సినీనటుడు అల్లు అర్జున్‌పై కేసు నమోదు

నంద్యాల : సినీనటుడు అల్లు అర్జున్‌ పై కేసు నమోదయింది. అల్లు అర్జున్‌ శనివారం నంద్యాలలో పర్యటించారు. ఆయన పర్యటనకు రిటర్నింగ్‌ అధికారి ముందస్తు అనుమతులు ఇవ్వలేదు. నంద్యాల ఎమ్మెల్యే, వైసిపి అసెంబ్లీ అభ్యర్థి శిల్పా రవిచంద్రకిశోర్‌ రెడ్డి ఇంటికి నిన్న ఉదయం అల్పాహారానికి అల్లు అర్జున్‌ వచ్చారు. వైసిపి శ్రేణులు వ్యూహాత్మకంగా పట్టణ శివారు నుంచే భారీ వాహనాలు, మోటారు సైకిళ్లతో ప్రదర్శనగా పట్టణంలోకి ఆయనను తీసుకువచ్చాయి. ఆయన పర్యటనకు అధికారిక అనుమతులు లేకపోయినా పోలీసులు విస్తఅత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ విషయాన్ని కొందరు ఎన్నికల కమిషన్‌ దఅష్టికి తీసుకెళ్లారు. ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉండగా, ఇంచుమించు అదే సమయంలో హీరో అర్జున్‌ పర్యటన ఉండటంతో జిల్లా కేంద్రంలో కొంతసేపు ఉత్కంఠ నెలకొంది. అల్లు అర్జున్‌ పర్యటనలో జనసేన జెండాలు కనిపించడం కొసమెరుపు. ఇదే సమయంలో కొంత మంది పవన్‌కల్యాణ్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. చంద్రబాబు పర్యటనకు ముందస్తు అనుమతి తీసుకున్న సమయంలో అల్లు అర్జున్‌ అనుమతి లేకుండా నంద్యాలలో ఎలా పర్యటిస్తారని నంద్యాల టిడిపి అసెంబ్లీ అభ్యర్థి ఎన్‌ఎండీ.ఫరూక్‌ ప్రశ్నించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని సినీనటుడు అల్లుఅర్జున్‌, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌ రెడ్డిలపై శనివారం రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఎన్నికల అధికారి, జేసీ రాహుల్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. పట్టణంలో 30 పోలీసు యాక్టు, 114 సెక్షన్‌ అమల్లో ఉన్నా.. ఎన్నికల అధికారి అనుమతి లేకుండా శిల్పా చంద్రకిశోర్‌రెడ్డి ఇంటికి అల్లు అర్జున్‌ వచ్చారని.. అక్కడ వేలమంది గుమిగూడారని చెప్పారు.

➡️