Jun 10,2021 21:58

* విద్యాశాఖ మంత్రికి వినతిపత్రం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :
ఎలిమెంటరీ స్కూల్‌ వ్యవస్థను కొనసాగించాలని పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్‌ను కోరారు. ఎమ్మెల్సీలు కెఎస్‌ లక్ష్మణరావు, షేక్‌ సాబ్జీ ఈ మేరకు గురువారం నాడు మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఎలిమెంటరీ స్కూల్‌ వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా అధికారులు ముసాయిదా రూపొందించారని మంత్రికి తెలిపారు. ఎలిమెంటరీ స్కూళ్లను ఫౌండేషన్‌ స్కూల్స్‌గా మార్పు చేయాలనే ఆలోచన విరమించుకోవాలని కోరారు. పాఠశాల విద్యా వ్యవస్థలోకి ప్రీప్రైమరీ వ్యవస్థను తీసుకురావడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. కానీ 34 వేల ఎలిమెంటరీ స్కూళ్లను ఫౌండేషన్‌ స్కూల్స్‌గా మార్పుచేసి 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడం వల్ల ప్రైమరీ తరగతుల విద్యార్థులు 3 నుంచి 5 కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. డ్రాపౌట్స్‌ శాతం పెరిగే అవకాశం ఉందని, ఈ చర్య విద్యాహక్కు చట్టానికి భిన్నమైందని తెలిపారు. ప్రాథమిక విద్యా వ్యవస్థలో లోపాలను సరిదిద్ది పంచాయితీకి 5 గురు ఉపాధ్యాయులు, ఒక ప్రధానోపాధ్యాయునితో వ్యవస్థను బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్‌ తరగతులు ప్రారంభించే చర్యలను స్వాగతిస్తున్నామని తెలిపారు.