మనలో చాలా మంది కృత్రిమ మేధ సాధనాలైన (టూల్స్) ఛాట్ జి.పి.టి, డాల్-ఇ, మిడ్ జర్నీ వంటివి ఉపయోగించి, వాటి పని తీరు చూసి మతిపోయేంత రీతిలో ఆశ్చర్యపోయుంటాం. ఛాట్ జి.పి.టి ని వినియోగిస్తుంటే అచ్చం మరో సజీవ మానవుడితో సంభాషిస్తున్న అనుభూతికి లోనవుతాం. మనం అడిగిన ఏ ప్రశ్నకైనా బదులు ఇస్తుంది. సంక్షిష్ట అంశాలను తేలిక పదాలతో అర్థమయ్యేలా వివరిస్తుంది. షేక్‌స్పియర్‌లా కవిత్వం అల్లుతుంది. వచనం రాస్తుంది. వ్యాసాలు, హోంవర్క్, అసైన్‌మెంట్లు ఇలా ఇదీ అదనీ కాదు. అన్నింటా మనకు సహకరిస్తుంది. డాల్-ఇ, మిడ్ జర్నీలను వినియోగించి మనం ఇచ్చిన సూచనల ఆధారంగా అద్భుతమైన చిత్రాలు రూపొందించవచ్చు. మనలో కళా నైపుణ్యాలు లేకపోయినా అద్భుతమైన కళాకారుడి అవతారం ఎత్తవచ్చు. కృత్రిమ మేధ సాధనాలు లా, మెడిసిన్, లెక్కల పరీక్షలు పెడితే విజయవంతంగా నెగ్గుకొచ్చాయన్న వార్తా కథనాలు వెలువడ్డాయి. వైద్య పరిశోధనా పత్రికల కోసం రూపొందించిన నివేదికలు మనుషులు రూపొందించినవే అన్నంతగా శాస్త్రవేత్తలను నమ్మించాయి. కృత్రిమ మేధ చుట్టూ నిరంతరాయంగా మీడియా సృష్టిస్తున్న ప్రచారపటాటోపం మూలంగా ఈ నూతన సాంకేతిక విప్లవంతో గతంలో ఎన్నడూ లేనంతగా మన జీవితాలు మారిపోనున్నాయనే అభిప్రాయం జనాల్లో పాదుకుంటున్నది.
మనుషులకు ఉండేంత మేధస్సుగల ఈ యంత్రాలు మనుషులు చెయ్యగలిగిన పనులన్నీ చేసేస్తూ వివిధ రకాల ఉపాధి అవకాశాలను కొల్లగొట్టేసి మనల్ని పనికిమాలిన వాళ్లుగా మార్చేస్తాయన్న సాధారణ అభిప్రాయం జనంలో ప్రబలిపోయింది. కృత్రిమ మేధతో కూడిన ఆటోమేషన్ (యాంత్రీకరణ) ద్వారా లక్షలాది ఫ్యాక్టరీ ఉద్యోగాలు పోతాయని, అలాగే జర్నలిస్టులు, రచయితలు, ఉపాధ్యాయులు, సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్లు, డాక్టర్లు వంటి వృత్తి నిపుణుల అవసరం లేకుండా పోతుందని ఇప్పటికే టన్నుల కొద్దీ వ్యాసాలు వచ్చాయి.
కృత్రిమ మేధ సాధనాలు అద్భుతాలే కావచ్చుగాక, కానీ అవి నిజంగానే అంత తెలివైనవా? ఛాట్ జి.పి.టి నిజంగానే మనం వేసిన ప్రశ్నలను అర్థం చేసుకుని, మనం లేవనెత్తిన అంశాలను అవలోకించి స్పందిస్తుందా? కళాకారులు తమ సృజనాత్మక శక్తితో రూపొందించే చిత్రాలు, రాసే కవిత్వం సృష్టించేటపుడు మనిషిలా ఆలోచిస్తాయా? కృత్రిమ మేధ సృష్టికర్తల సహా చాలామంది ఇప్పటికే ఇవి మానవ మేధస్సు వంటి లక్షణాలు కలిగి ఉన్నాయని ప్రకటించేశారు. కృత్రిమ మేధస్సు సాధనాలు మానవ మేధస్సుతో సమానంగా గానీ, దాన్ని దాటిపోయి ఏకైక అత్యత్తమ సాధనాలుగా మారడానికి ఎంతోకాలం పట్టదన్న వాదన కూడా చేస్తున్నారు. ఈ వాదనలకు మనం మోసపోవాల్సిన అవసరం లేదు.
వాస్తవానికి ఈ కృత్రిమ మేధ సాధనాలు మానవ మేధస్సుకు దరిదాపుల్లో లేవు. ప్రస్తుతం వీటిపై కొనసాగుతున్న పరిశోధనలు సమీప భవిష్యత్తులో మానవ మేధస్సుతో సరితూగగల వ్యవస్థను సృష్టించలేవు. అవి రూపొందించే పాఠాలు, సందేశాలు, చిత్రాలు, ఆఖరికి ‘కోడ్’లను కూడా అర్ధం చేసుకునే పరిజ్ఞానం కానీ, వాటి మీద పట్టుగానీ ఈ సాధనాలకు ఉండవు. కృత్రిమ మేధ ప్రధానంగా ఇప్పటికే ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం, చిత్రాల మీద ఆధారపడి పని చేస్తుంది. అందుబాటులో ఉన్న సమాచారానికి సంబంధించిన గణాంక ధోరణుల సాయంతో ఏ పదం తర్వాత ఏ పదం, ఏ విభక్తి తర్వాత ఏ వాక్యం రావాలో గ్రహిస్తుంది. అవి రూపొందించే వాక్యాలు, చిత్రాలు, పాఠాలు అన్నీ ఈ గణాంక ధోరణుల ఆధారంగా కలగాపులగం చేసి కొత్తగా మనకు అందివ్వడంతో ఈ సాధనాలకు ఆ యా విషయాల మీద చాలా పట్టు ఉందని భమ్రపడతాం.
అంటే ఈ సాధనాలు పనికిమాలినవనో, గొప్ప ఆవిష్కరణలు కాదనో చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. మన పనిలో ఇవి చాలా గొప్పగా ఉపకరిస్తాయి. కాకపోతే వాటి మేధస్సు మీద అతిగా ఆధారపడితే అది పొరపాటు ధోరణులకు దారితీస్తుంది. ఒక్కోసారి వినాశకర ఫలితాలు దాపురిస్తాయి. ఉదాహరణకు మన సెల్‌ఫోన్లలో ‘ఆటో కలెక్ట్’, ‘ఆటో కంప్లీట్ అన్న ఫీచర్లు ఉంటాయి. మనం ఏదన్నా టైప్ చెయడానికి పూర్తిగా వాటి మీదే ఆధారపడితే అది ఇచ్చే సలహాలు పొరబాటు అర్థాలకు దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి స్వయంగా మనం దానిని సరిచూసుకోవాల్సి ఉంటుంది. తప్పులు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఈ ఫీచర్లను వాడుతున్నంత మాత్రాన అవి ‘తెలివైనవి’ అనుకోగలమా. కృత్రిమ మేధ సాధనాలన్నీ ఈ ప్రాతిపదికన అభివృద్ధి చేసినవే. మనం రూపొందించిన వ్యాసాలలో పదబంధాలలో మార్పులు, సంక్లిష్టంగా ఉన్న వాక్యాలను సాధారణీకరించడం సంక్షిప్తం చెయ్యడం వంటి పనులకు ఛాట్ జి.పి.టి ఉపయోగపడుతుంది. అంతే తప్ప సాధికారిక సమాధానాలు ఇచ్చే శక్తి వాటికి ఉండదు. మానవ మేధస్సుతో సృజించే రచనలకు ఎంత మాత్రం సరిసాటి కావు. అలాగే కోడ్ రాయడానికి అందుబాటులో ఉన్న కోపైలట్ వంటి వాటికి కూడా పరిమితులు ఉన్నాయి. ఇది రూపొందించిన కోడ్‌ను సమీక్షించకుండా ఎవరూ ఏ కోడ్‌నూ వినియోగంలోకి తీసుకురాలేరు. ఇవాళా రేపు కార్పొరేట్ వ్యాపార వాణిజ్య సంస్థలు మానవ వనరుల మీద చేసే ఖర్చు ఎప్పటికప్పుడు తగ్గించుకోవాలనే సంస్కృతికి అలవాటు పడ్డాయి. ఇందులో భాగంగానే అవకాశం ఉన్న ప్రతి చోటా ఉద్యోగులను తొలగించి ఈ సాధనాలను వినియోగిస్తున్నాయి. అయితే వీటి మీద సరైన పర్యవేక్షణ లేని మూలంగా పొరపాట్లు దొర్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ కృత్రిమ సాధనాలను వినియోగించి తప్పుడు సమాచారం సృష్టించడం, డీప్-ఫేక్ వీడియోలు తయారు చేయడం వంటి హానికర ధోరణులకు పాల్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటి పట్ల తగు జాగ్రత్త వహించాలి.
కృత్రిమ మేధ ద్వారా సృష్టించే కళలు, సాహిత్యం, సినిమాల పట్ల నైతిక విలువల ఆందోళనలూ ఉన్నాయి. కృత్రిమ మేధ సాధనాల ద్వారా ఒక కళాకారుడి సృజనాత్మక కళా సృష్టి ధోరణులను ఆధారంగా చేసుకుని చిత్రాలు రూపొందించవచ్చు. కానీ ఇది మేధో చౌర్యం కిందకు వస్తుంది.
ఇప్పటి వరకు మనం చర్చించిన కృత్రిమ మేధ ప్రోగ్రామ్‌లన్నీ జనరేటివ్ ఎ.ఐ కోవ కిందకు వస్తాయి. ఇవిగాక మరికొన్ని కృత్రిమ మేధ సాధనాలున్నాయి. వీటి ఆధారంగా అంచనాలు, నిర్ణయాలు రూపొందిస్తారు. ఈ ప్రోగ్రామ్‌లు గత సమాచారం ఆధారంగా భవిష్యత్తు పరిణామాల మీద ఒక అంచనాను అందిస్తాయి. ఇప్పటికీ వీటిని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యకలాపాల్లో విరివిగా వాడుతున్నారు. అయితే ఈ ఎ.ఐ నిర్ణయం తీసుకునే విధానాలలో తప్పుల మూలంగా చాలామందికి న్యాయంగా పరిష్కారం కావాల్సిన ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు, మెడికల్ క్లెయిమ్‌లు నిరాకరించబడడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకుండా చేసిన దృష్టాంతాలు అనేకం వెలుగులోకి వచ్చాయి. అమెరికాలో ఎ.ఐ ఆధారంగా చేసిన నిర్ణయాల మూలంగా ఆ దేశంలోని మైనార్టీలు దీర్ఘకాలం కారాగార శిక్షలు అనుభవిస్తున్న వైనం బట్టబయలయ్యింది. పిల్లలకు సరైన పోషకాహారం అందించడం లేదనే తప్పుడు సమాచారం ఆధారంగా అనేక మంది తల్లిదండ్రులకు వారి బిడ్డల మీద ఉండే హక్కులకు దూరం చేశారు. ప్రజలకు వైద్య సదుపాయాలు అందకుండా పోయిన సందర్భాలూ ఉన్నాయి. ఈ కృత్రిమ మేధ సాధనాలకు…నిర్ణయాలు తీసుకునేందుకు అనువుగా…అందుబాటులో ఉంచిన సమాచారం శాస్త్రీ యంగా నియంత్రించినది కాకపోవడమే ఇందుకు కారణం. ఈ సాధనాలు చేసే నిర్ణయాలకు ఉన్న ప్రాతిపదికలను బహిరంగంగా వెల్లడించడం లేదు. అందుకే ఇవి చేసే నిర్ణయాలు ఏకపక్షంగా, పారదర్శక లేమితో ఉంటున్నాయి. పౌరుల, ఖాతాదారుల న్యాయమైన హక్కులను నిరాకరించ డానికి ప్రభుత్వాలు, ప్రైవేటు కార్పొరేట్ సంస్థలూ ఈ సాధనాలను వాడుతున్నాయనేది బహిరంగ రహస్యమే.
ఈ కృత్రిమ మేధ రూపొందించిన ఆల్గరిధమ్ మీద ఆధారపడి సామాజిక మాధ్యమాల్లో ఏ అంశాన్ని ప్రముఖంగా చలామణి చెయ్యాలో నిర్ణయిస్తున్నారు. అలాగే అభ్యంతరకర చిత్రాలు, పోస్టులను తొలగించడానికి వీటి సహకారం తీసుకుంటున్నారు. కానీ వాస్తవానికి అసంబద్ధ, విద్వేషపూరిత సమాచారాన్ని కనుగొని నిలవరించడంలో ఈ ఆల్గరిధమ్ విఫలమయ్యిందని ఈ మధ్యకాలంలో స్పష్టంగా తెలిసి వచ్చింది. ప్రభుత్వాలకు నొప్పి కలిగించే రాజకీయ అంశాలను తొక్కిపెడుతున్నాయి. ఇది ‘కంటెంట్ మోడరేషన్’ పేరిట సెన్సార్‌కి పాల్పడడమే. సామాజిక మాధ్యమాల్లో ‘ఫేక్ న్యూస్’ (తప్పుడు సమాచారం) ఎంతటి ఉత్పాతం సృష్టిస్తుందో మనం నిత్యం చూస్తున్నాం.
మరయితే కృత్రిమ మేధతో తయారైన మరమనుషులు-రోబోట్లు పారిశ్రామిక కార్మికులకు ఉద్వాసన పలకడం లేదా? వాస్తవిక ప్రపంచంలో మానవులు చేసే భౌతిక శ్రమ సంక్లిష్టంగా, బహు ముఖంగా, ఓ క్రమపద్ధతి లేకుండా, ఊహింపనలవికాని పరిస్థితులలో కూడా కొనసాగుతుంది. ఇది కేవలం అధ్యయనం ద్వారా సమకూరదు. సాధన కావాలి. రోబోట్లు మహా అయితే ఆటోమొబైల్ పరిశ్రమల్లో ఏకరీతిగా ఉండే ‘అసెంబ్లింగ్’ పనులు చేపట్టడానికి ఉపయోగపడతాయి. డ్రైవర్ రహిత కార్ల గురించి ఎంతకాలం నుంచి ఊదరగొడుతున్నారు! ఎన్నెన్ని నిధులు ఖర్చు చేస్తున్నారు! కానీ పూర్తిగా యంత్రం మీద ఆధారపడి వాహనం నడపడం అనేది సమీప భవిష్యత్తులో సాధ్యపడేలా లేదు. అందరూ ఊహించినట్లు కృత్రిమ మేధ ద్వారా శారీరక శ్రమ చేసే ‘బ్లూ కాలర్’ ఉద్యోగాలకు నష్టం వాటిల్లడానికి బదులు మేధోశ్రమ చేసే భాషా అనువాదకులు, ఉపన్యాసాలను అక్షరీకరించే పనులు, కాల్‌సెంటర్ ఉద్యోగాలు బలవుతున్నాయి.
కృత్రిమ మేధ మహా చెడ్డదనో, పనికిమాలినదనో చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. ఆ సాధనాలకు ఉన్న పరిమితులను గుర్తెరిగి సహాయకంగా వాడుకుంటే తప్పనిసరిగా ప్రయోజనాలు సమకూరుతాయి. అయితే కృత్రిమ మేధ పరిశ్రమ, ఆ సాధనాల చుట్టూ శృతి మించి అల్లుతున్న మీడియా ప్రచారం మాత్రం స్వార్థ ప్రయోజనాల రీత్యా చేపట్టినదే. కృత్రిమ మేధ మానవాళి సమస్యలను పరిష్కరించే పరమాద్భుతం ఏమీ కాదు. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూపించినట్లు ప్రపంచంలో ఉన్న ఉద్యోగాలన్నీ ఊడ్చుకు పోయేంత శక్తివంతమైనదీ కాదు. కృత్రిమ మేధ మానవాళిని బానిసలుగా చేసేదో, వినాశనం కావించేదో కాదు. అది ఎప్పటికీ సాధ్యపడేది కాదు.
కృత్రిమ మేధ సాధనాలను శల్యపరీక్షలకు గురిచెయ్యకుండా, సరైన పర్యవేక్షణ లేకుండా వినియోగించడం మాత్రం ప్రజలను నష్టాలకు గురిచేస్తుంది. న్యాయబద్ధమైన వారి హక్కులు, సదుపాయాలకు భంగం వాటిల్లుతుంది.
– వ్యాసకర్త : బప్పా సిన్హా
‘ఫ్రీ సాఫ్ట్‌వేర్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా’ సభ్యుడు