రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు దాటింది. హడావుడి, ఆర్భాటాలు, రంగుల విజన్‌లతో మురిపిస్తున్నది. దావోస్ పెట్టుబడులు, పెట్టుబడుల సదస్సులతో రాష్ట్రంలో ఏవో అద్భుతాలు జరుగుతున్నట్లు మీడియా హోరెత్తిస్తున్నది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో సూపర్ సిక్స్, యువగళం పేర అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రజలకు వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చారు. ముఖ్యంగా తల్లికి వందనం పేర ప్రతి విద్యార్థికి నెలకు రూ.15 వేలు, మహిళా శక్తి పేర ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున సాయం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు ఏడాదికి రూ.20 వేలు పెట్టుబడి సాయం, ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి వంటి అనేకం అమలు చేస్తామన్నారు. మరో రెండు నెలల్లో ఈ ఆర్థిక సంవత్సరం ముగియబోతున్నది. కానీ ఈ ప్రభుత్వం ప్రజలకిచ్చిన వాగ్ధానాలు అత్యధికం అమలు చేయలేదు. కేవలం సామాజిక పింఛన్ రూ.4 వేలకు పెంపు, ఒకే ఒక గ్యాస్ సిలిండర్ ఇవ్వడం వరకే పరిమితమైంది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని, గత వైసిపి ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి అప్పులమయం చేసిందని, వస్తున్న ఆదాయంలో ఎక్కువ భాగం అప్పులపై వడ్డీలకే చెల్లించాల్సి వస్తోందని అందువల్ల ప్రజలకిచ్చిన సంక్షేమ పథకాల వాగ్దానాలు వెంటనే అమలు చేయలేక పోతున్నామని ప్రచారంలో పెట్టారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడమే కూటమి ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం అని, ఆ తరువాతే సంక్షేమ పథకాలు అమలు అని తెగేసి చెబుతున్నారు. ఈ ధోరణి కేంద్ర ప్రభుత్వం యొక్క నయా ఉదారవాద స్వభావాన్ని తెలియజేస్తున్నది. ఈ విధానాన్ని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలుకు పూనుకున్నది. ప్రభుత్వ ఖర్చు తగ్గించుకొని, ప్రభుత్వ ఆదాయం పెంచుకోవాలనేది నయా ఉదారవాద విధానం యొక్క ముఖ్యమైన లక్షణం. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఏదో ఒక వంక చూపి అమలు వాయిదా వేస్తున్నది. ఒకవేళ అమలుకు పూనుకున్నా అనేక షరతులు పెట్టి లబ్ధిదారుల సంఖ్యను చాల పరిమితం చేస్తారు. ఇప్పుడు సామాజిక పెన్షన్ పథకంలో అనర్హులు ఉన్నారనే ప్రచారం చేసి లబ్ధిదారులను కుదించటానికి పూనుకున్న విషయం తెలిసిందే.
పారిశ్రామికవేత్తలకు, వ్యాపార, వాణిజ్యవేత్తలకు మాత్రం ఎన్నడూ లేని విధంగా రూ.వేల కోట్లు పన్ను రాయితీలు ఇస్తున్నది. భూములు, గనులు, సముద్ర తీరం, అటవీ ప్రాంతం తదితర వాటిని ఈ శక్తులకు అభివృద్ధి పేర ధారాదత్తం చేస్తున్నది. ఈ చర్యల వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయానికి తీవ్ర గండి పడుతున్నది. ఉదాహరణకు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసే పరిశ్రమలకు, ఇతర వాణిజ్య సంస్థలకు పదేళ్లు రాష్ట్ర జీఎస్టి మినహాయిస్తున్నారు. భూములు ఉచితంగా బదలాయిస్తున్నారు. విద్యుత్, నీటి సరఫరా రాయితీలతో పాటు ఉత్పత్తి ప్రోత్సాహకాల పేర ప్రతి కార్మికుడికి నెలకు రూ. 7500 ప్రావిడెంట్ ఫండ్ రాయితీ పేర (యజమాని చెల్లించాల్సిన వాటా) చెల్లింపు, ఆ పరిశ్రమకు అవసరమైన ప్రధాన రోడ్లు, రైల్ వంటి మౌలిక సదుపాయాల కల్పన రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేయడం వంటి అనేక రాయితీలు కల్పిస్తున్నారు.
ఈ చర్యల వల్ల రాష్ట్ర వృద్ధి రేటు బాగా పెరిగి రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుతుందని, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం అంటున్నది. తదారా రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయం పెరుగుతుందని, దీనిద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టొచ్చని వాదిస్తున్నది. కానీ రాష్ట్ర విభజన తరువాత గడిచిన దశాబ్దంలో ఈ పరిణామాలు చోటు చేసుకోవడం లేదనేది వాస్తవం. రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఈ పదేళ్ళలో మూడు రెట్లు అయ్యింది. రాష్ట్ర స్థూల వృద్ధి రేటు సగటున 9 శాతం కొనసాగింది. కాని రాష్ట్ర ఖజానాకు ఈ సంపద పెరుగుదల వల్ల పన్నుల ఆదాయంలో గణనీయమైన పెరుగుదల రావాలి కాని రాలేదు. ఉదాహరణకు రాష్ట్ర జిడిపి 2024-15లో రూ.5.24 లక్షల కోట్లు వుండగా 2023-24కి రూ.14.39 లక్షల కోట్లకు పెరిగింది. దాదాపు మూడు రెట్లు రాష్ట్ర స్థూల ఆదాయం పెరిగింది. ఇదే మోతాదులో కనీసం రాష్ట్రానికి పన్నుల రూపంలో ఆదాయం పెరగాలి. ఇది జరగలేదు. 2014 నుండి 2024 కాలంలో రాష్ట్ర సొంత పన్నుల నుండి (రాష్ట్ర జీఎస్టీ, అమ్మకపు పన్ను, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డ్యూటీ వంటివి) వచ్చిన ఆదాయం కేవలం రూ.42,618 కోట్లు నుండి రూ.78,026 కోట్లకు మాత్రమే పెరిగింది. మొత్తం రాష్ట్ర సొంత పన్నుల నుండి, కేంద్ర పన్నుల నుండి రాష్ట్రానికి వాటా రూపంలో వస్తున్న ఆదాయం మొత్తం కలిపి చూస్తే రాష్ట్ర జిడిపిలో 9 శాతం లోపే పరిమితం అవుతున్నది.
రాష్ట్ర బడ్జెట్ వ్యయం కూడా రాష్ట్ర జిడిపి పెరుగుదలలో పడిపోతున్నది. 2018-19లో రాష్ట్ర బడ్జెట్ వ్యయం రాష్ట్ర జిడిపిలో 17.2 శాతం ఉంటే 2022-23 నాటికి 15.96 శాతానికి పడిపోయింది. అలాగే ముఖ్యమైన మూలధన వ్యయం కూడా రాష్ట్ర జిడిపిలో 2018-19లో 2.2 శాతం ఉంటే 20 22-23కి 0.13 శాతానికి తగ్గిపోయింది. మరొక వైపు కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా మోడీ పరిపాలనా కాలంలో బాగా తగ్గిపోతున్నది. కేంద్రం ఇచ్చే గ్రాంట్లలో కూడా కోత పెడుతున్నది. కేంద్ర ప్రాయోజిత పథకాల్లో రాష్ట్రాల వాటా ఏకపక్షంగా పెంచేస్త్తున్నది. రాష్ట్ర విభజన హామీలు అనేకం అమలు చేయటం లేదు. ఈ నిరంకుశ చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపటం లేదు. రాష్ట్రాలకు అప్పులు సేకరించుకొనే అవకాశాలపై కూడా కేంద్రం ఆంక్షలు విధిస్తూ కోతలు పెడుతున్నది. దీనిపై కూడా స్పందించడంలేదు. గత వైసిపి ప్రభుత్వం సైతం ఇదే వైఖరి అవలంభించింది. అలాగే షరతులతో అప్పులు తీసుకొని ప్రజలపై భారాలు వేయటంతో పాటు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు, ప్రజలకు నష్టకరమైన ప్రమాదకర విధానాల అమలుకు పూనుకున్నది. ఈ ప్రభుత్వం కూడా ఇదే వైఖరిని అమలు చేస్తూ రాష్ట్ర హక్కులను కేంద్రానికి తాకట్టు పెడుతూ అప్పుల కోసం కేంద్రం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నది. వైసిపి అమలు చేసిన కేంద్ర ప్రభుత్వ ఆదేశిత సంస్కరణలు చాలా వేగంగా అమలుకు పూనుకుంటున్నది. ఇటీవల నీతి ఆయోగ్ దేశంలోని అతి పెద్ద 18 రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక ఆరోగ్య సూచీ-2025 పేర ఒక నివేదికను విడుదల చేసింది. గత పదేళ్ళలో 2022-23 నాటికి ఉన్న ఆర్థిక పరిస్థితులు ఆధారంగా విడుదల చేసిన ఆర్థిక ఆరోగ్య సూచీలో ఆంధ్రప్రదేశ్ అట్టడుగున 17వ స్థానంలో ఉందనీ నివేదిక తెలిపింది. అయితే రాష్ట్రాల్లో ఈ స్థితికిగల కారణాలను నీతి ఆయోగ్ రాష్ట్రాలను బాధ్యులను చేసి నయా ఉదారవాద విధానాలను వేగంగా అమలు చేయాలని పరిష్కారంగా చూపించింది. దీనిని కూడా చంద్రబాబు ఒక ప్రచార అస్త్రంగా వాడుకుంటూ తన విధానాలను సమర్ధించుకుంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని గట్టెక్కించాలనే పేర ప్రజలపై భారాలకు వొడిగడుతున్నది. సుమారు రూ.40 వేల కోట్లపైబడి ప్రజల సంక్షేమంపై నిధులు ఖర్చు పెట్టకుండా దెబ్బతీసింది. లక్షల మంది వాలంటీర్లను తొలగించింది. ట్రూ అప్ చార్జీల పేర రూ.18 వేల కోట్లు విద్యుత్ చార్జీల భారం మోపారు. స్మార్ట్ విద్యుత్ మీటర్లు బిగింపు కొనసాగిస్తున్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆస్తి విలువ ఆధారిత ఆస్తి పన్ను విధానాన్ని సమీక్షించి ప్రజలకు మేలు చేస్తామని ఎన్నికల్లో చెప్పి ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదు. ఇప్పుడు రాష్ట్ర జీఎస్టీపై అదనంగా ఒక శాతం సర్ చార్జీ విధించాలని కేంద్రాన్ని కోరుతున్నది. ఇలాంటి పన్నుల భారాలు రాబోయే కాలంలో అనేక రూపాల్లో వస్తాయి. చెత్తపై యూజర్ చార్జీలు రద్దు చేసినా పీ4 (ప్రభుత్వ, ప్రైవేట్, పీపుల్ పార్టిసిపేషన్) పేర ప్రభుత్వ పౌర సేవలు, మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం వంటి సామాజిక సేవలు ప్రైవేట్ శక్తులకు బదిలీ చేయటానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ బాధ్యతల నుండి పూర్తిగా వైదొలగబోతున్నది. అలాగే ప్రభుత్వం తప్పనిసరిగా రాష్ట్ర బడ్జెట్‌లో వేతనాలు, రిటైర్ అయిన వారికి పెన్షన్, వడ్డీ చెల్లింపులు, పరిపాలనా ఖర్చులు (కమిటెడ్ ఎక్స్‌పెండిచర్)కు తగు వ్యయం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో 64.6 శాతం నిధులు వీటికి ఖర్చు పెట్టాల్సి వస్తున్నది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వేతనాలు, పెన్షన్ల మీద పెట్టే ఖర్చు తగ్గించుకునే విధానాన్ని అమలు చేస్తున్నది. గత దశాబ్దంలో వేతనాలు, పెన్షన్లపై ఖర్చు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో 39.30 శాతం నుండి 37.90 శాతానికి తగ్గి పోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో వున్న ఖాళీలు రద్దు చేసి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ద్వారా, కొన్ని సేవలు ప్రైవేట్ సంస్థలకు బదిలీ చేయటం ద్వారా ఈ ఖర్చును ఇంకా తగ్గించు కోవటానికి ప్రయత్నం చేస్తున్నది. ఈ విధానంలో భాగంగానే ఉపాధ్యాయ నియామకాలను జాప్యం చేస్తున్నది.
ఇప్పుడు ప్రభుత్వం ప్రజల సంక్షేమంపై వ్యయాన్ని కుదిస్తూ పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం, సంపన్నుల అవసరాల కోసం నిధులు ఖర్చు పెడుతున్నది. అదేమంటే 2047 నాటికి రాష్ట్ర జిడిపిని 2.4 ట్రిలియన్ డాలర్లలకు పెంచాలని తద్వారా రాష్ట్ర ప్రజలు అత్యంత సంపన్నలవుతారని ప్రచారం చేస్తున్నది. ప్రజలకు తక్షణ అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత కాకుండా విమానాశ్రయాలు, భారీ స్టేడియంలు, బుల్లెట్ ట్రైన్ల వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. తీసుకొస్తున్న అప్పులు కూడా వీటి కోసం ఖర్చు చేస్తున్నారు. చివరికి విద్య, వైద్యం వంటి సామాజిక సదుపాయాలకు కూడా ఖర్చు తగ్గించేస్తున్నారు. వ్యవసాయంపై కూడా ఖర్చు పెంచటానికి నిరాకరిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విధానాల వల్ల ప్రజల ఆదాయాలు పడిపోతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ శ్రామికుల ఆదాయాలు బాగా తగ్గిపోతున్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడం వల్ల ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా దెబ్బతిన్నది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత చిక్కుల్లో పడుతున్నది.
ప్రభుత్వం ప్రస్తుత విధానాన్ని విడనాడి సంక్షేమ పథకాల అమలు, వ్యవసాయం, నీటి పారుదల, విద్య, వైద్యం వంటి సామాజిక రంగాలు, ప్రజా పంపిణీ వ్యవస్థ విస్తరణ, ప్రభుత్వ ఉద్యోగ కల్పన, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక నిధులు, ప్రజలకు తక్షణం ఉపయోగపడే మౌలిక సదుపాయాల కల్పన వంటి వాటిపై ఖర్చులు పెంచాలి. పెట్టుబడిదారులకు ఇస్తున్న పన్ను రాయితీలు రద్దు చేయాలి. శ్రామికుల వేతనాలు పెంచాలి. ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ అదుపు, జోక్యం, వ్యయం పెంచాలి. దీనివల్ల ప్రజలకు ఆదాయం పెరిగి కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఈ ప్రక్రియ జరిగితేనే రాష్ట్రం ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామిక సరుకులకు, సేవలకు డిమాండ్ పెరిగి పన్నుల ద్వారా రాష్ట్రానికి అదనంగా రెండు నుండి మూడు రెట్లు సొంత బడ్జెట్ ఆదాయం పెరుగుతుంది. అంతేగాక అదనపు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. కొంత మేరకైనా ఆర్థిక అసమానతలు తగ్గుముఖం పడతాయి. ఈ దృష్టితో రాష్ట్ర ప్రభుత్వం క్రియాశీల విత్త విధానం అమలు చేపడితేనే రాష్ట్రం ప్రస్తుత ఆర్థిక సమస్యలనుండి బయట పడగలదు.
వ్యాసకర్త : డా|| బి.గంగారావు, సెల్ : 9490098792