వంద రోజుల క్రితం జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికలను బాగా ప్రభావితం చేసిన ప్రజా సమస్య ఇసుక సమస్య. తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడంలో ఉచిత ఇసుక హామీ కూడా కీలకమైంది. కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అయినా ఇసుక సమస్య తీరలేదు. ఈ వంద రోజుల్లో స్వయంగా ముఖ్యమంత్రి మూడు సార్లు ఈ సమస్యపై సమీక్షించినా పరిస్థితుల్లో పెద్ద మార్పు లేదు. ఇసుక అందరికీ దొరకడంలేదని అందుకు కారణం వర్షాలు, వరదలని గత కొన్ని రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు చెప్పారు. వర్షాలు, వరదలు వచ్చిన ప్రాంతాల్లోనే కాదు అవి అంతగా లేని ప్రాంతాల్లో కూడా ఈ సమస్య ఎందుకు వుందో ఆయన చెప్పలేదు. ప్రకృతి సహజ వనరులను వ్యాపార సరుకుగా మార్చిన ప్రపంచీకరణ విధానాల్లో ఈ సమస్య మూలముంది. సహజంగా దొరకాల్సిన ఇసుకను గత, ప్రస్తుత పాలక పార్టీలు వ్యాపార సరుకుగా మార్చి, కృత్రిమ కొరతను సృష్టించి, ఇతర రాష్ట్రాలకు తరలించి అక్రమంగా సొమ్ము చేసుకునే వనరుగా మార్చడంతో ఈ సమస్య కొనసాగుతున్నది. ఉచిత ఇసుక పేరు చెప్పి గతం కంటే రెట్టింపు ధర చేశారు. ఉచిత ఇసుక అంటూనే ప్రైవేటు వారికి, అధికారంలో ఉన్న వారి అనుయాయులకు రీచ్‌లు అప్ప గిస్తున్నారు. ఇది ఒక రకంగా మాఫియా. పాత ఎంఎల్‌ఏ పోయి కొత్త ఎంఎల్‌ఏ వచ్చారు. పాత ముఖం స్థానంలో కొత్త ముఖం. అంతే. ఉచిత ఇసుకకు జి.ఎస్.టి పేరుతో టెండర్లు పిలవడం ఏమిటి? ఆ విధానాలు మార్చకుండా ఇసుక సమస్య తీరుస్తామని చెప్పడం అతి పెద్ద అబద్ధం అవుతుంది.
2014లో తెలుగుదేశం అధికారంలో వున్నప్పుడు ఉచిత ఇసుక విధానాన్ని తీసుకువచ్చారు. ‘మన మహిళా సంఘాలే ఇసుకు అందిస్తాయి. దళారీ వ్యవస్థ వుండదు’ అని ముఖ్యమంత్రిగా నాడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు ప్రకటించారు. డ్వాక్రా మహిళల ద్వారా ఈ విధానం అమలవుతుందని మెమో నెంబర్: 3066 (4.3.2016) విడుదల చేశారు. ఈ మెమో ప్రకారం 500 మీటర్ల సమీపం నుండి ఎడ్లబండ్లపై ఇసుకను తెచ్చుకునే వారికి ఈ ఉచిత ఇసుక విధానం అమలవుతుందని సన్నాయి నొక్కులు నొక్కడం ప్రారంభించారు. క్రమంగా ఉచిత ఇసుక విధానాన్ని మారుస్తూ వచ్చారు. ఈ ఒక్క విధానంపై అనాటి చంద్రబాబు ప్రభుత్వం 19 జీవోలను విడుదల చేసిందంటే అశ్చర్యపోతాము. ఉచిత ఇసుక విధానం డ్వాక్రా మహిళలను లక్షధికారులను చేయడమో, ఇసుక వాడకందార్లకు ఉపయోగపడడమో కాదు. పాలక పార్టీ నేతలకు ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ప్రభుత్వం ప్రకటించిన రీచ్‌లలో కాకుండా ఇతర చోట్ల అక్రమంగా తవ్వకాలు జరపడం మొదలైంది. కొరత సృష్టించి బ్లాక్‌లో అమ్మడం మొదలైంది. పొరుగున వున్న ఇతర రాష్ట్రాలకు పెద్ద ఎత్తున తరలించే వ్యాపార వనరుగా మారింది. ఈ వ్యవహారంపై నాడు జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్.జి.టి) తీవ్రంగా స్పందించి ప్రభుత్వంపై రూ.100 కోట్ల జరిమానా విధించింది. ప్రభుత్వ విధానాన్ని అమలు చేయడానికి ప్రయత్నించిన ఎమ్మార్వో వనజాక్షిపై నాటి తెలుగుదేశం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసిన దాడి ఉచిత ఇసుక విధానం యొక్క డొల్లతనాన్ని, అక్రమ వ్యాపార తీవ్రతను బట్టబయలు చేసింది.
జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక టెండర్ల విధానాన్ని అమలు చేసింది. టెండర్ల ద్వారా కాంట్రాక్టు దక్కించుకున్న కంపెనీలు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఇసుకను అమ్మాలని జీవో ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎం.ఎస్.టి.సి ద్వారా గనుల శాఖ టెండర్లు నిర్వహించింది. ప్రతిమా ఇన్‌ఫ్రా లిమిటెడ్ 18 జిల్లాల్లో, జి.సి.కె.సి ప్రాజెక్ట్సు-వర్కర్స్ ప్రైవేట్ లిమిటెడ్ 8 జిల్లాల్లో ఇసుక తవ్వకాలు చేయడానికి ఈ టెండర్లను దక్కించు కున్నాయి. వైసిపి ప్రభుత్వం 16.4.2021న జీవో నెంబర్ 21 విడుదల చేసింది. ఈ జీవోకు అనుగుణంగా జె.పి (జయప్రకాష్ పవర్) వెంచర్స్ రంగప్రవేశం చేసింది. అంతకు పూర్వం మైనింగ్ వ్యవహారాల్లో ఈ సంస్థకు ఎలాంటి అనుభవం లేదు. ఈ కంపెనీ ‘మఘలో పుట్టి పుబ్బలో పోయే’ అధికార పార్టీ నేతల బినామీ కంపెనీ అని ఆనాడే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. టన్నుకు రూ.375గా ప్రభుత్వం నిర్ణయించింది. నిర్వహణ చార్జీల కింద మరో రూ.100 వసూళ్లు చేసుకోవచ్చని సవరణ చేసింది. ఈ విధానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం రూ.780 నుండి రూ.760 కోట్లు, ఐదేళ్లలో రూ.4 వేల కోట్ల నుండి రూ.3,825 కోట్లు ఆదాయం వస్తుందని లెక్కలేసి మరీ చెప్పారు. 2019 నుండి మూడు సార్లు ఇసుక విధానాన్ని సవరించారు. 110 ఇసుక ర్యాంపుల ద్వారా సుమారు 77 లక్షల టన్నులు, డీ సిల్టింగ్ పాయింట్స్ అంటూ మరో 42 కేంద్రాల ద్వారా 90 లక్షల టన్నుల ఇసుక తవ్వేందుకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఇసుక వాడకందార్లు నాణ్యమైన ఇసుకను ఏ ర్యాంప్ నుండైనా తెచ్చుకోవచ్చు అని విధానాన్ని మార్చారు. దీన్ని అవకాశంగా తీసుకుని ఎక్కడి నుంచి ఎక్కడికైనా తరలించడం మొదలు పెట్టారు. ఇసుక కొరత ఏర్పడింది. టన్ను రూ.375 కాస్తా 600 నుండి వెయ్యి రూపాయలకు పెరిగింది. అనేక ప్రాంతాల్లో బ్లాక్‌లో ట్రాక్టరుకు పది వేలు పెట్టి కొనాల్సి వచ్చింది. టెండర్లు దక్కించుకున్న సంస్థలే కాకుండా అనేక బినామీ కంపెనీలు యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు చేశాయి.
నదుల మధ్యలో పెద్ద యంత్రాలతో తవ్వకాలు చేయరాదనే నిబంధనలు తుంగలో తొక్కబడ్డాయి. అక్రమంగా ఇసుక తవ్వకాలు, తరలింపులు పెద్ద ఎత్తున పెరిగాయని, అనుమతులు లేకుండా జరుగుతున్న తవ్వకాలను నిలిపివేయాలని ఎన్.జి.టి ఉత్తర్వులు ఇచ్చింది. 2014-19 నాటి టిడిపి ప్రభుత్వానికి ఎన్.జి.టి వేసిన వంద కోట్ల అపరాధ రుసుము గురించి ప్రచారం చేసుకున్న వైసిపి తమ పాలనలో జరుగుతున్న అక్రమాల గురించి అదే సంస్థ ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేసింది. మన రాష్ట్రంలో అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని ఈ సంవత్సరం మే నెలలో సుప్రీంకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినా విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు, అక్రమ తరలింపు కొనసాగించింది. 2023 ఆగస్టు నాటికి 6.7 కోట్ల టన్నుల ఇసుక తవ్వకాలు జరిపినట్లు, దీని ద్వారా ప్రభుత్వానికి రూ. 2,300 కోట్లు ఆదాయం వచ్చినట్లు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. అక్రమ తవ్వకాలు, అనేక సబ్ కాంట్రాక్టు సంస్థల ద్వారా, మధ్యవర్తుల ద్వారా ఇష్టమొచ్చినట్లు రశీదులు ఇస్తున్న విషయంపై నాటి గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందిస్తూ ఎవరు తవ్వారు, ఎవరు రశీదు ఇచ్చారనేది మాకు ముఖ్యం కాదు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందా లేదా అనేదే మాకు ముఖ్యమన్నారు. మరి ఐదేళ్ళకు రూ.నాలుగు వేల కోట్లు ఆదాయం వస్తుందన్నారు కదా. రూ.2,300 కోట్లే ఎందుకు వచ్చిందో? మిగిలిన సొమ్ము ఎవరి జేబుల్లోకి పోయిందో ఆయన చెప్పలేదు. అప్పటి గనులశాఖ డైరెక్టర్ వి.జి.వెంకటరెడ్డి ఇసుక అక్రమాలపై స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్.ఇ.బి) అధికారులు 18 వేల కేసులు నమోదు చేసినట్లు, 6 లక్షల 36 వేల టన్నుల అక్రమ ఇసుకను స్వాధీనం చేసుకున్నట్లు అప్పట్లో ప్రకటించారు. ఈ అక్రమ వ్యాపారానికి కర్తలు నాటి వైసిపి పెద్దలు కాగా, కర్మ, క్రియ తానై చక్రం త్రిప్పిన ఈ వెంకటరెడ్డి ప్రస్తుతం జైల్లో వున్నారు.
తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరం జులై 8వ తేదీ నుండి ఉచిత ఇసుక విధానాన్ని అమలులోకి తెచ్చింది. నిర్వహణ చార్జీలు, సీనరేజ్ చార్జీలు మాత్రమే వసూలు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతుంది. కానీ ఆచరణలో వైసిపి ప్రభుత్వ హయాంలో ట్రాక్టరు ఇసుక ధర ఎంత వుందో దాదాపు అంతే ధర లేదా ఇంకా కొత్త ఎక్కువ ధర పెడితే తప్ప ఇసుక దొరకడంలేదు. గత ఇసుక కాంట్రాక్టర్లు అప్పటి వరకు నిల్వ కేంద్రాల్లో 40 లక్షల మెట్రిక్ టన్నులు నిల్వ ఉంచినట్లు, బ్యారేజీలు, రిజర్వాయర్లలో పూడికల ద్వారా 70-75 మెట్రిక్ టన్నుల ఇసుకను తవ్వి మూడు నెలల వరకు ఉచితంగా అందించనున్నట్లు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ మూడు నెలలకు కోటి టన్నుల ఇసుక అవసరం వుంటుందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. కూటమి ప్రభుత్వం కొలువుతీరి వంద రోజులు పూర్తయినా ఉచిత ఇసుక హామీ సక్రమంగా అమలు కావడంలేదు. కూటమి ఇచ్చిన ఉచిత ఇసుక హామీ అమలుపై ప్రజల్లో అనేక ప్రశ్నలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వర్షాలు, వరదలు రావడంవల్ల తవ్వకాల సమస్య వుంటే అప్పటికే నిల్వ ఉన్న 40 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక ఎక్కడికి పోయింది? వైసిపి పాలనలో టెండర్లు దక్కించుకున్న ప్రతిమా ఇన్‌ఫ్రా లిమిటెడ్, జి.సి.కె.సి ప్రాజెక్ట్సు- వర్కర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమీక్షించడం వెనుక రహస్యం ఏమిటి? గత ప్రభుత్వ కాలంలో జెపీ వెంచర్స్ ప్రభుత్వానికి బకాయిపెట్టిన రూ.700 కోట్లను ఇప్పటి వరకు ఎందుకు వసూళ్లు చేసేందుకు సిద్ధపడడంలేదు? రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఇసుక అక్రమంగా పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్నది అధికార పార్టీల నేతుల, వారి అనుచరులు కాదా? వారిని ఎందుకు ఈ ప్రభుత్వం నియంత్రించడంలేదు? ప్రభుత్వ అధినేతలు నోటితో ప్రజలకు ఒకటి, నొసటితో వారి అనుయాయులకు మరొకటి చెబుతున్నారా?
సంపాదించడం కోసమే రాజకీయాల్లోకి వస్తున్న కొత్త రకం రాజకీయ నాయకులు పెరుగుతున్న కొద్దీ, అవినీతి కూడా అనేక కొత్త రూపాల్లోకి మారుతుంది. గతం లాగా అరకొర అవినీతి పనులతో తమ ధన దాహం వీరికి తీరడంలేదు. అధికారంలోకి వచ్చిన రోజు నుండే తమ జేబుల్లోకి కోట్లకు కోట్లు వచ్చి పడాలనే తహతహ పెరిగిపోతున్నది. ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక రాసినట్లు ఐదేళ్ళు ఆకలిగొన్న అక్రమ సంపాదన బకాసురుల కొద్దిమంది సమస్య కాదు ఇది. ఎంఎల్‌ఏ, ఎంపీ సీటు కోసం కోట్ల రూపాయలను విరాళాల పేరుతో తీసుకుంటూ, ఎన్నికల్లో గెలవడం కోసం మరిన్ని కోట్ల రూపాయలను ధారాళంగా ఖర్చు పెట్టమని చెబుతున్న పార్టీల అధినేతల విధానాల సమస్య ఇది. వందల, వేల కోట్లు ఖర్చు చేసి పదవులు దక్కించుకున్న వారు సులువైన కొత్త తరహా అవినీతి దారులుగా భూ కబ్జాలు, ఇసుక, మట్టి, రాయి, గాలి (పవన విద్యుత్) వాటిల్లో తమకు చేతనైనంత లూటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కన్నెర్ర చేయడంతో, క్రమశిక్షణ కమిటీ సుభాషితాలతో ఈ అక్రమాలు ఎలా పరిష్కారం అవుతాయి? అందుకే తమ మాటలకు, చేతలకు మధ్య వున్న తేడాలను జనం గుర్తించకుండా వుండేందుకు పక్కదారి పట్టించే రాజకీయాలను ఆశ్రయిస్తున్నారు. తాజాగా తిరుపతి లడ్డు వివాదం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎత్తుకున్న సనాతన ధర్మ నినాదం అందులో భాగమే. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా, పెరుగుతున్న సరుకుల ధరలను నియంత్రించకుండా, నాయకుల దందాగిరిని ఆపకుండా ప్రజల దృష్టిని మళ్ళించే ట్రిక్కులు కొంతకాలం పనికి వస్తాయేమోగానీ, అవే శాశ్వతమనకుంటే ‘వేషము మార్చెనూ…భాషను మార్చెనూ..మోసము నేర్చెనూ..అయినా మనిషి మారలేదు, అతని కాంక్ష తీరలేదు’ అని ప్రజలు గుర్తించడానికి ఎక్కువ కాలం పట్టదు.
వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి. రాంభూపాల్