గుళ్ళ చుట్టూ తిరిగే కార్యక్రమం నా వ్యక్తిగతం అని నిన్న ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు. సరే! మనది సెక్యులర్ దేశం. సెక్యులర్ దేశంలో దేవుడు, మతం వ్యక్తిగతంగానే ఉంచుకోవాలి. అధికారికంగా ప్రభుత్వ ధనం పైసా కూడా ఖర్చు పెట్టరాదు. గుళ్లకు వెళ్లాలనుకుంటే సెలవు పెట్టుకొని, సొంత డబ్బుతో వెళ్ళాలి. అది నిజమైన సెక్యులర్ విధానం. మరి నిజంగా పవన్ కల్యాణ్ చేసేది వ్యక్తిగతం అయినట్లైతే అయన చుట్టూ కాపలా ఉండే రక్షణ వ్యవస్థ సంగతేంటి? వారికి చార్జీలు, భోజనం ఎవరు పెట్టుకుంటారు? దీనిపైన కూడా ఆయన వివరణ ఇస్తే బాగుంటుంది. ఈ రోజు ప్రధాని మొదలుకొని గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, చివరికి న్యాయమూర్తులు సైతం సెలవు దొరికితే చాలు…సెలవు లేకపోయినా పని దినాలలో కూడా అధికారికంగా గుళ్ల చుట్టూ, దొంగబాబాల ఆశ్రమాల చుట్టూ తిరుగుతూ సెక్యులరిజం అన్న మాటకు విలువ లేకుండా చేస్తున్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనం తగలేస్తున్నారు. దీనిమీద ఒక పెద్ద చర్చ జరగాలి. సరే సనాతనాన్ని రక్షిస్తానని శపథం చేశారుగదా! దాని సంగతి ఎమిటి? అన్ని కులాల వారి, అన్ని మతాల వారి ఓట్లతో ఎన్నికైన మీరు (పవన్ కల్యాణ్) ఒక మతానికి చెందిన సనాతన థర్మాన్ని రక్షిస్తానని శపథం తియ్యటం సబబా!! రాజ్యాంగ వ్యతిరేకం కాదా! రాజ్యాంగబద్ధంగా, ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన వ్యక్తి సనాతన ధర్మాన్ని రక్షిస్తాననడం, గుళ్ళ చుట్టూ తిరగడం రాజ్యాంగ ధిక్కారం అవుతుంది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దొంగబాబాలకు సన్మానం చెయ్యటం ఎమిటి? ఈ మధ్య గణపతి సచ్చితానందకు (అసలు పేరు సత్యనారాయణ), మాడుగుల నాగఫణి శర్మకు సన్మానం చేశారు. వారి పూర్వ చరిత్ర ఏమిటో తెలుసా! ఇలా చెయ్యడం వలన ఆయన హోదా తగ్గుతుంది. ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఇకనైనా ప్రజా ప్రతినిధులు రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా పని చెయ్యాలి. ఇలాంటి పనులు చేసేటపుడు పదవులకు శెలవు పెట్టుకొని సొంత డబ్బుతో చెయ్యండి.
– నార్నె వెంకట సుబ్బయ్య