Apr 20,2021 22:53

ప్రజాశక్తి-కడపప్రతినిధి : ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలపై కరోనా ప్రభావం పడింది. బుధవారం నుంచి తొమ్మిది రోజులపాటు బ్రహోత్సవాల నిర్వహణకు టిటిడి యంత్రాంగం భారీగా ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర పురావస్తుశాఖ ఈ నెల 17 నుంచి మే 15వ తేదీ వరకు కోదండ రామాలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. టిటిడి అధికార యంత్రాంగం కోదండరాముని బ్రహ్మోత్సవాలను ఆలయ ప్రాంగణానికే పరిమితం చేస్తూ 'ఏకాంతం బ్రహ్మోత్సవం' నిర్వహణ పేరుతో ప్రచారం చేస్తోంది. 26న నిర్వహించనున్న కల్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వ జీవోలో పేర్కొన్న పేర్లు కలిగిన వారిని మాత్రమే ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయని, పర్యాటకులు, యాత్రికులు, స్థానికులను సైతం ఆలయం లోపలికే ప్రవేశించే అవకాశాలు లేవని టిటిడి అధికారులు పేర్కొనడం గమనార్హం. బుధవారం ఉదయం 8.30 గంటలకు ధ్వజారోహణం కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.