గుంటూరు వ్యవసాయ శాఖ విస్తరణాధికారులు రైతు శిక్షణలు జరిపారు. దాన్ని ‘రైతు రక్షణ వేదిక’గా నడిపారు. అయినా ఆ ప్రయత్నం ఇంకా ప్రారంభ స్థాయిని దాటలేదు. దానికి ముఖ్య కారణం స్థానిక విత్తన వ్యవసాయ రసాయన కంపెనీల ప్రచార హోరు, తాత్కాలిక ఫలితాలిచ్చే ఉపకరణాల జోరు. రైతు రక్షణ వేదిక సభ్యులు కొందరు ప్రభుత్వ సహకారంతో, దాతృత్వ పెట్టుబడిదారుల దన్నుతో నడపబడే ప్రకృతి వ్యవసాయం, వరవడిలో పడ్డారు. అయినా ఆంధ్రప్రదేశ్ నిరంతరం వ్యవసాయ సంక్షోభ రాష్ట్రంగానే గుర్తించబడుతున్నది. రైతుల ఆత్మహత్యలు ఆగలేదు. వ్యవసాయ రసాయనాల వాడుక పరంగా రాష్ట్రం మొదటి వరసలోనే ఉంది. ప్రభుత్వం నియమించిన వ్యవసాయ సంక్షోభ కమిటీల సిఫార్సులు అమలుకు నోచుకోలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రొ.స్వామినాధన్ నేతృత్వాన అధ్యయన కమిటీని వేసింది. ఆ కమిటీ సూచించిన అంశాన్ని గత యు.పి.ఎ ప్రభుత్వంగాని, ఇప్పటి ఎన్.డి.ఎ ప్రభుత్వం గాని పట్టించుకోలేదు. దానికి స్పందించిన ప్రొ.స్వామినాథన్ తన అభిప్రాయాన్ని ఈ విధంగా వ్యక్తపరిచారు.
”భారతదేశం ఇరవయ్యవ శతాబ్దం చివరి దశలో ఆహార కొరత నుండి బయటపడ్డదని చెప్పుకొచ్చాం. కాని 21వ శతాబ్దంలో మళ్లీ మనల్ని ఆహార భద్రతలో ఉంచగలిగేదెవరు? అనే అనుమానం వస్తున్నది. గత రెండున్నర దశాబ్దాలుగా, ఆత్మహత్యల వార్తల్లో రైతులే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. దాదాపు 3.5 లక్షల మంది ఆహార ఉత్పత్తిలో అత్యంత కీలకమైన రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అనేక మంది రైతు, రైతు కూలీలు వ్యవసాయం వదిలేసే దశకు చేరారు. ఈ ప్రభావం వల్ల భారత ప్రభుత్వం తన ఆర్థిక సంస్కరణల వలయం నుండి బయటపడి మానవతతో కూడిన అభివృద్ధి పథకాల్ని చేపడతామని, 2004లో స్పష్టంగా ప్రకటించి పాలన మొదలెట్టింది. ఆ క్రమంలో జాతీయ వ్యవసాయ కమిషన్ వేసి నన్ను దానికి చైర్మన్ చేసి, వెంటనే తగిన పరిష్కార సిఫార్సులు చెయ్యమన్నారు. అయితే మిత్రులు సాయినాధ్, దేవేంద్ర శర్మ, సునీతా నారాయణ్, సుమన్ సహారు, సతీష్, రామాంజనేయులు వంటి అనేక మందితో చర్చించి అది వ్యవసాయ కమిషన్ కాదు రైతు కమిషన్” అని నిర్ధారించి ప్రభుత్వానికి సమగ్రంగా (6) నివేదికల ద్వారా 2007 నాటికి ముందుంచాము. ప్రభుత్వం దాన్ని పార్లమెంటులో చర్చించి సహేతుకమైన సిఫార్సుల్ని అమలు చేస్తారని ఆశించాను. తద్వారా వ్యవసాయ రంగాన్నే నమ్ముకొని బతుకుతున్న చిన్న సన్నకారు రైతులు వ్యవసాయ కూలీలు రక్షించబడతానని ఎదురు చూస్తూ వచ్చాం. కాని ఇప్పటి వరకు వాటి అమలు విషయంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కారణం అర్ధమౌతూనే ఉంది. ప్రభుత్వం దృష్టిలో, ఆహార-వ్యాపార వర్గం అత్యంత కీలకం. ఈ సమస్యను దేశ ఉన్నత న్యాయస్థానం కూడా చర్చించి ప్రభుత్వానికి హెచ్చరిక చేసింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం (ఎన్.డి.ఎ) వచ్చింది. ఇది ఎన్నికల ముందుగా చెప్పినట్లు ‘జాతీయ రైతు కమిషన్’ ముఖ్య సిఫార్సుల్ని అమలు చేయగలదేమో చూద్దాం! ప్రముఖ ఆర్థికవేత్తలైన వి.కె.రామచంద్రన్, మధురా స్వామినాధన్, వెంకటేష్ ఆత్రేయ, కిసాన్ సంఘ నాయకుడు హన్నన్ మొల్లా తోపాటు అనేక మంది ఆలోచనాపరులు, సామాజిక ఉద్యమకారులు (ప్రొ.ఎం.ఎస్.స్వామినాధన్ పరిశోధనా కేంద్రం-చెన్నై, 24.6.2015) పాల్గొన్న సమావేశంలో, స్వామినాధన్ ముఖ్య వక్తగా చేసిన ప్రసంగ సారాంశమిది (నేను ఆ సమావేశంలో పాల్గొన్నాను). గత దశాబ్ద కాలంలో జరిగిదేంటో చూశాం. చెప్పేదానికి ప్రభుత్వం కట్టుబడకపోగా, ఇంకా వ్యాపార వర్గాల ప్రయోజన లక్ష్యంతో, రైతుల్ని దిగజార్చే చట్టాల్ని చేసింది. దేశ ఉన్నత న్యాయ స్థానం ఇచ్చిన సూచనలను, తీర్పును గౌరవించలేదు. పైగా రైతు సంఘాల ఉద్యమాల్ని అణచటానికి భయంకర నియంతృత్వ ధోరణిలో రైతులపై కాల్పులు జరుపుతున్నది. ఉత్తర భారతదేశ వ్యవసాయ కూలీలు నిరంతర వలసల్లో మునిగిపోయినా ప్రేక్షక పాత్ర వహించింది ప్రభుత్వం. పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర రైతుల పాదయాత్రల్ని, నిరాహార దీక్షల్ని లెక్క చెయ్యకుండా, పరోక్ష సంస్కరణల ద్వారా ఆహార వ్యాపారులకు అనుకూలమైన చట్టాల్ని అమలు చేస్తున్నది. ప్రొ.స్వామినాథన్, తన జీవిత చివరి దశల్లో ప్రభుత్వాల నిరంకుశ వైఖరి గుర్తించి, తాము సాధించిన వ్యవసాయ ప్రగతి నిష్ప్రయోజనమైనదని, ‘హరిత విప్లవం’ తెచ్చిన మార్పులు వ్యాపారులకు రైతుల కంటే ఎక్కువ లాభం తెచ్చిందని బయటకు చెప్పుకున్నారు. స్వామినాథన్, ప్రొ.రతన్ లాల్ వంటి శాస్త్రవేత్తల వంటి వారితో చర్చించి ప్రపంచ వ్యాపిత వ్యవసాయ మార్పుల్ని క్రోడీకరించారు. వారు ప్రతిపాదించిన భూమి కేంద్ర వ్యవసాయం, ఉత్పత్తి దారుడి రక్షణనిచ్చే పంటల సాగు విధానాల విలువను గుర్తించారు. తన చివరి ఉపన్యాసంగా ప్రొ.రతన్ లాల్ (ప్రపంచ ఆహార పురస్కారం-2020 పొందిన సందర్భంగా) సూచించిన ముఖ్య అంశం, విత్తనం చుట్టూ పరిభ్రమించిన హరిత విప్లవం, భూమికి, రైతుకు, ప్రజారోగ్యానికి ఎంత నష్టం కలిగిందో వివరించారు. ఆ ప్రభావంతో తన పరిశోధనా కేంద్ర లక్ష్యాల్ని కూడా మార్పు చేయించారు.
ఈ నేపథ్యంలో, రైతు రక్షణ వేదిక ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానం ఎందుకు? ఎలా? అనే చర్చా గోష్టిని నిర్వహిస్తూ వచ్చింది. గత చర్చల్లో (2016, 2018, 2019 సంవత్సరాల్లో) ప్రత్యామ్నాయ వ్యవసాయం కోసం కృషి చేసే ప్రముఖులు, ప్రభుత్వ వ్యవసాయ కమిటీ నిపుణులైన ప్రొ.ఆర్.రాధాకృష్ణ, గుజరాత్ బంగాళదుంప విత్తన కంపెనీలపై ఉద్యమించిన ఆనందకుమార్ యాగ్నిక్, డా.కవిత కురగంటి, వివిధ వ్యవసాయ అధ్యయన కమిటీల్లో ముఖ్య సభ్యుడిగా ఉన్న ప్రొ.నరసింహారెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ పరంగా దాతృత్వ పెట్టుబడిదారుల ఆర్థిక దన్నులో రైతు సాధికారత కోసం ప్రకృతి వ్యవసాయ ఉద్యమాన్ని నడిపే విజయకుమార్, అదే విధంగా ప్రభుత్వ శాఖల్లో ఆవు కేంద్ర ప్రకృతి వ్యవసాయంపై ప్రచారం చేసే ఉద్యోగులు, అధికారులు రైతు అవగాహన చర్చల్లో పాల్గొనేందుకు ఇష్టపడలేదు.
మళ్లీ 2025 ఏప్రిల్ 8వ తేదీన ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ప్రత్యామ్నాయ వ్యవసాయం ఎందుకు? ఎలా? అనే గోష్టిని రైతు రక్షణ వేదిక నిర్వహించింది. దీన్ని డా.శారదా జయలక్ష్మి దేవి, వైస్ ఛాన్సలర్ ప్రారంభించి సందేశం ఇచ్చారు. ముఖ్యంగా రైతులు, ఖర్చు తక్కువ వ్యవసాయం వైపు మరలాలని సూచించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం కూడా పరిశోధనాపరంగా ఈ అంశానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆమె రైతు రక్షణ వేదిక రూపొందించిన సమాచార పుస్తకాన్ని ఆవిష్కరించారు. ముఖ్య వక్తగా విచ్చేసిన ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త ప్రొ.డి.నరసింహారెడ్డి చాలా వివరంగా వ్యవసాయ మార్పు ఎలా జరగాలో తెలియజేశారు. ముఖ్యంగా దేశంలో, కేరళ (ప్రభుత్వ సహకారం) సిక్కిం (సేంద్రియ వ్యవసాయం), ప్రపంచంలో క్యూబా (శాస్త్రీయ సేంద్రియ వ్యవసాయం) ద్వారా ఏ విధమైన దిశలో వ్యవసాయాన్ని మార్చగలిగారో వివరించారు. డా.బి.శరత్ బాబు (ఐ.సి.ఎ.ఆర్ విత్తన భద్రతా కేంద్ర నిర్దేశకుడు) విత్తన రక్షణ, ఎంత ముఖ్యమో వివరించారు. స్థానికంగా మూల విత్తనాల రక్షణ నిమిత్తం నిలయాల్ని (ప్లాంట్ జీన్ బ్యాంకులు) రూపొందించుకోవాలని సూచించారు. కార్పొరేట్ (కంపెనీల) ధోరణి, దేశ విత్తన స్వావలంబనకు, ఆహార భద్రతకు తీవ్ర నష్టకరమని పరోక్షంగా హెచ్చరించారు. ముఖ్యంగా స్త్రీలు, ఆదివాసీలు విత్తన రక్షణలో చేసుకున్న కృషిని గుర్తు చేశారు. రైతు రక్షణ వేదిక వంటి సంస్థలు చేపట్టే ప్రచారాల్ని ప్రోత్సహించుకోవాలన్నారు. రైతు రక్షణ వేదిక గౌరవ సలహాదారు కె.ఎస్.లక్ష్మణరావు తాను ఆంధ్రప్రదేశ్ శాసన మండలి (2007-2025) సభ్యుడిగా వివిధ సందర్భాల్లో రైతు రక్షణకు తగిన సూచనలను చేస్తూ వచ్చానన్నారు. ముఖ్యంగా వ్యవసాయంలో నష్టపోతున్న కౌలు చిన్న, సన్న కారు రైతులు, వ్యవసాయ కూలీల భద్రతకు తగిన చట్టాలు చెయ్యమని ప్రభుత్వాన్ని కోరినట్లు వివరించారు. ఈ గోష్టిలో ఆసక్తిగా పాల్గొన్న రైతు సంఘాల నాయకులు, రైతులు, శాస్త్రవేత్తలు, విస్తరణాధికారులు తమ సూచనలను వ్యక్తపరిచారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం వంటి సంస్థలు కుటుంబ వ్యవసాయాన్ని రక్షించగల పరిశోధనలు చేయాలని కోరుకున్నారు. ప్రొ.స్వామినాథన్, ప్రొ.రాధాకృష్ణలు సూచించిన అంశాలకు ప్రాధాన్యతనివ్వాలని చెప్పారు.
ఆహార భద్రతకు కీలకమైన రైతును కాపాడుకొందాం! పెట్టుబడి తక్కువ వ్యవసాయాన్ని రూపొందించుకొందాం!! విత్తన స్వావలంబనను నిలుపుకొందాం!!!
వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు ప్రొ.ఎన్. వేణుగోపాలరావు
సెల్: 9490098905)