Jul 21,2021 20:21

ముంబయి : ప్రభుత్వ రంగంలోని ఎల్‌ఐసి కొత్తగా 'ఆరోగ్య రక్షక్‌' పేరుతో ఆరోగ్య బీమా పథకాన్ని ఆవిష్కరించింది. ఇది కుటుంబ సభ్యులందరికీ రక్షణ కల్పిస్తుందని ఎల్‌ఐసి తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో, కష్టకాలంలో పాలసీదారుల కుటుంబ సభ్యులకు 'ఆర్థిక' రక్షణ కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొంది. వాస్తవ వైద్య ఖర్చులతో నిమిత్తం లేకుండా నిర్ణీత మొత్తాన్ని వైద్య ఖర్చుల కోసం చెల్లించడం ఆరోగ్య రక్షక్‌ పథకం ప్రత్యేకతని తెలిపింది. ఈ పాలసీని వ్యక్తిగతంగా లేదా కుటుంబ సభ్యులతో కలిసి తీసుకోవచ్చు. జీవిత భాగస్వామి, తల్లిదండ్రులతోనూ.. 18-65 ఏళ్ల మధ్య వయస్సు వారు పొందవచ్చు. 91 రోజుల నుంచి 20 ఏళ్ల మధ్య వయసులైన పిల్లలకూ ఆరోగ్య బీమా కల్పిస్తుంది. పిల్లలకు 25 ఏళ్ల వరకు, పెద్దలకు 80 ఏళ్ల వరకు బీమా కవరేజీ అందిస్తుంది.