ఆ పిల్లల పోషణ ఎవరిది!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మధ్య ఎక్కువ మంది పిల్లలను కనమని చెప్తున్నారు. ఒకరిద్దరు పిల్లల వల్ల వచ్చే లాభనష్టాలు మనకు తెలుసు. ప్రజలకు ఎక్కువ మందిని కనమని చెప్పటంలో పరమార్ధమేమిటో అర్థం కావడంలేదు! అయినా ఒకరు కావాలా ఇద్దరు కావాలా, ఇంకా ఎక్కువమంది కావాలా అనేది నిర్ణయించవలసింది మహిళలు. 1952లో కుటుంబ నియంత్రణ పాటించండి. అనగా ఒకరు లేక ఇద్దరు చాలు అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎక్కువ మందిని కంటే పోషణ కూడా ఒక సమస్య. కనుక, ముఖ్యంగా దక్షిణ భారతంలో కుటుంబ నియంత్రణ బాగా జరిగింది. ఎక్కువ మందిని కని, వారి భారం పైవాడి మీద వెయ్యకుండా మనమే భరించాలి కనుక ఒకరిద్దరితోనే సరిపుచ్చుకుంటున్నారు. అయితే-దేశంలో ముస్లిం జనాభా పెరిగిపోతుంది. వారిని మించి పోవాలంటే హిందువులు కూడా ఎక్కువ మందిని కనండి-అని బిజెపి వారు ప్రచారం చేస్తున్నారు. ఈ మధ్య ఎంపి సీట్ల విషయంలో ఉత్తర భారతం కంటే దక్షిణ భారతంలో జనాభా తక్కువగా ఉన్నందున, ఇక్కడ ఎంపీల సంఖ్య తగ్గుతుంది కనుక మనం కూడా ఎక్కువ మందిని కనాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రకటిస్తున్నారు. చిన్న సందేహం? చంద్రబాబు పైన పేర్కొన్న రెండిటిలో దేన్ని ఉద్దేశించి అన్నారో చెప్తే బాగుంటుంది. ఎక్కువమందిని కని, వారిని సుఖంగా పోషించే స్థితిలో నేడు సమాజం లేదు. మరి ఎక్కువమందిని ఎందుకు కనాలి? అన్న నందమూరి తారక రామారావు 12 మందిని, గోరా తొమ్మిది మందిని కన్నారు. వారి పిల్లలు బాగా మంచి పొజిషన్‌లో ఉన్నారంటే, అదొక ప్రత్యేక పరిస్థితి. అందరికీ అలాంటి అవకాశాలు రావు కదా! అందరికీ అలాంటి అవకాశాలు కల్పిస్తామంటే మంచిదే. ఈ రోజు ఒకరిద్దరితోనే వారిని మంచి చదువులు చదివించలేక, అమ్మాయికి లక్షలు లక్షలు ఇచ్చి పెళ్ళి చెయ్యలేక, అబ్బాయికి ఉద్యోగం లేక, పెద్దల ఆరోగ్యానికి మందులు లేక నానా ఇబ్బందులు పడుతుంటే ఒకరిద్దరు చాలనాలిగాని, ఎక్కువ మందిని కనమని చెప్పటం ఎమిటి? ఉత్తర భారతంలో కూడా కుటుంబ నియంత్రణ సరిగా అమలు జరిగేటట్లు చూస్తే దేశం బాగుపడుతుంది.

– నార్నె వెంకట సుబ్బయ్య

➡️