‘స్త్రీలు, చిన్నపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడం’టూ తెలుగు టీవీ నటి కీర్తి భట్ వ్యాఖ్యానించారు. తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఓ సెల్ఫీ వీడియో షేర్ చేశారు. ‘మనం ప్రతి రోజూ దేవుడిని వేడుకుంటాం. ఎప్పుడూ దేవుడుకి పూజలు చేస్తుంటాం. ఎందుకు చేస్తాం.. అందరు బాగుండాలనే కదా.. అందరికీ మంచి జరగాలనే కదా. కానీ దేశంలో మహిళలపై అరాచకాలు, అఘాయిత్యాలు జరుగుతుంటే ఆ దేవుడు ఏం చేస్తున్నాడు? ఇటీవల ఒక చిన్నారిపై అఘాయిత్యం జరిగింది. అప్పుడు కూడా దేవుడు చూస్తూ ఊరుకున్నాడు. పెద్దవాళ్లు అయితే ఏదో ఒకలా తప్పించుకుంటారు. అదీ చిన్న పిల్ల.. అంతమంది క్రూరంగా దానిపై దాడి చేశారు. ఆ చిన్నది ఏం చేస్తుంది? ఇలాంటి ఘటనలను దేవుడు ఆపకుండా ఏం చేస్తున్నాడు? చూస్తూ ఊరుకుంటున్నాడు. ఆ సమయంలో ఆ చిన్నారి ఎంత నరకయాతన అనుభవించి ఉంటుంది. అప్పుడు ఆమెను దేవుడు కాపాడాలి, లేదా ఆ చిన్నారికి అలాంటి ఘటనే ఎదురవకుండా చూడాలి. ఆ అఘాయిత్యం నుంచి తప్పించుకునేలా చేయాలి. కానీ ఏం చేయకుండా చూస్తూ కూర్చున్నాడు. కనీసం తప్పించుకోవడానికైనా సాయం చేయవచ్చు కదా. అలాంటి టైంలో కాపాడలేని దేవుడు ఎందుకు? పసిపిల్లలంటే దేవునితో సమానం అంటారు కదా.. మరి ఆ పసిపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? ఇందుకేనా రోజూ దేవుడికి పూజలు చేయాలి.. ఇది చాలా దారుణం కదా.. ఇవన్నీ చూస్తుంటే అసలు దేవుడే లేడనిపించింది” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
