Jun 10,2021 07:31

రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా కోరిన మీదట, వారి అభిప్రాయాలను గౌరవించి సమాఖ్య స్ఫూర్తితో కేంద్రమే వ్యాక్సిన్‌ పంపిణీని స్వీకరించిందన్న ధ్వని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటనలో వినవచ్చింది. ఇది వాస్తవం కాదు. గత ఏడేళ్లుగా మన రాజ్యాంగ ఫెడరల్‌ స్వభావాన్ని దెబ్బ తీసే దిశగానే మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. మోడీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ దాడి మరింత ఎక్కువైంది. ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌ ల నుండి నేటి వ్యాక్సినేషన్‌ కార్యక్రమం వరకు మోడీ సర్కారుది ఇదే దారి! రాష్ట్రాల హక్కులను కాజేయడం, వాటిని నిర్వీర్యం చేయడం ద్వారా కేంద్రీకృత పాలనా వ్యవస్థ వైపు నడవాలన్న ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండాను మోడీ అమలు చేస్తున్నారు. రాష్ట్రాల పరిధిలోనే వ్యవసాయం ఉంది. కానీ, దానిని తోసిరాజని కార్పొరేట్లకు వ్యవసాయ రంగాన్ని అప్పచెప్పే చట్టాలను మోడీ ప్రభుత్వం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు ససేమిరా అంటే, అమలు చేసి తీరాలని లేకపోతే తామే అమలు చేసి తీరుతామని డెడ్‌లైన్‌ విధించింది. ఈ ఒంటెత్తు పోకడపైనే దేశవ్యాప్తంగా రైతాంగం పోరాటం చేస్తోంది. ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డి, కరోనా రక్కసికి ఏ మాత్రం వెరవకుండా రైతాంగం చేస్తున్న ఈ పోరాటం భారతీయాత్మను ప్రపంచానికి తేటతెల్లం చేస్తోంది. ఇదొక్కటే కాదు! ఒకే దేశం..ఒకే పన్ను అంటూ రాష్ట్రాల ఆదాయ వనరులకు గండి కొట్టింది. ఏకపక్షంగా నూతన విద్యావిధానాన్ని రుద్దుతోంది. పోటీ పరీక్షల విషయంలోనూ జోక్యం చేసుకుంది. వైద్యసేవలు, సంక్షేమ పథకాల అమలులోనూ ఇదే ధోరణి. సమీక్షా సమావేశాల్లో కూడా ఫెడరల్‌ స్ఫూర్తికి మోడీ ప్రభుత్వం గండికొడుతుండటం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. కేంద్ర విద్యామంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ నేరుగా రాష్ట్రాల విద్యాశాఖ కార్యదర్శులతో సమావేశమైతే, ముఖ్యమంత్రులతో ప్రమేయం లేకుండా ప్రధానమంత్రి నేరుగా జిల్లా కలెక్టర్లతో మాట్లాడటం ఏ ప్రజాస్వామ్య సాంప్రదాయం?
రాష్ట్రాల ప్రమేయం లేకుండా రూపొందించిన ఎన్‌ఆర్‌సి తో మత ప్రాతిపదికన విడదీయాలన్న ప్రయత్నాన్ని పెద్ద ఎత్తున ప్రతిఘటించడం ద్వారా దేశ ప్రజలు అడ్డుకున్నారు. వ్యవసాయ వ్యతిరేక చట్టాలనూ రైతులు పోరాటం ద్వారానే అడ్డుకుంటున్నారు. ఏప్రిల్‌ నెలలో ఏకపక్షంగా ప్రకటించిన సరళీకృత వ్యాక్సిన్‌ విధానాన్ని రాష్ట్రాలన్నీ కలిసి నిరసించిన కారణంగానే కేంద్ర ప్రభుత్వం కొంతమేరకైనా దిగివచ్చింది. ఫెడరల్‌ స్ఫూర్తికి మోడీ ప్రభుత్వం నుండి ఎదురౌతున్న ముప్పును నివారించడానికి రాష్ట్రాలన్నీ కలిసి పోరాడాలి. అటువంటి పోరాటంలో వెనుకబడినందువల్లే దేశానికి మణిహారంగా ఉండిన జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రం అదృశ్యమై కేంద్రపాలిత ప్రాంతాలుగా ముక్కలైపోయింది. ఢిల్లీ, పాండిచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల్లో అక్కడి ప్రజల అభిప్రాయాలకు విలువ లేకుండా పోయింది. తాజాగా లక్షద్వీప్‌దీ అదే ఉదంతం.
భారత దేశమంటేనే భిన్నత్వం...భిన్నత్వంలో ఏకత్వం! కులాలు, మతాలు, సాంప్రదాయాలు, ఆచారాలు, భాషలు! పూలదండలోని దారంతో వీటన్నింటిని కలిపి ఉంచే సోదరతత్వం! దీనికి తగ్గట్టుగా రాష్ట్రాల పొందిక! రాష్ట్రాలను గౌరవించడం, వాటి హక్కులను కాపాడటమంటే ప్రజల హక్కులను పరిరక్షించడమే. విశాల సాంస్కృతిక, రాజకీయ బహుళత్వాన్ని ముందుకు తీసుకుపోవడమే. రాజ్యాంగం నిర్దేశించిన సమాఖ్యతత్వం ఇదే! సామాజికంగానూ, పారిశ్రామికంగానూ, ఆర్థికంగానూ బలోపేతమైన రాష్ట్రాలు కేంద్రాన్ని మరింతగా పరిపుష్టం చేస్తాయి. ఇతర రాష్ట్రాల ఎదుగుదలకు దోహదం చేస్తాయి. సైద్ధాంతికంగానే భారతీయ జనతా పార్టీ ఈ భిన్నత్వానికి వ్యతిరేకం! అందుకే రాష్ట్రాల హక్కులను కబళించడానికి పదేపదే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడైనా రాష్ట్రాలు మేలుకోవాలి. కేంద్రం వైఖరికి అడ్డుకట్ట వేయాలి. మోడీని మెప్పించి రాష్ట్రాలకు ప్రయోజనాలు, రాయితీలు తేవచ్చన్న వృధా ఆశలను విడనాడాలి. మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పుడైనా తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టే రీతిలో కేంద్రం పెత్తనాన్ని ఎదురొడ్డి నిలవాలి.