Oct 17,2020 21:26

బ్యాంకాక్‌ : ఈ వారం ప్రారంభంలో 21 మంది కార్యకర్తలను, ప్రదర్శన కారులను అరెస్ట్‌ చేయడంతో థాయ్లాండ్‌లో నిరసనలు తీవ్రతరమయ్యాయి. దీంతో ప్రభుత్వం శుక్రవారం దేశంలో అత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ)ని ప్రకటించింది. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమిగూడటంపై కూడా నిషేధం విధించింది. ఆందోళనలను అంతం చేసేందుకే అత్యయిక పరిస్థితిని ప్రకటించామని ప్రభుత్వం సమర్థించుకునేందుకు యత్నించింది. నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్న ప్రధాని ప్రయూత్‌ చాన్‌-ఓచా రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే తనకు రాజీనామా చేసే ఉద్దేశం లేదని శుక్రవారం ప్రధాని స్వయంగా ప్రకటించారు. ప్రదర్శనలపై నిషేధం విధించడంతో.. రాజధాని బ్యాంకాక్‌లో వేలాది మంది నిరసనకారులు ప్రజాస్వామ్య స్మారక చిహ్నాన్ని దిగ్బంధించారు. నగరమంతటా నిరసనలు, ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు.
కాగా, బుధవారం స్మారక చిహ్నం వద్ద ఆందోళన చేపడుతున్నారన్న సమాచారంతో.. ప్రభుత్వం ముందస్తుగా మంగళవారమే 21 మంది కార్యకర్తలను అరెస్ట్‌ చేసింది. అరెస్ట్‌ అయిన వారిలో ఒకరు మైనర్‌ కావడంతో బెయిల్‌ పొందారు. మిగిలిన 19 మందికి బెయిల్‌ను నిరాకరిస్తూ.. ఆరురోజుల పాటు మునిసిపల్‌ కోర్టు అదుపులోకి తీసుకుంది. మాజీ విద్యార్థి కార్యకర్త, రాచరిక వ్యవస్థపై దీర్ఘకాలంగా పోరాటం చేస్తున్న జతుపత్‌ పైదావోదిన్‌ బూన్‌పట్టారక్సాను బ్యాంకాక్‌ క్రిమినల్‌ కోర్టుకు తరలించారు. ఆందోళనను రెచ్చగొట్టిన ఆయన చర్యలు దేశద్రోహమని కోర్టు తీర్పునిస్తూ.. ఆయనకు బెయిల్‌ నిరాకరించింది. మిగిలిన వారిని తిరుగుబాటు దారులపై ప్రయోగించే బోర్డర్‌ పెట్రోల్‌ పోలీస్‌ (బిపిపి) చేతిలో ఉంచింది. అరెస్ట్‌ వార్త ఆందోళనకారుల్లో ఆగ్రహాన్ని కలిగించింది. వందలాది మంది పోలీసుల ప్రధాన కార్యాలయం ఎదుట రాత్రిపూట ప్రదర్శనలు నిర్వహించారు. బుధవారం ఉదయం నాటికి స్మారక చిహ్నాన్ని దిగ్బంధించారు. కాగా, అరెస్ట్‌ల అనంతరం నిరసనకారుల సంఖ్య పదివేలకు పైగా పెరిగిందని నివేదికలు పేర్కొన్నాయి.
నిరసనకారులు బ్యాంకాక్‌ మీదుగా ర్యాలీ చేపట్టారు. వారిలో వేలాది మంది ప్రధాని కార్యాలయం ఎదుట శిబిరాలను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ప్రభుత్వం నిరసనలను అణచివేసేందుకు పారామిలటరీ దళాలతో పాటు జాతీయ పోలీసులను ప్రయోగించింది. దేశంలోని నిరంకుశ చట్టాలకు వ్యతిరేకంగా విద్యార్థుల నిరసనలతో పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ప్రారంభమయ్యాయి. బ్యాంకాక్‌ అంతటా వేలాది మంది ప్రజలు ఆందోళనలో పాల్గన్నారు. రాజధాని సమీపంలోని తమ్మసాట్‌ యూనివర్శిటీ నుండి నిరసనలు.. ప్రయూత్‌ చాన్‌ ఓచా ప్రభుత్వానికి వ్యతిరేక ఉద్యమంగా మారాయి.