Jul 21,2021 21:46

ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు జిల్లా) : మంగళగిరి తాడేపల్లిని నగరపాలకసంస్థగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది రాజకీయ దురుద్ధేశానికా, ప్రజలపై భారాలు వేయడానికా అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు ప్రశ్నించారు. ఎంటిఎంసిలో విలీన గ్రామాల్లోని సమస్యలపై ప్రజల్ని చైతన్యపరిచి ఉద్యమం చేపడతామని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో పట్టణ పౌర సంక్షేమ సంఘం, సిఐటియు ఆధ్వర్యాన 'మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్‌లో గ్రామాల విలీనం తరువాత ప్రజాసమస్యలు'పై రౌండ్‌టేబుల్‌ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ ఎంటిఎంసి రాష్ట్రంలోనే అతి పెద్ద కార్పొరేషన్‌గా అవతరించినా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే విధంగా లేదన్నారు. ఈ కార్పొరేషన్‌కు చెక్‌వపర్‌ లేకుండా కమిషనర్‌ను ఏర్పాటు చేశారని, గత నాలుగు నెలలుగా ఉద్యోగులు, కార్మికులు, ఉపాధ్యాయులు జీతాల్లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాజధాని నుండి ఆరు గ్రామాలను విడదీసి కార్పొరేషన్లో విలీనం చేయడం వల్ల రాజధాని పింఛను, ఉపాధి పనులు ప్రశ్నార్థకం కానున్నాయన్నారు. విలీన గ్రామాల్లో ఆస్తి విలువ ఆధారంగా పన్నులు పెంచితే ప్రజలపై మరింత భారం పడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యదర్శి వి.వెంకటేశ్వరరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి జెవి రాఘవులు, నాయకులు బూరుగ శ్రీనివాసరావు, ఎన్‌.భావన్నారాయణ, ఎం.పకీరయ్య, పి.బాలకృష్ణ ఎం.రవి పాల్గన్నారు.