తెలంగాణ : ఫిల్మిం నగర్ డెక్కన్ కిచెన్ కూల్చివేతపై సోమవారం విచారణ చేపట్టిన తెలంగాణలోని నాంపల్లి కోర్టు హీరోలు వెంకటేష్-రానాలపై కేసు నమోదుకు ఆదేశించింది. నటుడు విక్టరీ వెంకటేష్, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, ఆయన ఇద్దరు కుమారులు రానా, అభిరామ్ లపై కేసులు నమోదు చేయాలని కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. నందకుమార్ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నందకుమార్ నిందితుడిగా ఉన్నారు. పోలీసుల సహకారంతో తన హౌటల్ ను కూల్చివేశారని, కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ధిక్కరిస్తూ జేసీబీతో అక్రమ కూల్చివేతలకు పాల్పడ్డారని, ఉద్దేశపూర్వకంగా కోట్ల రూపాయల నష్టం కలిగించారని తన పిటిషన్‌లో నందకుమార్ పేర్కొన్నారు. కోట్ల విలువైన భవనాన్ని కూల్చివేయడంతో పాటు ఫర్నిచర్ ను ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో తెలిపారు. దీనిపై ఈరోజు విచారణ చేపట్టిన కోర్టు.. నిర్మాత సురేష్ బాబుతో సహా దగ్గుబాటి హీరోలపై కేసులు నమోదు చేయాలంటూ పోలీసులను ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు వెంకటేశ్, రానా, అభిరామ్, సురేష్ ఐపిసి లోని 448, 452,380, 506, 120 బి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. డెక్కన్ కిచెన్ కూల్చివేతపై అందిన ఫిర్యాదు మేరకు నాంపల్లి కోర్టు విచారణ చేపడుతోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న దగ్గుబాటి హీరోలు జూన్‌లో కూడా కోర్టు విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
