తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ ఏడాది కొన్ని చిన్న సినిమాలు హిట్ టాక్‌ను అందుకోగా, మరికొన్ని బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. ఇంకొన్ని ఊహించని రీతిలో విజయదుందుభిని మోగించాయి. 2023లో కొత్తగా పరిశ్రమలోకి ఎందరో హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు, దర్శకులు వచ్చారు. పెద్ద హీరోలతో పోటీ పడుతూ వచ్చిన సినిమాలు సైతం ప్రేక్షకుల ఆదరణను చూరగొన్నాయి. ఏడాది మొదట్లో పెద్ద సినిమాల హవానే నడిచినా చిన్ని సినిమాలు సైతం కొంతమేరకు పోటీనిచ్చాయి. సంతోష్ శోభన్ ‘కళ్యాణం కమనీయం’, సుధీర్‌బాబు ‘హంట్’ పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేకపోయాయి. ఫిబ్రవరిలో ‘రైటర్ పద్మనాభం’ ప్రేక్షకాదరణ పొందింది. సుహాస్ హీరోగా నటించిన ఈ సినిమా కామెడీతో సాగటంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరించారు. చారు బిస్కెట్, మేమ్ ఫేమస్ యువతను ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత వచ్చిన బుట్టబొమ్మ, వినరో భాగ్యం, మిస్టర్ కింగ్ పెద్దగా ఆదరణకు నోచుకోలేదు.
మార్చిలో జబర్దస్త్ ఫేం కమెడియన్ వేణు దర్శకుడిగా తీసిన సినిమా ‘బలగం’ హిట్‌మూవీగా నిలిచింది. చిన్న సినిమాకు కొత్త అర్థం చెప్పింది. మానవ సంబంధాలను, స్థానికతనూ మేళవించి, ప్రజాదరణ పొందింది. అనేక స్థాయుల్లో అవార్డులనూ సొంతం చేసుకొంది. ఏప్రిల్, మే నెలల్లో వచ్చిన చిన్న సినిమాల్లో ‘అన్నీ మంచి శకునములే..’ కాస్తా పాజిటివ్ టాక్‌ను అందుకుంది. జూన్‌లో శ్రీ విష్ణు రూపొందించిన ‘సామజవరగమన’ కామెడీకి పెద్దపీట వేసి, విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పటికే నష్టాలబాటలో ఉన్న నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమాతో ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడ్డారనేది టాక్. జులైలో వచ్చిన ‘బేబి’ పెద్ద విజయాన్నే నమోదు చేసుకుంది. ఈ ఏడాది చిన్న సినిమాల్లో ఇదే పెద్ద హిట్‌గా నిలిచింది. ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం ఇది. సాయి రాజేష్ దర్శకత్వం వహించారు.
అక్టోబర్‌లో వచ్చిన మ్యాడ్ సరికొత్త రికార్డునే సొంతం చేసుకుంది. జూనియర్ ఎన్‌టిఆర్ బామ్మర్ది నార్ని నితిన్ కీలకపాత్రలో నటించారు. కాలేజ్‌లో విద్యార్థుల వ్యవహార శైలిపై ఇందులో చాలా సరదాగా చూపించారు. ఈ సినిమా కూడా అతి తక్కువ బడ్జెట్‌తో విడుదలైనా మంచి లాభాలను గడించినట్టు నిర్మాతలు ప్రకటించారు. ముగ్గురు స్నేహితుల పేర్లతో చేసిన ప్రయోగం, పాటలు సరికొత్తగా రావటంతో సామాజిక మాధ్యమాల్లోనూ బాగా ప్రచారం పొందింది. సంపూర్ణేష్‌బాబు ‘మార్టిన్ లూథర్‌కింగ్ కూడా ప్రేక్షకాదరణ పొందింది. నవంబర్‌లో తరుణ్ భాస్కర్ రూపొందించిన ‘కీడా కోలా’ కూడా సరికొత్తగా సాగింది. పొలిమేర 2 కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. చాలాకాలం తర్వాత శ్రీకారత్ చేసిన కోటబొమ్మాళి పీఎస్’ కూడా బాగానే ఆడింది. ఇందులోని లింగిడి పాట సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున హల్‌చల్ చేసింది. డిసెంబర్‌లో కొన్ని సినిమాలు వచ్చినా పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. యాంకర్ సుమ తనయుడు రోషన్ ‘బబుల్ గమ్’ సినిమా ఈనెల 29న విడుదల కానుంది. ఓవరాల్‌గా చూస్తే ఈ ఏడాదిలో బలగం, సామజవరగమన, బేబీ, మ్యాడ్ తమ సత్తా చాటాయి. కార్తికేయ 2తో హిట్ కొట్టిన నిఖిల్ స్పై సినిమా ప్లాప్ కావటంతో డీలా పడ్డారు.
మూఢ నమ్మకాలను పెంచేలా…
జులైలో వచ్చిన స్లమ్ డాగ్ హస్బెండ్ సినిమాలో మూఢనమ్మకాలను పెంచేలా దర్శకుడు శ్రీధర్ చూపించారు. బ్రహ్మాజీ తనయుడు సంజరురావు, ప్రణవి మానుకొండ ఇందులో నటించారు. జాతకంలో దోషం పోవాలంటే లచ్చి (హీరో)కు కుక్కతో పెళ్లి జరిపించాలని పూజారి చెప్పటంతో ఆ తరహాలో చేస్తారు. ఆ తర్వాత నిజం పెళ్లి నటీనటులకు చేస్తారు. సాంకేతికంగా ఇంత అభివృద్ధి చెందినా నేటికీ మూఢ నమ్మకాలను చూపించే ప్రయత్నంతో ఆడియన్స్‌కు వినోదం కంటే ఇబ్బందిగా ఫీలయ్యారు. మా ఊరి పొలిమేరకు సీక్వెల్‌గా వచ్చిన పొలిమేర 2లో సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల తదితరులు నటించారు. ఓటీటీలో విడుదలైన మా ఊరి పొలిమేరకు కొనసాగింపుగా వచ్చిందీ సినిమా. మర్డర్ మిస్టరీకి బ్లాక్ మ్యాజిక్ అంశాన్ని జత చేసి అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించారు.