Apr 20,2021 22:16

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎంసిపిఐ(యు) జాతీయ కార్యదర్శిగా మద్దికాయల అశోక్‌ను ఆ పార్టీ పొలిట్‌ బ్యూరో నిర్ణయించింది. అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మరణించిన ఎంసిపిఐ(యు) అఖిలభారత ప్రధాన కార్యదర్శి మహమ్మద్‌ గౌస్‌ అంతిమ వీడ్కోలు ఆయన సొంత గ్రామమైన వరంగల్‌ జిల్లా, రాయపర్తి మండలం, కొత్తూరులో మంగళవారం జరిగింది. అనంతరం వివిధ రాష్ట్రాలకు చెందిన పొలిట్‌బ్యూరో సభ్యులతో తక్షణ సమావేశం నిర్వహించారు. గౌస్‌ మరణవార్తకు నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. గౌస్‌ కొంతకాలంగా న్యూమోనియాతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నా... దేశంలోని పార్టీని నిర్మాణయుతంగా, రాజకీయపరంగా అభివృద్ధి చేయడానికి చేసిన కృషి మరువలేనిదని పొలిట్‌బ్యూరో అభిప్రాయపడింది. ఆయన మరణానంతరం పార్టీని రాజకీయ నిర్మాణంగా మరింత ముందుకు తీసుకెళ్లడానికి తక్షణమే జాతీయ ప్రధాన కార్యదర్శిగా అశోక్‌ను సమావేశం ఎంపిక చేసిందన్నారు. పొలిట్‌బ్యూరో నిర్ణయాన్ని కేంద్ర కమిటీ ఆమోదించిందని తెలిపారు.
గౌస్‌ మృతిపట్ల సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. గౌస్‌ మృతి వామపక్ష ఉద్యమాలకు తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు పార్టీ రాష్ట్ర కమిటీ తరపున సానుభూతిని తెలిపారు. గౌస్‌ మృతిపట్ల ఎంసిపిఐ(యు) ఎపి రాష్ట్ర కమిటీ మరో ప్రకటనలో సంతాపం తెలిపింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాటం నాగభూషణం మంగళవారం ప్రకటన విడుదల చేశారు. గౌస్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.