టిల్లు స్వ్కేర్ సినిమా యువతను బాగా ఆకట్టుకుంటుందని హీరో సిద్ధు జొన్నలగడ్డ అన్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు. ‘డీజే టిల్లు’కు సీక్వెల్‌గా శుక్రవారం నాడు ‘టిల్లు స్క్వేర్’ సినిమా విడుదల కానుంది. గురువారం మీడియాతో హీరో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడారు. ”డీజే టిల్లు విడుదల సమయంలో ప్రేక్షకుల్లో అంచనాల్లేవు. హీరో పాత్రను చూసి ప్రేక్షకులు సర్ప్రైజ్ అయ్యారు. ఇప్పుడు అదే పాత్రతో మరోసారి మ్యాజిక్ చేయాల్సిరావటంతో కాస్త ఒత్తిడి ఉండటం సహజం. అయితే ఒత్తిడిని జయించి మెరుగైన అవుట్‌ఫుట్‌ని అందించటానికి కృషిచేశాం. టిల్లు పాత్ర సీక్వెల్లో ఇంకా ఎక్కువ ఎనర్జిటిక్‌గా ఉంటుంది. చాలా సర్ఫ్రైజ్లు, షాక్‌లు ఉంటాయి. ఆద్యంతం నవ్వుకుంటూనే ఉంటారు. పార్ట్-3 కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కథ సిద్ధమైంది.’ అని వివరించారు.
