నిబద్ధ మీడియా నిర్బంధానికి లొంగేనా?

గురువారం నాడు ఢిల్లీ ప్రెస్‌క్లబ్‌లో ప్రముఖ మీడియా సంస్థల సీనియర్‌ ప్రతినిధులు అనేక మంది సమావేశమై దేశంలో మీడియా స్వేచ్ఛను కాపాడుకోవడం ఎలా? ముప్పు ఎటు వైపు నుంచి వస్తుంది? వంటి అంశాలు చర్చించారు. ప్రజాస్వామికంగా ఈ పోరాటం ఏయే రూపాలలో చేయొచ్చునో కూడా వారు ప్రస్తావించుకున్నారు. ‘న్యూస్‌ క్లిక్‌’ పై మోడీ సర్కారు దాడి మొదలై ఏడాది గడుస్తున్న సందర్భంలో వారు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం కూడా ఆసక్తికరమైందే. ప్రెస్‌క్లబ్‌ ఆఫ్‌ ఇండియాతో సహా పలు పాత్రికేయ సంఘాలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నాయి. ఈ సమావేశంలో వారు మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించడం విశేషం. జీవించే హక్కు పని హక్కు రెండూ విడదీయరానివే. అంతగా అవి ముడిపడి వుంటాయని పేర్కొన్నారు. ‘దాడులు, గాలింపులు జరిపి లాప్‌ట్యాప్‌లు, ఫోన్లు, కంప్యూటర్ల వంటి వృత్తి పరికరాలు ఇష్టానుసారం స్వాధీనం చేసుకుని తీసుకు పోవడమే గాక మళ్లీ తిరిగి ఇవ్వకపోతే ఎలా? అది జీవనోపాధి హక్కుపై దాడి లాంటిదే అవుతుంది కదా?’ అని ప్రశ్నించారు. ‘న్యూస్‌ క్లిక్‌’పై దాడి భారతదేశ మీడియా స్వేచ్ఛా సమరంలో అతి దారుణమైన సందర్భం. 1975లో ఎమర్జన్సీ తర్వాత కాలంలో అదే చెప్పుకోవలసిన ఘటన అని ‘హిందూ’ మాజీ ప్రధాన సంపాదకుడు ఎన్‌.రామ్‌ ఈ సందర్భంలో పేర్కొన్నారు. అయితే దీన్ని కేవలం మీడియా వ్యవహారంగానే గాక పోలీసుల పెత్తనంతో సాగిన రాజకీయ కథగా చూడవలసి వుంటుందని ఆయన స్పష్టం చేశారు. వామపక్ష, ప్రజాస్వామిక భావ జాలంతో పని చేసే ఓ స్వతంత్ర మధ్యతరహా మీడియా సంస్థపై జరిగిన ఈ దాడి అలాంటి జర్నలిజానికి పొంచి వున్న సవాళ్లకు సంకేతమని రామ్‌ స్పష్టం చేశారు. మోడీ ప్రభుత్వం స్పష్టమైన నిర్దేశిత లక్ష్యంతో భయోత్పాతం సృష్టిస్తూ, దేశ ద్రోహం వంటి కేసులు బనాయిస్తూ మీడియా సంస్థలు, మీడియా ప్రతినిధులు, మానవ హక్కుల కార్యకర్తలు, పౌర సమాజ సంస్థల వంటి వాటిపై నిరంతరాయంగా దాడి కొనసాగించడం విమర్శల నోరు నొక్కడం కోసమేనని కూడా తేల్చి చెప్పారు. సాంకేతిక మార్పుల కారణంగానూ సామాజిక అవసరాల కోసం అవతరించిన స్వతంత్ర మీడియా వేదికలు కూడా ఈ దాడిని ఎదుర్కోవడానికి సిద్ధం కావలసి వుంటుందని ‘వైర్‌’ సంపాదకుడు సిద్ధార్థ వరదరాజన్‌ పేర్కొన్నారు. పత్రికా స్వాతంత్య్రంపై జరిగే దాడికి ప్రతిఘటనలో ఈ అక్టోబరు 3 ఒక వార్షికోత్సవ ఘట్టంగా చూడాల్సి వుంటుందని ప్రముఖ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్‌ అభివర్ణించారు.
వాస్తవానికి ఈ నేపథ్యంలోనే మరో ప్రఖ్యాత మీడియా వేదిక పీక నులిమేందుకు మోడీ సర్కారు, కార్పొరేట్‌ శక్తులు కలిసి సాగించిన మహా పథకం కూడా గుర్తుకు వస్తుంది. కాకుంటే సరిగ్గా ఈ సమయంలోనే ప్రణరు రారు, రాధికా రారులను గత ఏడేళ్లుగా వెంటాడి వేధించిన కక్ష సాధింపు కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చేతులెత్తేయడం కూడా గమనిస్తాం. ఈ మేరకు ఇది కోర్టులో ముగింపు నివేదిక సమర్పించింది. ఎన్‌.డి టి.వి లో ప్రణరు రారు ప్రయాణం ఆధునిక భారత మీడియా గమనానికి సాక్షీభూతం వంటిది. ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంకు నుండి తమ వ్యాపార ప్రయోజనాల కోసం రుణాలు తీసుకున్న రారు దంపతులు సెక్యూరిటీలకు సంబంధించిన వివరాలు చెప్పకుండా దాచిపెట్టడం ద్వారా ఆ బ్యాంకుకు రూ.48 కోట్లు నష్టం కలిగించారనేది ఆరోపణ. ఇది ఏ స్థాయిలో ఎన్ని మెలికలతో ముందుకు తెచ్చారో, రాజకీయ వ్యాపార ఘనాపాటీలు ఎందరు కక్షగొండి పనులు చేశారో గుర్తు చేసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇ.డి అధికారికంగా అపజయాన్ని అంగీకరించిన రీత్యా వాటినోమారు నెమరేసు కోవడం అవసరం. లెక్కలు, సాంకేతిక వాదనలు అలా వుంచి సారాంశం ఏమిటో చూద్దాం.

ప్రణయ్, రాధికా రాయ్ ల సమరం
మీడియా దాడులలో అనేకం కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగితే ఎన్‌.డి టి.వి కథ ఆయన ప్రధాని అభ్యర్థి అయినప్పుడే మొదలైంది. ఇంకా చెప్పాలంటే మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం వుండగానే బిజెపి, సంఘ పరివార్‌ ప్రణయ్ రాయ్ ని టార్గెట్‌ చేయడం చూస్తాం. ఇరవయ్యేళ్లకు ముందు స్టార్‌ టీవీ మర్దోక్‌ ఇండియాలో ప్రసారాలు ప్రారంభం చేయాలనుకున్నప్పుడే ఆయనతో చర్చలు జరిపిన ప్రణయ్ రాయ్ ఆ షరతులు, పెత్తనం నచ్చక బయటికి వచ్చేశారు. మిత్రులతో కలసి బ్యాంకుల సహకారంతో ఎన్‌.డి టి.వి ప్రారంభించారు. అప్పట్లో దూరదర్శన్‌ బయటి సంస్థలతో ఉమ్మడి, ప్రత్యేక స్పాన్సర్డ్‌ కార్యక్రమాలకు అవకాశమిచ్చేది. ప్రణయ్ రాయ్ ‘వరల్డ్‌ దిస్‌ వీక్‌’ వంటివి ఈ క్రమంలో బాగా పేరుపొందాయి. సాంకేతిక పరిజ్ఞానం, ప్రజాస్వామ్య స్ఫూర్తి, సమయస్ఫూర్తి కలిగిన ఆయన శైలి వీక్షకులకు కట్టిపడేసి ఐకాన్‌గా మారారు. ఇదంతా కాంగ్రెస్‌కు అనుకూలంగా వారి మద్దతుతోనే చేస్తున్నారని బిజెపి, ఆరెస్సెస్‌ వర్గాలు, వారి అనుకూల మీడియా అదే పనిగా ప్రచారం సాగించేవి. మనీ లైఫ్‌ పత్రికలో 2004 లోనే ఇలాంటి కట్టుకథలుల రాస్తే, డిడి డైరెక్టర్‌ రతికాంత బసు, ప్రణయ్ రాయ్ కూడా తీవ్రంగా ఖండించారు. ప్రణయ్ రాయ్ కేసు వేస్తే కోర్టు ఆ ప్రచారకులను మందలించింది కాని ఆ బృందం అదేపనిగా ప్రచారాలు ఆపలేదు. 2010లోనే సండే గార్డియన్‌ పత్రిక డిడితో ఒప్పందంపై ఆరోపణలు ప్రచురించింది. బిజెపి ఎంపీగా పని చేసిన ఎడిటర్‌ ఎం.జె అక్బర్‌ కుమారుడి ఆధ్వర్యంలోని ఈ పత్రిక రాసిన కథలనే మాజీ కేంద్రమంత్రి యశ్వంత్‌ సిన్హా పార్లమెంటరీ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఆఖరుకు వాటినే గుజరాత్‌ ముఖ్యమంత్రిగా వున్న మోడీ కూడా 2013లో అంబానీల యాజమాన్యంలోని ‘న్యూస్‌ 18’ నిర్వహించిన చర్చలో ప్రస్తావించారు. రాయ్ లకు సహాయం చేసేందుకే ‘ప్రాజెక్టు టైగర్‌’ పేరుతో 200 కోట్లు ఖర్చు కేటాయించినట్లు ప్రణాళికా సంఘంలో చర్చ జరుగుతున్నదని అపహాస్యం చేశారు. ఇదే ఆరోపణలను మధు కిన్వర్‌ ‘మానుషి’ పత్రికలో ప్రచురించగా లూత్రా సంస్థ రాయ్ ల తరపున న్యాయ పోరాటం చేసింది. ఇవే విషయాలను ఆరెస్సెస్‌ అనధికార వ్యాఖ్యాత ఎస్‌.గురుమూర్తి, బిజెపి ఎంపీ వీరేంద్ర కపూర్‌, ఐ.ఆర్‌.ఎస్‌ అధికారి ఎస్‌.కె. శ్రీవాత్సవ కూడా మీడియాలో విస్తారంగా ప్రచారం చేస్తూ వచ్చారు. పి.ఆర్‌ ఆర్‌.ఆర్‌ సంస్థ షేర్లను అధిక విలువ చూపించి అప్పు తెచ్చుకున్నారనీ, ఇక్కడ చూపించిన షేర్లనే మరో చోట కూడా ఉపయోగించారని ఆరోపణ.

ఐక్యరాజ్యసమితి దాకా…
మోడీ అధికారంలోకి వచ్చాక సహజంగానే అదానీ మీడియా రంగంలోకి ప్రవేశించడం, ఇక్కడ ఆర్నబ్‌ గోస్వామి వంటి వారి ప్రాబల్యం మధ్య ప్రణయ్ రారు ఎదురీత సాగిస్తూ వచ్చారు. నిజానికి రెండు మూడు సార్లు మోడీని కలుసుకోవడం, ఆయన ఆహ్వానంపై గుజరాత్‌ సందర్శన కూడా చేశారు కానీ విధానాల విషయంలో రాజీ పడలేదు. ఈ నేపథ్యంలోనే 2017లో విదేశీ పర్యటనకు బయలుదేరబోతున్న రారు దంపతులను నిలిపేసి పాత కేసు తిరగదోడారు. దానికి నాలుగు రోజుల ముందే ఎన్‌.డి టి.వి చర్చలో పాల్గొన్న బిజెపి ఎంపీ సంబిత్‌ పాత్ర ఛానల్‌పై విశృంఖల ఆరోపణలు చేస్తే బయటకు నడవాలని ఆదేశించారన్నది గుర్తుంచుకోవాలి. అప్పటికే అదానీ ఎ.ఎం.జి మీడియా నెట్‌వర్క్స్‌ పెట్టుబడుల సంస్థ ప్రారంభించి పలు సంస్థలలో ప్రవేశించారు. విశ్వ ప్రధాన్‌ కమర్షియల్స్‌ లిమిటెడ్‌ (వి.సి.పి.ఎల్‌) అనే మరో కంపెనీ ద్వారా అక్రమ పద్ధతిలో ఎన్‌.డి టి.వి ని అధీనంలోకి తెచ్చుకున్నారు. వి.సి.పి.ఎల్‌ లో అదానీ హస్తం వుందని తెలియని ఆర్‌.ఆర్‌ పి.ఆర్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ దానితో కుదిరిన ఒప్పందం మేరకు అప్పు తీసుకుంది. ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంకుకు రూ.48 కోట్ల నష్టం తెచ్చిన పాత అప్పునుంచి తప్పించుకోవడానికే ఈకొత్త అప్పు తీసుకున్నారని సి.బి.ఐ కి సంజరు దత్‌ అనే సెక్యూరిటీ ఏజంటు ఫిర్యాదు చేశారు. స్వంతంగా దర్యాప్తు చేయడం తప్ప ప్రైవేటు ఫిర్యాదులపై పెద్దగా రంగంలొకి దిగని సిబిఐ ఇంత ప్రత్యేక శ్రద్ధ చూపడం కేవలం కక్ష సాధింపు కోసమే. సిబిఐ తో పాటు ఇడి మరోకేసు పెట్టడమూ అందుకే. ఈ దొంగ దారి స్వాధీనాన్ని, వేధింపు కేసులను మీడియా సంస్థలు, రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. తాను కేంద్రానికి తలవంచలేదు గనకే ఇంత దారుణానికి వొడిగట్టారని అయినా తాను లొంగబోనని రారు ప్రకటించారు. తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదనీ, ఇంతవరకూ అక్రమ ధనం తాకలేదని జాతీయ ప్రెస్‌క్లబ్‌లో విశ్వాసంగా చెప్పారు.2022 తర్వాత ప్రణరు రారు, రాధికా రారులు ఎన్‌.డి టి.వి డైరెక్టర్‌ స్థానాలను కూడా వదులుకుని వచ్చేశారు. దేశంలో మీడియా స్వేచ్ఛపై, మానవ హక్కులపై దాడి గురించి ప్రత్యేకంగా ప్రణరు రారులపై గురిపెట్టడం గురించి ఐక్యరాజ్యసమితిలో కూడా ప్రస్తావనకు వచ్చిందంటే పరిస్థితి ఎంత దిగజారిందో తెలుస్తుంది. తీరా చూస్తే ఢిల్లీ, డెహ్రాడూన్‌ల లోని రారుల నివాసాలతో సహా ఎన్‌.డి టి.వి కార్యాలయాల పైన, ఖాతాలపైన సిబిఐ విచ్చలవిడిగా గాలింపు జరిపినా ఏమీ దొరక్కపోవడం పాలకులకు చెంపపెట్టు లాంటిది.
ఇకనైనా ముగింపు?
ఎ.ఐ సాయంతో ప్రణరు రారు కొత్తగా స్థాపించిన డీ కోడర్‌ ప్లాట్‌ఫాం ఇప్పుడు నడుస్తూ వుంది. వయసు పెరిగినా మొన్నటి ఎన్నికల తరుణంలోనూ తనదైన విశ్లేషణ ఇచ్చి మెప్పించారు. ఇదిగో ఇలాంటి నేపథ్యంలోనే ఇ.డి రారుల కంపెనీపై పెట్టిన కేసు ముగిస్తున్నట్టు ప్రకటించింది. సిబిఐ కొత్తగా ఎలాంటి సాక్ష్యాధారాలు సేకరించలేకపోయిన కారణంగానే కేసు మూసివేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సంస్థ వర్గాలు వెల్లడించాయి. కాని దీనిపై కోర్టు తుది నిర్ణయం ప్రకటించాల్సి వుంది. మొత్తం కేసే మూసేస్తారా లేక మరింత దర్యాప్తు కోసం ఆదేశాలిస్తారా చూడాలి. కానీ ఇప్పటికే మోడీ హయాంలో మీడియా అణచివేత ఏ స్థాయిలో వుందో మాత్రం ప్రపంచమంతటికీ తెలిసింది. ఈ పూర్వ రంగంలోనే యు.పి ప్రభుత్వం కులతత్వంతో నడుస్తుందని ఆరోపించినం దుకు అభిషేక్‌ ఉపాధ్యాయ అనే పాత్రికేయుడిపై క్రిమినల్‌ కేసు మోపడం సరికాదని సుప్రీం చివాట్లు పెట్టడం ఆసక్తికరం.

తెలకపల్లి రవి

➡️