Jan 13,2021 16:27

అమరావతి : ఓటమి భయంతోనే పంచాయతీ ఎన్నికలకు వైసిపి వెనుకాడుతోందని టిడిపి అధినేత చంద్రబాబు విమర్శించారు. బుధవారం కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో నిర్వహించిన భోగి మంట కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు విచ్చేశారు. ఈ సందర్భంగా సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికలపై ప్రసంగించారు. ఎన్నికలు పెడితే ఇంటికి పోతారనే పిరికితనంతోనే ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించేందుకు వెనకడుగు వేస్తుందని ఆరోపించారు. పోలీసుల వ్యవస్థ, కలెక్టర్ల పై ప్రభుత్వానికి నమ్మకం లేదా ? ఎందుకు ఎన్నికలు పెట్టరో సమాధానం చెప్పాలి అని ప్రశ్నించారు. ఎలక్షన్‌ కమిషన్‌ ఒక్కటే ఎన్నికలు జరపబోదని.. పోలీసు వ్యవస్థ, అధికారులు కలిసే ఎన్నికలను నిర్వహిస్తారని చెప్పారు. ఎక్కడా తప్పు జరగకుండా ఎలక్షన్‌ కమిషన్‌ బాధ్యత తీసుకుంటుందని అన్నారు. ఎన్నికలు జరిగినప్పటికీ వైసిపి నాయకుల అక్రమాలు పాల్పడి ఎన్నికలను సక్రమంగా జరగనీయకుండా చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా వైసిపి ఇంటికి పోవడం ఖాయం అని చంద్రబాబు పేర్కొన్నారు.