
ప్రజాశక్తి- పాలకొండ రూరల్ : మధ్యాహ్న భోజన కార్మిక సమస్యలు పరిష్కారం కోసం ఈనెల 8న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం జయప్రదం చేయాలని మధ్యాహ్నం భోజనం కార్మిక సంఘం జిల్లా నాయకులు ఎ.పద్మ పిలుపునిచ్చారు. సోమవారం మధ్యాహ్న భోజన కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పథకంలో పనిచేస్తున్న కార్మికులను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం ఇవ్వాలని, ప్రతి నెల 5వ తేదీ లోపు వేతనాలు, బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. మెనూ చార్జీలకు రూ.20 ఇవ్వాలని, ధరలకు అనుగుణంగా బడ్జెట్ పెంచాలని, మార్చి నెలలో హాట్ పొంగలి, సాంబార్ బాత్, ఆకుకూర అన్నం తొలగించాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించరాదని అన్నారు. గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలని, పథకం అమలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని, హైస్కూల్లో పనిచేస్తున్న వారికి వేతనాలు ఇవ్వాలని, రాజకీయ వేధింపులు ఆపాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. యూనిఫామ్ ఇవ్వాలని, గ్లౌజులు, మాస్క్‌లు, యాప్రాన్ ప్రభుత్వమే సరఫరా చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎం.సావిత్రమ్మ, వి.నారాయణమ్మ, కె. కుమారి, బి. జ్యోతమ్మ, వి. పార్వతి తదితరులు పాల్గొన్నారు.