Feb 27,2021 06:53

సామాజిక మాధ్యమాల కట్టడికి మోడీ ప్రభుత్వం గురువారం నిబంధనలు వెలువరించింది. ట్విటర్‌, వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ఒటిటి సంస్థలు ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తే చట్ట రీత్యా చర్యలు తప్పవని హుంకరించింది. సోషల్‌ మీడియా వంటి విస్తృత ప్రజా భాగస్వామ్య అంశాలపై ఆయా సంస్థలు, సంఘాలు, రాజకీయ పార్టీలతో చర్చలు, సంప్రదింపులు జరిపి సూచనలు తీసుకొని ఉభయ తారకంగా అంతిమ నిర్ణయాలు చేయడం ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల బాధ్యత. కాని మోడీ ప్రభుత్వం సోషల్‌ మీడియాపై నిబంధనల విషయంలో కనీసం పార్లమెంట్‌ను సైతం విశ్వాసంలోకి తీసుకోలేదు. మొన్ననే తొలి దశ బడ్జెట్‌ సమావేశాల ముగిశాయి. త్వరలోనే రెండవ విడత సమావేశాలు ఉన్నాయి. అప్పటి వరకు కూడా ఓపిక పట్టలేక ఏకపక్షంగా కేవలం పాలనాపరమైన ఉత్తర్వుల ద్వారా సోషల్‌ మీడియా నియంత్రణ నిబంధనలను ప్రకటించింది. ఎప్పుడో 2018లో రాజ్యసభ కమిటీల చర్చను, అప్పటి ముసాయిదాను ఇప్పుడు ఉటంకించి తాము సంప్రదింపులు జరిపామనడం ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాన్ని సమర్ధించుకునే ప్రయత్నం తప్ప మరేం కాదు.


ఎన్నో ఏళ్ల నుంచి సోషల్‌ మీడియా అత్యంత ప్రభావ వంతంగా పని చేస్తుండగా, ఇప్పుడే హఠాత్తుగా దానికి హద్దులు గీయాలన్న తలంపు బిజెపి ప్రభుత్వానికి ఎందుకొచ్చిందో, వచ్చిందే తడవు ఎందుకు చెర్నాకోలు ఝుళిపించి అదుపు చేయాలనిపించిందో తెలుసుకోలేనంత అవగాహనా రాహిత్యం ప్రజలకు లేదు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి అధికారంలోకొచ్చింది ఆ పార్టీ శ్రేణులు, అనుకూలురు పనిగట్టుకొని టార్గెట్లు పెట్టుకొని సోషల్‌ మీడియా వేదికలపై చేసిన ప్రచారం వల్లనేనన్నది జగమెరిగిన సత్యం. మోడీని అంత వాడు ఇంత వాడు అని ఆకాశమే హద్దుగా చీత్రీకరించింది సోషల్‌ మీడియా ద్వారానే. సోషల్‌ మీడియాను బిజెపి, మోడీ ఉపయోగించుకున్నంతగా వేరెవరూ ఉపయోగించుకోలేదు. మరి ఆ సోషల్‌ మీడియాపై బిజెపికి ఇప్పుడు కంపరం పుట్టడానికి కారణం సోషల్‌ మీడియాలో వ్యక్తమవుతున్న ప్రభుత్వ వ్యతిరేకత. వాస్తవాలు బహిర్గతం అవుతున్నాయనే భయంతోనే ఇప్పుడు కట్టడి చేయాలనుకుంటోంది. సోషల్‌ మీడియా అనేది స్వతంత్ర వ్యవస్థ. దానిలో కేవలం బిజెపికి అనుకూలంగా మాత్రమే ప్రచారం సాగాలని వాంఛించడం నిరంకుశ ధోరణికి పరాకాష్ట. తనకు నచ్చితేనే మంచిది లేదంటే చెడ్డది అన్న ఏకైక ప్రామాణికత ఆధారంగా సోషల్‌ మీడియాపై ఆంక్షలు విధించడం ప్రజాస్వామ్యంలో తగని పని.
తమ విధానాలపై నిరసనలను, అసమ్మతి అసంతృప్తులను బిజెపి ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది. తీవ్ర అసహనానికి లోనవుతున్న పర్యవసానాలే స్వతంత్ర మీడియా సంస్థలు, పాత్రికేయులు, రచయితలు, మేధావులపై దేశద్రోహం, ఉపా వంటి తీవ్రాతి తీవ్ర సెక్షన్ల కింద అక్రమ కేసుల బనాయింపు. ఢిల్లీలో రైతుల ఆందోళనలపై వార్తలను ప్రజలకు అందిస్తున్న న్యూస్‌క్లిక్‌పై ఏ విధంగా ఇడి నిర్బంధం అమలైందో దేశం యావత్తూ వీక్షించింది. రైతు ఉద్యమానికి మద్దతుగా పోస్టును షేర్‌ చేసిన దిశా రవి విషయంలో ఢిల్లీ పోలీసులు ఎంత అనుచితంగా వ్యవహరించారో చూశాం. జర్నలిస్టులు సిద్దార్ధ వరదరాజన్‌, మృణాల్‌పాండే, సర్దేశారు వంటి వారిపై కేసులు సరేసరి. బ్రిటిష్‌ కాలం నాడు పెట్టినట్లు రాజద్రోహం కేసులను బనాయిస్తున్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు ఇష్టారీతిన నమోదవుతున్నాయి. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్‌లో 2010 నుంచి ఇప్పటికి నమోదైన కేసుల్లో యోగి ప్రభుత్వం వచ్చాక పెట్టినవి 77 శాతం. నిరసన గొంతులను బిజెపి ఎంత నిరంకుశంగా నొక్కుతోందో యు.పి ఉదంతం తెలుపుతోంది. సోషల్‌ మీడియాలో దేశ సమైక్యత, సమగ్రతలను దెబ్బతీసే విద్రోహ వ్యాప్తి పోస్టులు పెట్టిన రాజాసింగ్‌, బండి సంజరు, నకిలీ టిఆర్‌పి రేటింగ్‌లకు పాల్పడిన అర్నబ్‌ గోస్వామి వంటి వారు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ప్రజలకు సత్యాలను అందిస్తున్న పుర్కాయస్థ, దిశా రవి వంటి వారు నిర్బంధాల పాలవుతున్నారు. పౌరులకు రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులకు ప్రమాదం ఏర్పడింది. ఈ పూర్వరంగంలో కేంద్రం సోషల్‌ మీడియాపై విధించిన ఆంక్షల అసలు లక్ష్యమేమిటో ప్రజలకు సులభంగానే బోధ పడుతోంది.