May 13,2022 09:48

న్యూఢిల్లీ : దేశంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఎనిమిదేళ్ల గరిష్ఠానికి చేరుకుంది. ఇంధన ధరలు, ఆహార ధరలు భారీగా పెరుగుతుండటంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో వినియోగదారు ధరల సూచి (సిపిఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం 7.79శాతానికి పెరిగింది. వరసగా నాలుగో నెల కూడా రిజర్వు బ్యాంకు నిర్దేశించిన స్థాయి కన్నా అధికంగా నమోదు కావడం గమనార్హం. రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని 2 శాతం నుంచి 6 శాతం మధ్య ఉంచేలా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి ఇప్పటికే ఆర్‌బిఐ సూచించింది. ఇప్పటి వరకూ 2014 మే నెలలో నమోదైన 8.33శాతం రిటైల్‌ ద్రవ్యోల్బణం ఇప్పటి వరకూ రికార్డు. ఈ ఏడాది మార్చిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.95 శాతంగా ఉండగా, గత ఏడాది ఏప్రిల్‌లో మాత్రం 4.23 శాతం నమోదయింది. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం గత నెలలో 7.68శాతం ఉండగా, ఏప్రిల్‌లో 8.38శాతానికి పెరగడం గమనార్హం. ఇంధన-కాంతి విభాగంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం మార్చిలో 7.52 శాతం ఉండగా, ఏప్రిల్‌లో 10.80 శాతానికి పెరిగింది. ఆయిల్‌ - కొవ్వుల్లో ఏప్రిల్‌లో ఏకంగా 17.28 శాతానికి పెరిగింది. కూరగాయల్లో మార్చిలో 11.64 శాతం ఉన్న రిటైల్‌ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 15.41 శాతానికి పెరిగింది. ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో సామాన్యులపై ధరల భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా పేర్కొంటూ నాలుగేళ్ల తర్వాత తొలిసారి ఆర్‌బిఐ రెపో రేటును పెంచింది. రెపో రేటును 40 బేసిస్‌ పాయింట్లు పెంచడంతో ప్రస్తుతం అది 4.40 శాతానికి చేరింది. ద్రవ్యోల్బణం 7.79శాతానికి చేరడంతో ధరల అదుపుపేరుతో ఆర్‌బిఐ వచ్చే నెలలో జరగబోయే విధాన సమీక్షలో మరోసారి వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.