Oct 13,2021 20:35

అమరావతి బ్యూరో :స్టాక్‌ మార్కెట్‌లో ఎల్‌ఐసి లిస్టింగ్‌ ప్రక్రియను నిలిపివేయాలని, అలా కాకుండా ఐపిఓ విషయంలో కేంద్రం మొండిగా ముందుకు వెళితే దేశ వ్యాప్తంగా ఒక రోజు సమ్మె చేస్తామని ఆలిండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ (ఎఐఐఇఎ) జనరల్‌ సెక్రటరీ శ్రీకాంత్‌ మిశ్రా అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని రక్షించుకునేందుకు బ్యాంకింగ్‌ ఉద్యోగ సంఘాలతో పాటు అన్ని ట్రేడ్‌ యూనియన్‌లను కలుపుకుని ఐక్యపోరాటం చేస్తామన్నారు. విజయవాడ బీసెంట్‌రోడ్డులోని ఎల్‌ఐసి బిల్డింగ్‌ (జీవనజ్యోతి)లో మిశ్రా బుధవారం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ వాటాల విక్రయాన్ని నిలిపివేయాలని, కార్మిక చట్టాల్లో కార్మిక వ్యతిరేక సవరణను వెనక్కి తీసుకోవాలని ఎఐఐఇఎ డిమాండ్‌ చేస్తోందన్నారు. ఎల్‌ఐసిని పరిరక్షించుకునేందుకు ప్రజలు, పాలసీదారులు, లక్షలాది మంది బీమా ఏజెంట్ల సహకారంతో విస్తృత ప్రచారం చేస్తామన్నారు. ఇప్పటికే పార్లమెంటు సభ్యులు, మేధావులు, వివిధ రంగాల ప్రముఖులను కలిశామని, దేశ వ్యాప్తంగా సెమినార్‌లు, సదస్సులు నిర్వహించడంతో పాటు కరపత్రాల పంపిణీ చేపట్టామన్నారు.
నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ పేరిట 2025 నాటికి రూ.6లక్షల కోట్లను సమీకరించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఎల్‌ఐసిలోని ప్రభుత్వ వాటాలను స్టాక్‌ మార్కెట్‌లో అమ్మడానికి ఐపిఓ పద్ధతిని ప్రభుత్వం చేపట్టిందని,ఈ ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1.75లక్షల కోట్ల నిధుల్ని రాబట్టుకోవాలన్న లక్ష్యాన్ని కేంద్ర ఆర్ధిక మంత్రి గత బడ్జెట్‌లోనే ప్రకటించారన్నారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ఎయిర్‌పోర్టులు, రైల్వేలు, బగ్గు గనులు, జాతీయరహదారులు, టెలీకమ్యూనికేషన్స్‌, పోర్టులు, పవర్‌ జనరేషన్‌ తదితర రంగాలను ప్రైవేటు సంస్థలకు అద్దె/లీజు రూపేణా ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారని శ్రీకాంత్‌ మిశ్రా పేర్కొన్నారు. రూ.38లక్షల కోట్ల ఆస్తులతో ప్రభుత్వ రంగ ఎల్‌ఐసి ప్రపంచ అగ్రగామి సంస్ధగా ప్రఖ్యాతి గడించిందన్నారు. 2000 సంవత్సరం నుంచి నేటి వరకు 21 సంవత్సరాల్లో జీవిత బీమా మార్కెట్‌లోకి 22కంపెనీలు ప్రవేశించాయని, వీటిని ఎదుర్కొని కోట్లాదిమంది పాలసీ దారుల నమ్మకంతో ఎల్‌ఐసి 70శాతం పైగా వాటాతో మార్కెట్‌ లీడర్‌గా నిలిచిందన్నారు. 42 కోట్ల పాలసీలతో అత్యంత శక్తివంతంగా ఉన్న ఎల్‌ఐసి దేశ మౌలిక సదుపాయాలకు ఇతోధికంగా వనరులు సమకూర్చుతోందన్నారు. 2008 ప్రపంచ ఆర్ధిక సంక్షోభంలో అమెరికా, జర్మనీ,బ్రిటన్‌ వంటి అగ్రదేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిన పరిస్థితుల్లో మన ఆర్థిక వ్యవస్థను ఆనాడు రక్షించింది ప్రభుత్వ రంగంలోని బ్యాంకింగ్‌, బీమా సంస్థలేనన్నారు.