డాలర్‌ ఎందుకు బలపడుతోంది?

డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ పడిపోతోందన్న కథనాలు ఇటీవల వార్తాపత్రికల్లో ఎక్కువగా వస్తున్నాయి. ఒక నెల రోజుల క్రితం, నవంబర్‌ 27 నాటికి డాలర్‌ విలువ రూ.84.559గా ఉండేది. డిసెంబర్‌ 29 కల్లా అది రూ.85.5కి పెరిగింది. రూపాయి మారకపు విలువ పడిపోకుండా అరికట్టడానికి రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన విదేశీ మారకపు నిల్వల నుండి డాలర్లను అదనంగా మార్కెట్లోకి విడుదల చేసింది. నవంబర్‌ 22 నాటికి 657.89 డాలర్ల విదేశీ మారకపు నిల్వలు ఉంటే అది డిసెంబర్‌ 20 నాటికి 644.39 డాలర్ల కి తగ్గింది. అయినా, రూపాయి విలువ తగ్గిపోవడం ఆగలేదు. రిజర్వు బ్యాంకు గనుక తన డాలరు నిల్వలను అదనంగా మార్కెట్లోకి విడుదల చేయకపోయి వుంటే రూపాయి విలువ ఇంకా తగ్గిపోయి వుండేది.

మన దేశ ఆర్థిక వ్యవస్థ మీద ప్రభుత్వ నియంత్రణ కొనసాగిన కాలంలో రూపాయి-డాలర్‌ మారకపు విలువ స్థిరంగా ఉండేది. ప్రభుత్వం రూపాయి విలువను తగ్గించినప్పుడు మాత్రమే ఆ మారకపు రేటులో మార్పు జరిగేది. ఆ విధంగా స్థిరంగా మారకపు రేటును కొనసాగించగలడానికి కారణం ప్రభుత్వ నియంత్రణలో విదేశీ మారకపు నిల్వలు ఉండేవి. ఆ విధమైన నియంత్రణ లేకుండా పోయిన తర్వాత (నయా ఉదారవాద విధానాలు అమలు కావడం మొదలైన తర్వాత) రూపాయి విలువ దిగజారిపోవడం అనేది మొదలై కొనసాగుతూనే వుంది. 1991లో డాలర్‌ విలువ రూ.22.74గా ఉండేది. 2014లో మోడీ అధికారం చేపట్టే నాటికి అది రూ.62.33 అయింది. ఇప్పుడు అది రూ.85.5 దాటిపోయింది.
అమెరికాలో కన్నా భారతదేశంలో ద్రవ్యోల్బణం రేటు ఎక్కువగా ఉన్నందువలన జరుగుతున్న పరిణామం కాదిది. అక్కడికన్నా ఇక్కడ ద్రవ్యోల్బణం కొంత ఎక్కువ ఉన్నమాట వాస్తవమే కాని, రూపాయి విలువ పతనానికి అది ప్రాథమిక కారణం కాదు. నిజానికి రూపాయి మారకపు రేటు పడిపోవడం వలన మన దేశంలో ద్రవ్యోల్బణం రేటు అమెరికాలో కన్నా ఎక్కువగా ఉంది. ముడిచమురు తదితర దిగుమతుల ధరలు రూపాయి విలువ పడిపోతున్న కారణంగా పెరిగిపోతున్నాయి. దాని ఫలితంగా అనేక సరుకుల ధరలు పెరుగుతున్నాయి. అది అధిక ద్రవ్యోల్బణానికి దారి తీస్తోంది. రూపాయి విలువ పడిపోవడానికి ప్రాథమిక కారణం ఏదైనప్పటికీ, దాని ఫలితంగా ద్రవ్యోల్బణం పెరగడం గనుక మొదలైతే, అది తిరిగి రూపాయి విలువను మరింత తగ్గించడానికి దారి తీస్తుంది. స్పెక్యులేటర్లు రూపాయి విలువ పడిపోతుందన్న అంచనాతో డాలర్లను ఎక్కువగా కొనుగోలు చేస్తారు గనుక అది రూపాయి విలువను దెబ్బ తీస్తుంది. ఇలా రూపాయి మారకపు విలువ పడిపోవడం, ద్రవ్యోల్బణం పెరిగిపోవడం అనే విష వలయం నడుస్తూ వుంటుంది.

ఈ విధంగా డాలర్‌తో పోల్చితే తమ దేశ కరెన్సీ విలువ పడిపోవడం అనే ధోరణి కేవలం మన రూపాయికే పరిమితం అయి లేదు. మూడవ ప్రపంచ దేశాలన్నింటిలోనూ కనిపించే ధోరణి ఇది. అందుకే రూపాయి మారకపు రేటు పడిపోకుండా ఒక స్థిరమైన స్థాయి దగ్గర నిలబెట్టేలా ప్రభుత్వ నియంత్రణ ఉండాలని, అందుకోసం విదేశీ మారకపు నిల్వల మీద, పెట్టుబడుల రాకపోకల మీద ప్రభుత్వ నియంత్రణ ఉంటేనే ఇది సాధ్యపడుతుందని చెప్తున్నాం. ఈ విధంగా చేయడం ప్రభుత్వ నియంత్రణ ఉన్న కాలంలో, అంటే…నయా ఉదారవాద విధానాలను ప్రవేశ పెట్టక పూర్వం సాధ్యపడింది.

రూపాయి మారకపు రేటు పడిపోవడం అనేది ఒక్కోసారి వేగంగాను, ఒక్కోసారి కాస్త నెమ్మదిగాను జరుగుతూ వుంటుంది. ఇలా గత కొద్ది వారాలలో రూపాయి విలువ హఠాత్తుగా పడిపోవడం అనేది ఎందుకు జరుగుతోంది? మన దేశపు ద్రవ్యోల్బణ రేటు అమెరికాలో కన్నా ఎక్కువగా ఉండడమే కారణమని, మన విదేశీ లోటు (ఎగుమతుల విలువ కన్నా దిగుమతుల విలువ పెరిగిపోవడం) పెరిగిపోవడమే కారణమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాని ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల కరెన్సీలతో పోల్చితే డాలర్‌ విలువ ఎందుకు బలపడుతోంది అన్న అంశం మీద ఎవరూ దృష్టి పెట్టడం లేదు. నిజానికి ఇప్పుడు డాలర్‌ విలువ ఉన్నంత బలంగా గత దశాబ్ద కాలంలో ఎప్పుడూ లేదు. డాలర్‌ బలాన్ని సూచించే బ్లూంబెర్గ్‌ డాలర్‌ స్పాట్‌ ఇండెక్స్‌ ఈ ఏడాది ఏకంగా 7 శాతం పెరిగింది. 2015 తర్వాత డాలర్‌ విలువ అత్యధికంగా పెరిగింది ఈ సంవత్సరంలోనే.
మామూలుగా చూస్తే ఇలా డాలర్‌ బలపడడం అనేది అంతుపట్టని వ్యవహారంలా కనిపిస్తుంది. ఎందుకంటే ట్రంప్‌ తాను అధికారం చేపట్టగానే దిగుమతుల మీద ఏ విధంగా సుంకాలను పెంచబోతున్నాడో ఇప్పటికే ప్రకటించాడు. ఇంకోపక్క ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంక్‌, డబ్ల్యుటివో వంటి వివిధ అంతర్జాతీయ సంస్థలు స్వేచ్ఛా వ్యాపారం గొప్పదనాన్ని శ్లాఘిస్తూ సుంకాలను పెంచడం వంటి చర్యలు ఏ విధంగా తిరోగమన స్వభావాన్ని సూచిస్తాయో చెప్తూ తమ ప్రవచనాలను కొనసాగిస్తున్నాయి. స్వేచ్ఛా మార్కెట్‌ వ్యవస్థలో అన్నింటినీ మార్కెట్టే నిర్ణయిస్తుంది అన్నప్పుడు, దానిని నియంత్రించే చర్యలను ట్రంప్‌ చేపట్టబోతున్నప్పుడు అమెరికా ఆర్థిక వ్యవస్థ పట్ల రానున్న కాలంలో మార్కెట్‌ ప్రతికూలంగా స్పందించే అవకాశం ఎక్కువగా ఉండాలి కదా? అప్పుడు ఆ దేశం నుండి పెట్టుబడులు బైటకు తరలిపోయే అవకాశాలు ఎక్కువగా పెరగాలి. అప్పుడు డాలర్‌ విలువ తగ్గాలి. కాని దానికి పూర్తి విరుద్ధంగా డాలర్‌ విలువ పెరగడాన్ని మనం చూస్తున్నాం. అంతే కాక డాలర్‌ విలువ పెరగడానికి ఒక కారణం దిగుమతుల మీద అధిక సుంకాలను విధించే విధానాన్ని ప్రకటించడమే అని కూడా విశ్లేషణలు వస్తున్నాయి. ఈ వ్యవహారం చూస్తే అంతుబట్టనట్టు కనిపిస్తోంది. దీనిని ఏ విధంగా అర్ధం చేసుకోవాలి?

స్వేచ్ఛా మార్కెట్‌ విశిష్టత గురించి నిత్యం వినపడే ప్రవచనాలన్నీ కేవలం మూడో ప్రపంచ దేశాల రాజకీయ నాయకుల తలల్లోకి ఎక్కించడానికేనని, అమాయక చక్రవర్తులను బుట్టలో వేయడానికేనని, నిజానికి మార్కెట్‌ శక్తులు ఈ ప్రవచనాలను పెద్దగా పట్టించుకోవు అని గ్రహిస్తే అసలు విషయం మనకు బోధపడుతుంది. అమెరికా తన దేశంలోకి వచ్చే దిగుమతుల మీద అధిక సుంకాలను విధిస్తే ఆ విధంగా దిగుమతయ్యే విదేశీ సరుకుల రేట్లు పెరుగుతాయి. అప్పుడు దేశీయంగా ఉత్పత్తి అయ్యే సరుకులకు డిమాండ్‌ పెరుగుతుంది. అది అదనపు ఉపాధి కల్పనకు దారి తీస్తుంది. దేశీయంగానే ఉత్పత్తి చేయగల సరుకులను విదేశాల నుండి దిగుమతి కాకుండా అధిక సుంకాల ద్వారా నిరోధించడం వలన అమెరికాలో ఉపాధి పెరుగుతుంది. ఇందువలన ఇతర దేశాలు నష్టపోతాయి. పైగా అమెరికా విదేశీ వ్యాపార లోటు కూడా తగ్గుతుంది. ఆ విధంగా అమెరికా తన దేశంలో ఉపాధి అవకాశాలను, ఉత్పత్తిని, వ్యాపార లోటు పరిస్థితిని- అన్నింటినీ పెంచుకోగలుగుతుంది. అంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుంది. ఈ అంచనా మదుపరుల్లో డాలరు మీద విశ్వాసాన్ని మరింత పెంచుతుంది. దాంతో డాలర్‌ విలువ మరింత పెరుగుతుంది. దాంతో పోల్చినప్పుడు ఇతర దేశాల కరెన్సీల విలువలు తగ్గిపోతాయి. రక్షణాత్మక చర్యలు తీసుకుంటే ఆ దేశం మదుపరుల విశ్వాసాన్ని కోల్పోతుందని, పెట్టుబడులు వేరే దేశాలకు తరలిపోతాయని, దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినిపోతుందని స్వేచ్ఛావ్యాపార సిద్ధాంతవేత్తలు చెప్పేదానికి వ్యతిరేకంగా ఇది ఉంది.

అమెరికా రక్షణాత్మక చర్యలు తీసుకోవడం వలన ఆ దేశంలో ద్రవ్యోల్బణం కొంతవరకూ పెరుగుతుందన్నది వాస్తవం. కాని అమెరికాకు సరుకులను ఎగుమతి చేసే ఇతర దేశాలలో కూడా ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ముడిచమురు వంటి కొన్ని కీలకమైన ముడిపదార్ధాల ధరలు డాలర్ల లెక్కల్లోనే అంతర్జాతీయంగా నిర్ణయిస్తారు. అమెరికా తీసుకున్న చర్యల వలన డాలర్‌ విలువ పెరిగాక ముడిచమురు ధర కూడా ఇతర కరెన్సీలలో పెరుగుతుంది. అందుచేత ఆ యా దేశాల దిగుమతుల ఖరీదు మరింత పెరుగుతుంది. అది ఆ దేశాలలో ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది.
ఆ దేశాలలోని కార్మికుల జీవన ప్రమాణాలు దెబ్బ తింటాయి. మొదటి కారణం: అమెరికాకు పంపే ఎగుమతులు తగ్గిపోవడం వలన ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి. రెండో కారణం: అమెరికన్‌ డాలర్‌తో పోల్చినప్పుడు ఆ యా దేశాల కరెన్సీల విలువలు తగ్గిపోయినందువలన అవి దిగుమతి చేసుకునే ముడి చమురు వంటి సరుకుల ధరలు ఆ యా దేశాల కరెన్సీలలో పెరిగిపోతాయి. అది ఆ దేశాలలో ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది. దానిని తట్టుకోడానికి ఆ యా ప్రభుత్వాలు తమ దేశాల్లో పొదుపు చర్యలు తీసుకునే పేరుతో సంక్షేమానికి కోతలు పెడతాయి. అది కార్మికుల కొనుగోలు శక్తిని దెబ్బ తీయడంతోబాటు నిరుద్యోగాన్ని మరింత పెంచుతుంది. నిరుద్యోగం పెరుగుతున్నకొద్దీ కార్మికుల బేరసారాల శక్తి సన్నగిల్లిపోతూ వుంటుంది. ఆ విధంగా కార్మికులు అంతకంతకూ మరింత పేదరికంలోకి నెట్టుబడతారు.

విదేశీ రుణ భారం మరీ ఎక్కువగా ఉన్న దేశాలలో కార్మికులు మరింత ఎక్కువగా దెబ్బ తింటారు. డాలర్‌తో పోల్చినప్పుడు ఆ దేశాల కరెన్సీల విలువలు తగ్గిపోతాయి కనుక, రుణ వాయిదాలను డాలర్ల రూపంలోనే చెల్లించాలి కనుక, ఆ వాయిదాల భారం మరింత పెరిగిపోతుంది. ఆ భారం అంతిమంగా కార్మికులపైనే పడుతుంది.

పెట్టుబడిదారీ ఆర్థిక విధానం ఎంత హేతువిరుద్ధమైనదో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అంతకంతకూ స్పష్టంగా కనిపిస్తోంది. కోట్లాదిమంది ప్రజల జీవితాలు కొద్దిమంది స్పెక్యులేటర్ల దయాదాక్షిణ్యాలమీద ఆధారపడి, వారి మితిమీరిన దురాశకు బలౌతున్నాయి. ట్రంప్‌ తీసుకోబోయే రక్షణాత్మక చర్యల ప్రభావం ఈ పరిస్థితికి దోహదం చేస్తున్నప్పుటికీ, ప్రధానమైనది ఈ స్పెక్యులేటర్ల దురాశే. పెట్టుబడిదారీ విధానంలో ఈ దురాశే కీలకంగా ఉంటుంది.

( స్వేచ్ఛానుసరణ )

ప్రభాత్‌ పట్నాయక్‌

➡️