మధ్యతరగతి ఎందుకు కొనలేకపోతున్నది?

దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన మధ్యతరగతి నేడు కొనుగోలు తగ్గించుకుంటున్నది. గత అనేక దశాబ్దాలుగా ప్రభుత్వ విధాన నిర్ణయాలను తీవ్రంగా ప్రభావితం చేసిన ఈ వర్గం నేడు ఆ ప్రభుత్వాల విధానాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. పెరుగుతున్న ఖర్చులు-తరుగుతున్న ఆదాయాలతో ఆందోళన చెందుతున్నది. తమ గురించి, తమ పిల్లల భవిష్యత్‌ గురించి వేదనకు గురౌతున్నది. తమ దగ్గర వున్న కొద్దిపాటి డబ్బును ఖర్చు చేయడానికి భయపడుతున్నది. వీటన్నిటి ప్రభావం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం, సరుకులు, వాహనాల కొనుగోలు రూపాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ తరగతితో శక్తికి మించి అప్పులు చేయించి లాభపడిన వ్యాపార సంస్థలు నేడు వ్యాపార లావాదేవీలు తగ్గిపోయాయని గగ్గోలు పెడుతున్నాయి. ఈ స్థితి నుండి తమను పాలకులు బయట వేస్తారనే విశ్వాసం కోల్పోయి, అతీతశక్తులను ఆరాధించడం పెరిగింది. గత మూడు దశాబ్దాల్లో ప్రపంచీకరణ విధానాలతో వేగంగా విస్తరించిన మధ్యతరగతి నేడు జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ పరిస్థితుల వల్ల తీవ్ర ఆందోళనకు గురౌతున్నది.

ఆక్స్‌ఫర్డ్‌ ఎకనామిక్స్‌ అంచనా ప్రకారం, రాబోయే పది సంవత్సరాల్లో మన దేశంలో మధ్యతరగతి కుటుంబాలు రెట్టింపు అవుతాయి. 2024లో 35 కోట్లుగా వున్న ఈ తరగతి 2034 నాటికి 69 కోట్లకు పెరుగుతుందని తెలిపింది. అందుకే దేశాభివృద్ధిలో ఈ తరగతి వినిమయం చాలా కీలకమవుతుంది. కార్పొరేట్‌ వ్యాపార సంస్థలు వీరిని ఆకర్షించి వ్యాపారాన్ని పెంచుకోవడానికి, ఊహల పల్లకిలో పెట్టి పాలకులు లాభపడడానికి, అసత్యాలు, అర్ధసత్యాలతో సంచలనాత్మక ప్రసారాలతో రేటింగ్‌ పెంచుకోవడానికి మీడియా నిత్యం అనేక ప్రయత్నాలు చేస్తుంటుంది. తమ అభివృద్ధికి అమెరికా డాలర్లను కొలమానంగా భావించే కొద్దిమంది మధ్యతరగతి వారు తమ పిల్లల భవిష్యత్‌ గురించి నేడు ట్రంప్‌ విధానాలతో భయాందోళన చెందుతున్నారు. దేశంలో 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ఉద్యోగ భద్రత లేకపోవడం, ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం, ధరలు పెరగడంతో మధ్యతరగతి ఖర్చు చేయడానికి భయపడుతుంది. తమ ఆదాయంలో ఎక్కువ భాగం అప్పుల వడ్డీలు, ఇఎంఐ లు చెల్లించడానికే సరిపోయే స్థితికి చేరింది. గత 25 సంవత్సరాల్లో వస్తువుల వాడకం, గృహ నిర్మాణం ద్వారా విస్తరించిన వినిమయ మార్కెట్‌ నేడు మందగించింది. ఫిన్‌టెక్‌ ప్లాట్‌ఫామ్‌ నిర్వహించిన సర్వే ప్రకారం దేశంలోని మొత్తం కుటుంబాల్లో 67 శాతం మంది వ్యక్తిగత రుణాలు తీసుకున్నారని, వీరిలో 53 శాతం మంది 30 ఏళ్ళ లోపు వారని తెలిపింది. ఇందులో అత్యధికులు ఐటి ఉద్యోగులు. వీరే నయా మధ్యతరగతివారు. రేపు లేదన్నట్లు ఖర్చు చేయగల ఖరీదైన వినిమయదారులు. రిజర్వుబ్యాంకు రిపోర్టు ప్రకారం 2018లో మధ్యతరగతి వారు తమ ఆదాయంలో 30.4 శాతం అప్పుల చెల్లింపులకు ఖర్చు చేస్తుండగా, నేడు సుమారు 41 శాతం ఖర్చు చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున అప్పుల చెల్లింపులు వుండడంతో కొత్త సరుకులను కొనడం పట్ల ఆసక్తి చూపడంలేదు. దీని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థ మీద తీవ్రంగా ఉంది. తయారీ రంగం విస్తరించకపోవడం, కొత్త ఉపాధి అవకాశాలు తగ్గడం, మధ్యతరహా వ్యాపారాలు, రియల్‌ ఎస్టేట్‌ లాంటి రంగాలు కష్టాల్లో కూరుకుపోయాయి.

హిందుస్తాన్‌ యూనిలీవర్‌, నెస్లే ఇండియా సంస్థలు పట్టణాల్లో కొనుగోలు తమ అంచనాల కంటే ఎక్కువగా తగ్గిందని ప్రకటించాయి. దేశంలో అతి పెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ పట్టణాల్లో తమ అమ్మకాలు 2 శాతం తగ్గాయని ప్రకటించింది. ఈ సంవత్సరం జనవరి నుండి, ద్విచక్ర వాహనాల అమ్మకాలు 9 శాతం తగ్గాయి. మోటార్‌ సైకిల్‌ అమ్మకాలు 13 శాతం, మోపెడ్‌ అమ్మకాలు 18 శాతం తగ్గాయి. నెస్లే ఇండియా ప్రతినిధి సురేష్‌ నారాయణన్‌ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అమ్మకాలు మందగించడం వెనుక ‘తగ్గుతున్న మధ్యతరగతి’ ఒక ముఖ్య కారణంగా చెప్పారు. ‘ఒకప్పుడు రెండంకెలుగా ఉన్న ఆహార, పానీయాల రంగంలో వృద్ధి ఇప్పుడు 1.5 నుండి 2 శాతానికి పడిపోయింది’ అని ఆయన పేర్కొన్నారు. నెలకు రూ.40,000 నుండి రూ.55,000 వరకు సంపాదించే వారు ఒక్కొక్కరు 5-6 రకాల రుణాలు రూ.6 లక్షల నుండి రూ.30 లక్షల వరకు తీసుకుంటున్నట్లు ప్రైవేట్‌ ఫైనాన్స్‌ సంస్థల నివేదిక తెలిపింది. వీరు పొందుతున్న ఆదాయంలో సుమారు 50 శాతం పైగా వడ్డీల చెల్లింపులకే సరిపోతుందట! దిగువ మధ్యతరగతి తమ దగ్గర వున్న బంగారాన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవడం పెరిగింది. ఈ తరహా రుణాలు 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే 71 శాతం పెరిగాయి. అంతకు ముందు సంవత్సరంలో 17 శాతం పెరిగాయి. మార్చి 2020లో అప్పుల్లో వున్న కుటుంబాలు దేశ జాతీయోత్పత్తిలో 35 శాతం వుండగా, జూన్‌ 2024 నాటికి 43 శాతానికి పెరిగాయని రిజర్వుబ్యాంకు తెలిపింది. ఒకవైపు మధ్యతరగతి వాస్తవ పరిస్థితి దిగజారుతుంటే దేశ తలసరి ఆదాయం 2,841 డాలర్లు (సుమారు రూ. 2,52,000) కు చేరుకుందని, 2047 నాటికి రూ.15 లక్షలకు చేరుకుంటుందని ప్రధాని ఆర్థిక సలహాదారు నాగేశ్వరన్‌ ప్రకటిస్తున్నారు.

స్వాతంత్య్రానంతరం అనుసరించిన విధానాల ఫలితంగా దేశంలో 1900 సంస్థలను ప్రభుత్వ రంగం నిర్వహించింది. ఇందులో లక్షల మంది ఉద్యోగాలు పొందారు. రైల్వే, రోడ్లు, ఓడరేవులు, ఇనుము, ఉక్కు, అల్యూమినియం, రెవిన్యూ, రక్షణ, శాంతిభద్రతలు, విద్యా, వైద్యం, పోస్టల్‌, టెలికం లాంటి అనేక ప్రజా సర్వీసులు ఇలా అనేక రంగాలను ప్రభుత్వం నిర్వహించింది. వీటితో పాటు ప్రాజెక్టులు, మందులు, ఎరువుల పరిశ్రమలను ప్రభుత్వమే స్థాపించింది. బ్యాంకు, ఇన్సూరెన్స్‌లను జాతీయం చేసుకుంది. వీటన్నిటివల్ల స్థిరమైన వేతనాలు, చౌకగా విద్య, వైద్యం, రవాణా, గృహ వసతి లాంటి సదుపాయాలు పొందిన మధ్యతరగతి విస్తరించింది. వారి కొనుగోలుశక్తి పెరిగింది. ఇందుకు అవసరమైన సరుకులను ఉత్పత్తి చేయడం కాకుండా దిగుమతి చేసుకోవడంతో 1990 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడింది. దీనికి పరిష్కారం సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ విధానాలను ఆచరించడమేనని గత ముప్పై సంవత్సరాలుగా పాలకులు చెబుతూ వచ్చారు. నేడు మధ్యతరగతి ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ఈ మూడు విధానాలే కారణం.

1991 తర్వాత అనుసరించిన ఆర్థిక విధానాల వల్ల ఈ తరగతి వేగంగా విస్తరించింది. ఈ తరగతి అభివృద్ధిలో అప్పటి వరకు కీలక పాత్ర పోషించిన ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరిస్తూ, ప్రైవేటు రంగంలోని సర్వీసు రంగాల లాంటి వాటి ద్వారా అభివృద్ధి సాధించాలనుకోవడం ఇందులోని తీవ్ర వైరుధ్యం. కొత్త రంగాల్లో వేతనాల్లో పెరుగుదల వున్నప్పటికీ అంతకు ముందు పొందిన అనేక రకాల సేవలు, భద్రత సదుపాయాలు కోల్పోయారు. జాతీయ, అంతర్జాతీయ వ్యాపార సంస్థలు ఈ నయా మధ్యతరగతిలో విపరీతమైన వస్తు వ్యామోహాన్ని పెంచాయి. భద్రతతో కూడిన స్థిరమైన ఆదాయం లేకుండానే కృత్రిమ వినిమయంతో, అలవాట్లను మార్చగలిగాయి. తమను తాము ఉన్నత తరగతివారు ఏడు రూపాల్లో ప్రదర్శించుకుంటున్నారని మార్కెట్‌ నిపుణులు అంచనా వేశారు. అవి, అవసరాలతో సంబంధం లేకుండా కొత్త వస్తువులను యథేచ్ఛగా కొనడం, ఆధునిక గృహ నిర్మాణాలు, అందులో అతి ఖరీదైన వస్తువులు ఏర్పాటు చేయడం పెరిగింది (హౌసింగ్‌ రుణాలు 2023లో 37.9 శాతం నుండి 2024లో 41, 2025 మొదటి అర్ధ భాగంలో 43.5 శాతానికి పెరిగాయి.). దేశీయ, విదేశీ విహారయాత్రలు, ఖరీదైన బ్రాండ్‌ వస్తువులు, దుస్తులు, కార్లు కొనడం, రెగ్యులర్‌గా హోటళ్లకు, రెస్టారెంట్లకు వెళ్లడం హోదాగా భావించడం, ఆధునిక వంటలు, ఖరీదైన విద్యాసంస్థల్లో పిల్లలను చేర్చడం, మర్యాదల పేరుతో పెళ్ళిళ్లు, రకరకాల ఫంక్షన్‌లకు భారీగా ఖర్చులు చేసే సంస్కృతి పెరిగింది. వీరి వల్ల నగరాలు, పట్టణాల్లో రియల్‌ ఎస్టేట్‌ రంగంతో పాటు, కార్పొరేట్‌ విద్యాలయాలు, ఆసుపత్రులు, షాపింగ్‌ మాల్స్‌, వాహనాల షోరూంలు ఈ కాలంలో బాగా విస్తరించాయి. వీటన్నింటికి అవసరమైన డబ్బును వేతనాల ద్వారా పొందలేరు కాబట్టి సులభంగా రుణాలు ఇచ్చే పద్ధతులను పైనాన్స్‌ సంస్థలు అనుసరించాయి. వ్యక్తిగత జీవిత అలవాట్లలో అనేక మార్పులు వచ్చాయి. వ్యసనాలు కూడా హోదాగా మారాయి. కుటుంబ విలువలుగా ఇన్నేళ్లు కీర్తించబడినవన్నీ ఛిద్రం అవుతున్నాయి.

అమెరికాలో 2008లో ప్రారంభమై ప్రపంచమంతా విస్తరించిన ఆర్థిక సంక్షోభం, ఆ తర్వాత కరోనాతో ఈ కృత్రిమ వినిమయానికి బ్రేకులు పడ్డాయి. గతంలో పొందిన వేతనాలు తగ్గాయి. గత సంవత్సరంతో పోలిస్తే 23 శాతం మందికి వేతనాలు తగ్గినట్లు వినిమయ సర్వే సంస్థలు ప్రకటించాయి. మార్సెల్లస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ నివేదిక ప్రకారం, ఆర్థిక మందగమనం మూడు రూపాల్లో స్పష్టంగా వ్యక్తమవుతుందని తెలిపింది. ఒకటి సాంకేతిక అభివృద్ధి (ఎ.ఐ), రెండు తీవ్రమవుతున్న ఆర్థిక మాంద్యం, మూడు క్షీణిస్తున్న ఆదాయం. ఇప్పుడు ఆటోమేషన్‌, టెక్నాలజీ ద్వారా అనేక ఉద్యోగాలు భర్తీ చేయబడుతున్నాయి. కార్యాలయాలు, ఫ్యాక్టరీల్లో క్లరికల్‌ పోస్టులు గణనీయంగా తగ్గాయి. ఔట్‌సోర్సింగ్‌, ఆటోమేషన్‌ వంటి వాటికి ఖర్చు తగ్గించాలని యాజమాన్యాలు తీసుకున్న చర్యల వల్ల అనేక మందికి ఉపాధి తగ్గిపోయిందని జాతీయ గణాంక కమిషన్‌ మాజీ చైర్మన్‌ పి.సి మోహన్‌ పేర్కొన్నారు. దేశ వినిమయంలో కీలకమైన ఐటి రంగంలోని ఉద్యోగులు తీవ్ర ఒత్తిళ్ళకు గురౌతున్నారు. వేతనాల పెరుగుదల సరిగా లేకపోవడం, ఉద్యోగాల తొలగింపు, గతంలో వున్న కొద్దిపాటి ఆరోగ్య, రుణ సదుపాయాల వంటివి రద్దు కావడం, పని గంటలు పెంచాలనే యాజమాన్య డిమాండ్‌లతో వీరు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమ దగ్గరవున్న కొద్దిపాటి డబ్బును గతంలాగా ఖర్చు చేయడానికి సిద్ధపడడం లేదు. బ్లూవెంచర్స్‌ సంస్థ దేశలోని 30 కోట్ల మంది మధ్యతరగతి వారు తమ డబ్బును ఖర్చు చేయడానికి భయపడుతున్నారని తెలిపింది. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా వున్న మధ్యతరగతి ఇంత ఒత్తిళ్ళను ఎదుర్కొంటుంటే దేశ పాలకుల్లో కనీస చలనం వున్నట్లు కనిపించడంలేదు. దేశానికి వినాశకరమైన రెండు విధానాలను అనుసరిస్తున్నారు. ఒకటి, కార్మిక చట్టాలను కాలరాచి, సహజ వనరులను, ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగించడం, రెండు, వీటిని ప్రశ్నించకుండా ప్రజల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టడం. వీటిని ప్రశ్నించకుండా దేశాభివృద్ధి గురించి మాట్లాడలేం.

వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి. రాంభూపాల్‌

➡️