Aug 08,2022 22:20
  • స్టాండింగ్‌ కమిటీకి పంపిన కేంద్రం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద విద్యుత్‌ చట్ట సవరణ బిల్లును సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ప్రభుత్వ విద్యుత్‌ పంపిణీ సంస్థలను దివాళాతీయించి, కార్పొరేట్‌, బహుళజాతి కంపెనీలకు లాభం చేకూర్చే ఈ బిల్లును కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్‌కె సింగ్‌ సభలో ప్రవేశపెట్టిన సమయంలోనే విద్యుత్‌ రంగ ఉద్యోగులు, ఇంజినీర్లు దీనికి వ్యతిరేకంగా దేశ వ్యాపితంగా నిరసనలు తెలిపారు. ఈ బిల్లుపై లోక్‌సభలో ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. దీంతో ఈ బిల్లును బిల్లును పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీకి నివేదించారు. బిల్లును ప్రవేశ పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఆర్‌ఎస్‌పి సభ్యుడు ఎన్‌కె ప్రేమ్‌ చంద్రన్‌, కాంగ్రెస్‌ సభ్యులు మనీష్‌ తివారి, అధీర్‌ రంజన్‌ చౌదరి, సిపిఎం సభ్యులు ఎం ఎం అరిఫ్‌, తృణమూల్‌ సభ్యుడు సౌగతా రారు, డిఎంకె నాయకుడు టిఆర్‌ బాలు మాట్లాడారు. ఈ బిల్లును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇది విద్యుత్‌ ఉమ్మడి జాబితాలోని అంశమని, షెడ్యూల్‌ 7లో ఉందని తెలిపారు. ఉమ్మడి జాబితాలోని అంశమైనప్పుడు రాష్ట్రాలతో, భాగస్వాములతో సంప్రదింపులు జరపాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ప్రేమచంద్రన్‌ అన్నారు. లాభాలను ప్రైవేటీకరించడం, నష్టాలను జాతీయీకరించడం ఇదే బిల్లు ఉద్దేశంలా ఉందన్నారు. వినియోగదారులు, రైతులు సబ్సిడీ పొందుతున్న వారిపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. విద్యుత్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసేందుకు వేల కోట్లు ప్రజాధనం ఖర్చు చేశామని, అది ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం దారుణమని అన్నారు. కాంగ్రెస్‌ నేత మనీష్‌ తివారీ మాట్లాడుతూ 2003 చట్ట సవరణ వినియోగదారులను పరిరక్షిస్తుందని, అన్ని ప్రాంతాలకూ విద్యుత్‌ సరఫరా చేసేందుకు అనుకూలంగా ఉందని, కేంద్రం ప్రభుత్వం ఇప్పుడు తెచ్చిన ఈ చట్ట సవరణ పేదలకు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు విద్యుత్‌ అందుబాటులో లేకుండా చేస్తుందని అన్నారు. టారిఫ్‌ నిర్ణయించే హక్కును కేంద్రానికి ఇస్తుందని పేర్కొన్నారు. ఈ బిల్లును ఉపసంహరించుకుని, సమగ్ర సంప్రదింపుల తరువాత తీసుకురావాలని కోరారు.
సిపిఎం ఎంపి ఎఎం ఆరిఫ్‌ మాట్లాడుతూ.. విద్యుత్‌ సవరణ బిల్లును తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. ఈ బిల్లు పూర్తిగా కేంద్రానికి అధికారాలిస్తుందని ఇది ఫెడరల్‌ వ్యవస్థపైనే దాడి అని ధ్వజమెత్తారు. చాలా రాష్ట్రాలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయన్నారు. విద్యుత్‌ ఉమ్మడి జాబితాలోని అంశం కనుక, రాష్ట్రాలతోనూ, వాటాదారులతోనూ సమగ్ర చర్చ జరపడం అవసరమని పేర్కొన్నారు. 2017 ఏప్రిల్‌ 11న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు ఈ బిల్లు వ్యతిరేకంగా ఉందని, రాష్ట్రాల విద్యుత్‌ బోర్డుల పాత్రను సుప్రీం కోర్టు స్పష్టం చేసిందని గుర్తు చేశారు. మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏడాది పాటు సుదీర్ఘంగా సాగించిన ఉద్యమాన్ని విరమింపజేసినప్పుడు ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఈ ప్రతిపాదిత బిల్లు ఉపసంహరణ కూడా ఒకటి అని చెప్పారు. ఇప్పుడీ బిల్లును తీసుకురావడం ద్వారా కేంద్రం రైతులకు ద్రోహం చేసిందని అన్నారు. ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పక్షనేత అధిర్‌ రంజన్‌ చౌదరి మాట్లాడుతూ.. ఈ బిల్లు సమాఖ్య వ్యవస్థ సూత్రానికే విరుద్ధమన్నారు. రాష్ట్రాల అధికారాలను ఇది హరిస్తుందని అన్నారు. తెలంగాణ, పుదుచ్ఛేరి, చత్తీస్‌గఢ్‌, పంజాబ్‌తోపాటు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయని ఆయన చెప్పారు. డిఎంకె నేత టిఆర్‌ బాలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 22 లక్షల పంపు సెట్లు ఉన్నాయని, వాటికి ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ బిల్లుతో పేద రైతులకు ఉచిత విద్యుత్‌ను తోసిపుచ్చుతుందని అన్నారు. టిఎంసి ఎంపి సౌగత్‌ రారు మాట్లాడుతూ.. ఇది ప్రజా వ్యతిరేక బిల్లు అని విమర్శించారు. బిజెడి పక్షనేత పినాకి మిశ్రా మాట్లాడుతూ.. బిల్లును స్టాండింగ్‌ కమిటీకి పంపాలని సూచించారు. కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్‌కె సింగ్‌ కలుగజేసుకుని ప్రతిపక్షాల అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకుని బిల్లును స్టాండింగ్‌ కమిటీకి పంపాలని స్పీకర్‌ ఓం బిర్లాను కోరారు.
అంతకుముందు సభలో బిల్లు ప్రవేశంపై ఓటింగ్‌కు పెట్టాలని ప్రతిపక్షాలు కోరాయి. చివరికి ముజువాణి ఓటుతో బిల్లు ప్రవేశానికి అనుమతి ఇచ్చారు.

  • బిల్లుకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల ఆందోళన

విద్యుత్‌ (సవరణ) బిల్లును కేంద్ర కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సోమవారం ఈ మేరకు సిఐటియు, ఎఐటియుసి, హెచ్‌ఎంఎస్‌, ఐఎన్‌టియుసి, ఎఐయుటియుసి, టియుసిసి, సేవా, ఎఐసిసిటియు, ఎల్‌పిఎఫ్‌, యుటియుసి, స్వతంత్ర ఫెడరేషన్లు, సంఘాలు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. ఎలక్ట్రిసిటీ (సవరణ) బిల్లు విద్యుత్‌ పంపిణీని ప్రైవేటీకరించడానికి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశాయి. అందుకే ఈ బిల్లును రద్దు చేయాలని సంయుక్త కిసాన్‌ మోర్చా డిమాండ్‌ చేసిందని తెలిపాయి. బిల్లు ఆమోదం పొందితే విద్యుత్‌ విలాస వస్తువుగా ఎలా మారుతుందో సామాన్య ప్రజలకు వివరించేందుకు నేషనల్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ ఆఫ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ అండ్‌ ఇంజినీర్స్‌ (ఎన్‌సిసిఒఇఇఇ) గతేడాదిగా శ్రమించిందని తెలిపాయి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ, వివిధ రాజకీయ పార్టీల ఎంపిలను సంప్రదించి వారి అభిప్రాయాలను సేకరించిందని పేర్కొన్నాయి. వారిలో చాలా మంది ఆగస్టు 2న ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో ఆ సంస్థ నిర్వహించిన రోజంతా కార్యక్రమాన్ని సందర్శించి, బిల్లుపై తమ వ్యతిరేకతను వినిపించారని తెలిపాయి. 13 బిజెపియేతర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయని తెలిపాయి. విద్యుత్‌ చట్ట (సవరణ) బిల్లు ప్రజ్యాతిరేకమైనదని పేర్కొన్నాయి. సామాన్య ప్రజలకు, రైతులపై విపరీతమైన భారాలను మోపే ఈ ప్రమాదకర బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగిస్తామని తెలిపాయి.