Jul 27,2021 16:49

పెళ్లెప్పుడు అవుతుంది బాబూ... పిల్ల ఏడ దొరుకుతుంది బాబూ అని వందేమాతరం శ్రీనివాస్‌ పాడిన పాట ఇప్పటికీ బ్యాచిలర్స్‌కి ఆపాదించే పాటగా ముద్రపడిపోయింది. అసలిప్పుడు పెళ్లి గురించి టాపిక్‌ ఎందుకు అనుకుంటున్నారా? పెళ్లి వయసు దాటిపోయిన తర్వాత వివాహం చేసుకుంటే పలు సమస్యలు వెంటాడతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతెందుకు ఒకప్పుడు పెళ్లి వయసు 20-25 లోపు చేసుకునేవారు. ఆ వయసులో పెళ్లి చేసుకోవడం వల్ల సంతానోత్పత్తి సమస్యలు తలెత్తలేదు. ఇప్పుడు.. లైఫ్‌లో సెటిల్‌ అయిన తర్వాతనే పెళ్లి అంటూ వివాహాన్ని వాయిదా వేస్తున్నారు. సెటిల్‌ అవడం అంటే... మంచి ఉద్యోగం.. కారు, ఇల్లు లాంటి ఆలోచనల్లో మునిగితేలుతూ... జీవితంలో యవ్వన కాలాన్ని కనుమరుగు చేస్తున్నారు. ఆ దశను కేవలం చదువులకు... ఉద్యోగాలకే పరిమితం చేస్తున్నారు. ఈ కోవలోకి ఒక్క పురుషులే కాదు.. మహిళలు సైతం చేరుతున్నారు. కారణాలు ఏవైనప్పటికీ... సరైన సమయంలో పెళ్లి చేసుకోకపోతే... ఎన్నో సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

సంతోనోత్పత్తిలో సమస్యలు..
ముఖ్యంగా యుక్త వయసులో కాకుండా.. వయసు పైబడిన తర్వాత వివాహం చేసుకుంటే... సంతానోత్పాత్తి విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వుంటుందని వైద్యులు చెబుతున్నారు. దాదాపు పాతికేళ్ల క్రితం సంతానలేమి శాతం చాలా తక్కువగా ఉండేది. అది కూడా ఎన్నో సంక్లిష్టమైన సమస్యలుంటే తప్ప..సంతానలేమి ఉండేదికాదు. నేటి కాలంలో మహిళలు కూడా వయసుపైబడిన తర్వాత వివాహం చేసుకోవడం వల్ల ఆ ప్రభావం గర్భధారణపై పడుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. మహిళల వయసు పెరుగుతున్న కొద్దీ... మెరుగైన అండాల సంఖ్య తగ్గిపోతుంది. ఇలా అండోత్పత్తి శాతం ఏడాదికేడాదికి 10 శాతం వరకు తగ్గిపోతున్నదని వైద్యులే చెబుతున్నారు. అలాగే పురుషుల్లో కూడా స్పెరమ్‌ కౌంట్‌ బాగా తగ్గిపోతుందట. ఉదాహరణకు గత 40 ఏళ్ల కిందట పురుషుల్లో వీర్యకణాల సంఖ్య పది కోట్లుగా ఉంటే.. ఇప్పుడు వాటి సంఖ్య ఐదు కోట్లకు పడిపోయిందట. ఇలా స్పెరమ్‌ కౌంట్‌ పడిపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. మానసిక ఒత్తిడి, వెరికోసిల్‌, కాజస్‌ వంటివి కొన్ని కారణాలతై.. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్ల ద్వారా వీర్య కణాల సంఖ్య మరింత క్షీణిస్తోందని డాక్టర్లు చెబుతున్నారు. ఇలాంటి కారణాల వల్ల గర్భధారణ క్లిష్టమైన సమస్యగా మారిపోతుంది. అందుకే నేటి యువత ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎగ్‌ఫ్రీజింగ్‌వైపు మొగ్గుచూపుతున్నారు.

egg freezingఎగ్‌ ఫ్రీజింగ్‌ అంటే..
మహిళల్లో 18 నుంచి దాదాపు 30 ఏళ్ల వరకు ఆరోగ్యవంతమైన అండాలు విడుదలవుతాయి. ఆ వయసులోనే పిల్లల్ని కంటే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. అదే వయసుపైబడిన తర్వాత వివాహం చేసుకుని, పిల్లల్ని కనాలనుకుంటే వారికి ప్రధానంగా మహిళల్లో అండోత్పత్తి సమస్య ఎదురవుతుంది. మరి దీన్నెలా అధిగమించాలనే ఆలోచనల్లోనుంచి పుట్టిందే ఈ ఎగ్‌ ఫ్రీజింగ్‌. ఎగ్‌ఫ్రీజింగ్‌ ప్రపంచంలో మొదటిసారిగా సింగపూర్‌లో జరిగింది. ఎగ్‌ ఫ్రీజింగ్‌ ద్వారా దంపతులు ఎప్పుడు పిల్లల్ని కనాలనుకుంటున్నారో.. ఆ సమయంలోనే పిల్లల్ని కనేందుకు ఈ విధానం తోడ్పడుతుంది. అందుకే నేటి యువత గర్భధారణ సమస్య తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ముందస్తుగా.. యుక్త వయసులో విడుదలయ్యే అండాలను ఫ్రీజింగ్‌ పద్ధతిలో నిల్వ ఉంచుతున్నారు. అంటే.. ఆ వయసులో విడుదలయ్యే ఆరోగ్యవంతమైన అండాలను వైద్యుల సూచనలతో బయటకు తీసి.. మైనస్‌ 195 డిగ్రీల దగ్గర శీతలీకరణలో ఉంచుతారు. ఇలా శీతలీకరణలో ఉంచిన అండాలు ఎన్ని సంవత్సరాలైన నిల్వ ఉంటాయి. అందుకే ఇప్పుడు చాలామంది అండాలను ఫ్రీజింగ్‌లో ఉంచడం ద్వారా కావాలనుకున్నప్పుడే పిల్లల్ని కనేస్తున్నారు. ఇలా ఎగ్‌ఫ్రీజింగ్‌కు మన దేశంలో ఐవిఎఫ్‌ సెంటర్లు సరైన సదుపాయాలే కల్పిస్తున్నాయి. ఇక విదేశాల్లో అయితే ఎగ్‌ఫ్రీజింగ్‌ శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది. కరోనా మహమ్మారి సమయంలో పిల్లల్ని కనొద్దు అనుకునే వారి సంఖ్య పెరిగి.. ఎగ్‌ఫ్రీజింగ్‌ చేసే వారి సంఖ్య దాదాపు 50 శాతానికి పెరిగిందట.

ఎగ్‌ఫ్రీజింగ్‌కు ముందువరుసలో సెలబ్రిటీలు...
ఎగ్‌ఫ్రీజింగ్‌ చేసే వారిలో ప్రముఖ నటీమణులే ముందు వరుసలో ఉంటున్నారని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. వారి వారి వ్యక్తిగత కారణాల రీత్యా సెలబ్రిటీలు ఎగ్‌ఫ్రీజింగ్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. దాంతో వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు అత్యాధునిక పద్ధతులతో గర్భధారణ పొందుతున్నారు. అయితే ఇలా కృత్రిమ పద్ధతిలో పిల్లల్ని కంటే.. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు సూచిస్తున్నారు. గతంలో కంటే ఇలా ఆధునిక పద్ధతిలో గర్భధారణ పొందడంపై మహిళలే కాదు.. పురుషులు కూడా మంచి అవగాహనతో ఉంటున్నారు. గర్భధారణ సమస్య అనేది కేవలం ఒక్క మహిళల సమస్య మాత్రమే కాదని పురుషులు కూడా భావిస్తున్నారు. ఇదొక మంచి పరిణామం. అయితే... సరైన వయస్సులో, సహజసిద్ధమైన పద్ధతిలో పిల్లల్ని కంటేనే... వారు ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. సమాజం ఆరోగ్యకరంగా వుండాలంటే... వ్యక్తులు ఆరోగ్యంగా వుండాలి. వ్యక్తులు ఆరోగ్యంగా వుండాలంటే... మానసిక ఒత్తిళ్లకు, దుర అలవాట్లకు దూరంగా వుండాలి. అప్పుడే... ఆరోగ్యకరమైన సంతానోత్పత్తి జరుగుతుంది. పిల్లలు కూడా శారీరకంగానూ, మానసికంగానూ ఆరోగ్యంగా ఎదుగుతారని వైద్య శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

celebrity