May 16,2022 15:58

ప్రజాశక్తి-రాజవొమ్మంగి : ఏజెన్సీ ప్రాంతంలో తాగునీరు, రహదారులు వంటి వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా(పాడేరు)కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. కలెక్టర్ సుమిత్ కుమార్ రాజవొమ్మంగిలో మొదటిసారి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు,అధికారులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. తొలిత స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలెక్టర్ సుమిత్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలంలో నెలకొన్న సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రజా ప్రతినిధులు తమ గ్రామాల్లో నెలకొన్న తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు తదితర సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాలు అందజేశారు,వాటి పరిష్కార మార్గాలు అన్వేషించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, తాగునీరు సమస్యలు పరిష్కరించాలంటూ 8,రహదార్లు నిర్మించాలంటూ 10, కొండ పోడు పట్టాలు కావాలని తదితర సమస్యలపై అర్జీలు వచ్చాయని తెలిపారు, జల జీవన్ మిషన్ ద్వారా,అలాగే వివిధ నిధుల ద్వారా ఎక్కడైతే తాగునీటి సమస్య నెలకొందో అక్కడ ప్రాధాన్యత ఇస్తూ పరిష్కారానికి కృషి చేస్తామన్నారు, గిరిజనపల్లెల్లో ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించేలా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు, అలాగే గ్రామాల్లో అవసరమైనచోట రహదారుల నిర్మాణం, అలాగే గతంలో మంజూరై ఆగిపోయిన రోడ్ల నిర్మాణ పనులును గిరిజన సంక్షేమ శాఖ, పంచాయితీ రాజ్,సిసిడిపి ల ద్వారా పనులను చేపట్టేందుకు కృషి జరుగుతోందన్నారు. వైద్యఆరోగ్య, శాఖ, విద్యుత్తు, జిసీసి తదితర శాఖల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోము వెంకటలక్ష్మి, జడ్పిటిసి ఒడుగుల జ్యోతి, సర్పంచుల సమైక్య అధ్యక్షులు కొంగర మురళీకృష్ణ, స్థానిక సర్పంచ్ గొల్లపూడి రమణి, వైస్ ఎంపీపీ లు జె రాజేశ్వరి,సీహెచ్ సత్య చంద్ర రాణి, స్థానిక తాహాశీల్దార్ సుబ్రహ్మణ్యం ఆచారి,ఎంపిడిఓ కె కామేశ్వరరావు,స్థానిక ఎస్సై టి జి నరేంద్ర ప్రసాద్,గిరిజన సంక్షేమశాఖ డి ఈ గౌతమి, ఎంఇఓ కె తాతబ్బాయి దొర, పలువురు ఎంపీటీసీలు,సర్పంచులు,పలుశాఖల అధికారులు,సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.