Jan 31,2021 12:14

బాగా అలసిన శరీరం సేదతీరడానికి అనువైన స్థలం ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా బీచ్‌నే. పైన సూర్యుని ఎండ, కింద చల్లని నీరు ఎంతటి అలసటనైనా ఇట్టే పోగొడతాయి. కానీ సూర్యుడి ఎండ పడని బీచ్‌ ఒకటి ఉందని మనలో ఎంతమందికి తెలుసు? బ్రెజిల్‌ దక్షిణభాగంలోని బాలెనారియో కాంబోరియు అనే నగరం ప్రాయియా సెంట్రల్‌ బీచ్‌ ఒడ్డునే ఉంది. సూర్యాస్తమయానికి ఆరుగంటల ముందు నుంచే సూర్యుడి ఎండ ఆ బీచ్‌లో మాయమైపోతుంది. ఎందుకో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే...

beach


   బాలెనారియో కాంబోరియు నగరాన్ని 'బ్రెజిలియన్‌ దుబారు' అనీ పిలుస్తారు. ఈ నగరంలో సుమారు లక్షన్నర మంది నివసిస్తున్నారు. వాస్తవానికి సావో పాలో, రియో డి జెనీరో వంటి మెగా నగరాల పరిమాణంతో పోలిస్తే అతి చిన్న నగరం ఇది. అయినాకానీ.. దక్షిణ అమెరికా ఖండంలోని టాప్‌ టెన్‌ అతి ఎత్తయిన నివాస భవనాల్లో ఆరు భవనాలు ఈ నగరంలోనే ఉన్నాయని కౌన్సిల్‌ ఆఫ్‌ టాల్‌ బిల్డింగ్స్‌ అండ్‌ అర్బన్‌ హాబిటేట్‌ చెప్తోంది. కానీ ఈ ఖ్యాతితో పాటు ఒక చీకటి కోణమూ ఉంది. ఈ అత్యంత పొడవైన భవనాలు ఎక్కువభాగం ప్రఖ్యాత బీచ్‌ ప్రాయియా సెంట్రల్‌ వెంటే ఉన్నాయి. ఈ భవనాలు ఎత్తుగా ఉండటం వలన మధ్యాహ్నం రెండు గంటల తర్వాత వీటి నీడ బీచ్‌ మీద పడుతుంది. దానివల్ల అక్కడ చలి, చీకటి ఎక్కువగా ఉంటుంది. భవనాల సందుల నుంచి వచ్చే వెలుతురే ఆధారం. కోవిడ్‌-19 కాలంలోనూ ఎండ ఉన్న రోజుల్లో బీచ్‌ అభిమానులు ఆంక్షలను ధిక్కరించి మరీ రావడంతో ఈ బీచ్‌ రద్దీగానే ఉండేది.
    'కాలం మారింది. చాలామంది ఎండలో మాడటానికి ఇష్టపడరు. ఎందుకంటే అది ఆరోగ్యానికి హానికరం కావచ్చు. బీచ్‌లో నీడ వల్ల జనం బకెట్ల కొద్దీ చెమటలు కక్కకుండా తేలికగా వ్యాయామం చేయొచ్చు. ఈ ఆకాశహర్మ్యాలు నిజంగా సమస్య అయినట్లయితే.. జనం ఎందుకు వస్తారు? ప్రాయియా సెంట్రల్‌ బీచ్‌ ఇప్పుడు ఉన్న విధంగానే వారికి హాయిగా ఉందేమో' అని చరిత్రకారుడు ఇసాకాబార్బా అంటున్నారు.


                                                               అతి ఎత్తయిన జెయింట్‌ వీల్‌

 అతి ఎత్తయిన జెయింట్‌ వీల్‌

  దాదాపు పది లక్షల మంది ఈ నగరాన్ని 2019 లో సందర్శించారని పర్యాటక అధికారులు చెప్తున్నారు. మొత్తం బ్రెజిల్‌లో అత్యధికంగా పర్యాటకులు వచ్చిన ప్రాంతాల్లో ఇదొకటిగా నిలిచింది. ఈ నగరం సంపన్నులకు, ప్రముఖులకు ప్రీతిపాత్రమైనది క్రీడా మైదానం. ప్రాయియా సెంట్రల్‌లో లండన్‌ ఐ తరహా జెయింట్‌వీల్‌ ఉంది. ఈ ఖండం మీద అతి ఎత్తయిన జెయింట్‌ వీల్స్‌లో ఇదొకటి. అంతేకాదు రియో డి జెనీరో వంటి ప్రముఖ సముద్ర తీర నగరాలతో పోలిస్తే బాలెనారియో కాంబోరియు చాలా సురక్షితమైనది. బ్రెజిల్‌లో నివసించటానికి ఉత్తమ ప్రాంతాల జాబితాలో ఈ నగరం నాలుగో స్థానంలో ఉంది. ఈ నగరం గత నాలుగు దశాబ్దాలుగా సెలవుల విడిదిగా ప్రజాదరణ పొందటం వల్ల రియల్‌ ఎస్టేట్‌ డిమాండ్‌ విపరీతంగా పెరిగింది.
    ఈ నగరంలో నిర్మాణాలు చేపట్టడానికి అందుబాటులో ఉన్న నేల తక్కువగా ఉంటుంది. భవనాల ఎత్తు మీద ఆంక్షలు విధించని స్థానిక చట్టం వల్ల.. నిర్మాణ సంస్థలు అంతకంతకూ ఎత్తయిన భవనాలు నిర్మించటం మొదలుపెట్టాయి. కానీ 2020 చివరి నాటికి దేశంలోని టాప్‌ టెన్‌ ఆకాశహర్మ్యాల్లో ఆరు భవనాలు ఈ నగరం నుంచే ఉన్నా.. అందులో ఈ ట్విన్‌ టవర్స్‌కి చోటులేకుండా పోయింది. వీటి ఎత్తు 280 మీటర్లు.

comboriu city

                                                                     

                                                              నీటి ఎద్దడి

     ఈ నిట్టనిలువు అభివృద్ధి విషయంలో ఇతర ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి. బాలెనారియో కాంబోరియులో పెరుగుతున్న జనాభా సాంద్రత రీత్యా 2028 నాటికి తీవ్ర నీటి కొరత తలెత్తుతుందని పర్యావరణ శాస్త్రవేత్త, యూనివర్సిటీ ప్రొఫెసర్‌ మార్కస్‌ పొలెట్‌ ఒక అధ్యయనంలో హెచ్చరించారు. రాబోయే ఈ సమస్యను పరిష్కరించటం కోసం ఒక రిజర్వాయరు నిర్మాణానికి తాము ప్రణాళికలను సమర్పించామని మేయర్‌ ఒలివీరా చెప్తున్నారు. అయితే దీనికి పర్యావరణ మంత్రిత్వశాఖ అనుమతివ్వాల్సి ఉంటుంది. ఈలోగా సమస్యలు పెరిగిపోతున్నాయి. 'నగర జనాభా ఏటా దాదాపు మూడు శాతం చొప్పున పెరుగుతోంది. ప్రాయియా సెంట్రల్‌ పునరాభివృద్ధితో అది మరింత ఆకర్షణీయంగా మారితే పరిస్థితి ఇంకా విషమిస్తుంది' అంటారు ప్రొఫెసర్‌ పొలెట్‌.