Jun 02,2023 00:24
బాపట్లలో మాట్లాడుతున్న మజుందార్‌

ప్రజాశక్తి-బాపట్ల: తమను లైంగికంగా వేధించిన బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీలో గత 30 రోజులుగా ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు మద్దతుగా, సమస్య ను పరిష్కరించని కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా గురు వారం బాపట్లలో సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిం చారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ మజుందార్‌ మాట్లాడుతూ దేశానికి ఎన్నో పతకాలు సాధించిన మల్లయోధుల పట్ల కేంద్ర ప్రభుత్వం మరింత మోసపూరితంగా వ్యవహరి స్తోందని అన్నారు. తమను లైంగిక వేధింపులకు గురిచేసిన బిజెపి ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ చరణ్‌సింగ్‌పై చర్యలు తీసుకోవాలని 30 రోజులకు పైగా ఆందోళన చేస్తున్నా నేటికీ వారిపై చర్యలు చేపట్టలేదని అన్నారు. ఆందోళన చేస్తున్న క్రీడాకారులపై పోలీసులు దాడి చేసి శిబిరాన్ని తొలగించడాన్ని, సిఐటియు తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. విజ్ఞులైన మేధావులు ప్రజలు కేంద్ర ప్రభుత్వ చర్యను ఖండించాలన్నారు. మల్లయోధులకు మద్దతు తెలపాలని కోరారు. లైంగిక వేధింపులకు బాధ్యుడైన బిజెపి ఎంపీని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి జె శామ్యూల్‌ పాల్గొన్నారు.
రేపల్లె: మహిళ రెజ్లర్లపై లైంగిక వేధింపులకి పాల్పడిన ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్టు చేయాలని గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో రేపల్లె జూనియర్‌ కాలేజీ అంబేద్కర్‌ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌ మణిలాల్‌ మాట్లాడుతూ 50 రోజులుగా ఢిల్లీ నడిబొడ్డున తమపై లైంగిక వేధింపులకు పాల్పడిన బిజెపి ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ మహిళ మల్లయోధులు పోరాడుతున్నారని, 38 కేసుల్లో హత్య, కిడ్నాప్‌, అత్యాచారం వంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న బిజెపి ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ను ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి, మోడీ ప్రభుత్వం కాపాడుతూ దేశానికి ప్రతిష్ట తెచ్చిన మహిళా రెజ్లర్లకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాకి అధ్యక్షుడిగా ఉన్న బిజెపి ఎంపీ తన కుటుంబ పరివారాన్ని మొత్తం రెజ్లింగ్‌ ఫెడరేషన్‌లో ఉన్నత స్థానాల్లో నియమించి తన కనుసన్నల్లో రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ నడిచేలా ఏర్పాటులు చేసుకున్నాడని విమర్శించారు. ప్రపంచ రెజ్లింగ్‌ సమాఖ్య పోరాడుతున్న మల్లయోధులకు మద్దతు తెలియజేస్తూ తక్షణం రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాకి ఎన్నికలు తక్షణం నిర్వహించని పక్షంలో ప్రపంచ పోటీల నుంచి బహిష్కరిస్తామని హెచ్చరిక చేయడాన్ని గుర్తుచేశారు. మహిళా రెజ్లర్లు సాధించిన పథకాలను చూసి మురిసిపోయిన భారతీయులందరూ కూడా ఆ మహిళా రెజ్లర్లు ఎదుర్కొన్న లైంగిక వేధింపుల బాధను కూడా అర్థం చేసుకోని వారికి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. తమ జీవితాంతం కష్టపడి సాధించిన మెడల్స్‌ను సైతం గంగా నదిలో కలపాలని రెజ్లర్లు తీసుకుని నిర్ణయం పట్ల కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం మహిళల పట్ల, లైంగిక వేధింపులు పట్ల ప్రభుత్వ వైఖరిని తెలియజేస్తుందన్నారు. రాజ్యాంగాన్ని పక్కనపెట్టి మనుధర్మ శాస్త్రం ప్రకారం బిజెపి ప్రభుత్వం పరిపాలిస్తుందనడానికి ఇదొక ఉదాహరణ అని తెలిపారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌, మోడీ అవలంబిస్తున్న మహిళా వ్యతిరేక వైఖరితో దేశ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా మంట కలుపుతున్నారని, తక్షణం లైంగిక వేధింపులకు పాల్పడిన బిజెపి ఎంపీపై చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో రైతులు కార్మికులు, విద్యార్థులు, రైతు సంఘాలతో కలిసి ఉధృత పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు కె ఆశీర్వాదం, డి శ్రీనివాస్‌, ఎం వెంకటేశ్వరరావు యు రామకృష్ణ ప్రసాద్‌, వై నవీన్‌, కె వెంకటేశ్వరరావు, బాబి, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.