May 03,2021 08:57

తిరువనంతపురం : వరుసగా రెండవ సారి గెలవడం ద్వారా రికార్డు సృష్టించిన ఎల్‌డిఎఫ్‌ ప్రభంజనం కేరళలోని అన్ని జిల్లాల్లోనూ కనిపించింది. ఒకటి, రెండు చోట్ల తప్ప మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ ఎల్‌డిఎఫ్‌ మెజార్టీ సీట్లను గెలుచుకుంది. ఆదివారం ఉదయం కౌంటింగ్‌ ప్రారంభమైనప్పటి నుండి అధికారికంగా గెలుపును ప్రకటించేంతవరకు రాష్ట్రమంతా ఎల్‌డిఎఫ్‌ హవా కొనసాగింది.
త్రివేండ్రంలోని మొత్తం 14 స్థానాల్లో పదమూడింటిలో ఎల్‌డిఎఫ్‌ అభ్యర్థులు గెలుపొందారు. యుడిఎఫ్‌కు ఒక్క స్థానం దక్కింది. ఈ జిల్లాలో బిజపికి గతంలో ఒక స్థానం ఉండగా ఈ సారి అదికూడా దక్కలేదు. పతనంతిట్ట జిల్లాలోని మొత్తం 5 అసెంబ్లీ స్థానాలనూ ఎల్‌డిఎఫ్‌ క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఇక్కడ గత ఎన్నికల్లో గెలుపొందిన ఒక్క స్థానాన్ని యుడిఎఫ్‌ కోల్పోయింది. అలప్పుజా జిలాలలో ఎనిమిది స్థానాలను ఎల్‌డిఎఫ్‌, ఒక్క స్థానాన్ని యుడిఎఫ్‌ గెలుచుకున్నాయి. కొట్టయాం జిల్లాలో ఐదుచోట్ల ఎల్‌డిఎఫ్‌, నాలుగు చోట్ల యుడిఎఫ్‌ గెలుపొందాయి. ఇడుక్కి లోని మొత్తం ఐదు స్థానాలకు గానూ నాలుగు చోట్ల ఎల్‌డిఎఫ్‌, ఒక స్థానంలో యుడిఎఫ్‌ గెలుపొందాయి. ఎర్నాకుళంలోని మొత్తం 14 స్థానాలకుగానూ 9 చోట్ల యుడిఎఫ్‌, ఐదు చోట్ల ఎల్‌డిఎఫ్‌ అభ్యర్థులు గెలుపొందారు. పాలక్కాడ్‌లోని 12 స్థానాల్లో 10 చోట్ల ఎల్‌డిఎఫ్‌, రెండు చోట్ల యుడిఎఫ్‌ అభ్యర్థులు గెలుపొందారు. కోజిక్కోడ్‌లో ఎల్‌డిఎఫ్‌ 11చోట్ల, యుడిఎఫ్‌ 2స్థానాల్లోనూ గెలుపొందారు.
కొల్లాంలోలోని 11 స్థానాలకు గానూ ఎల్‌డిఎఫ్‌ 9 చోట్ల, యుడిఎఫ్‌ 2 చోట్ల గెలుపొందింది. త్రిసూర్‌లోని 13 శాసనసభ స్థానాలో 12 చోట్ల ఎల్‌డిఎఫ్‌, ఒక్క చోట యుడిఎఫ్‌ అభ్యర్థి గెలుపొందారు. మల్లపురం జిల్లాలో 16 స్థానాల్లో యుడిఎఫ్‌ 12 చోట్ల, ఎల్‌డిఎఫ్‌ 4 స్థానాల్లోనూ గెలుపొందాయి.
వేనాడ్‌ జిల్లాలోని మూడు స్థానాలకుగానూ యుడిఎఫ్‌ రెండు చోట్ల, ఎల్‌డిఎఫ్‌ ఒక్క చోట విజయం సాధించింది.
కాసరగూడ్‌ జిల్లాలోని ఐదు స్థానాలకుగానూ ఎల్‌డిఎఫ్‌ 3 చోట్ల, యుడిఎఫ్‌ అభ్యర్థులు రెండు స్థానాల్లోనూ గెలిచారు.
 

                                                  డివైఎఫ్‌ఐ అధ్యక్షుని గెలుపు

   కేరళలో ఎన్నికల బరిలోకి దిగిన డివైఎఫ్‌ఐ అఖిలభారత అధ్యక్షుడు పిఎ మహమ్మద్‌ రియాస్‌ గెలుపొందారు. బేపూర్‌ నియోజకవర్గం నుండి ఎల్‌డిఎఫ్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన 28,747 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. రెండవ స్థానంలో నిలిచిన యుడిఎఫ్‌ అభ్యర్థికి ఇక్కడ 53,418 ఓట్లు వచ్చాయి. బలుసూరి నియోజకవర్గం నుండి పోటీ చేసిన ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి కెఎం సచిన్‌దేవ్‌20,372 ఓట్ల ఆధిక్యతతో యుడిఎఫ్‌ అభ్యర్థిపై గెలుపొందారు.