ఇంటర్నెట్‌డెస్క్ : టాలీవుడ్ నటుడు పి. సుబ్బరాజు పెళ్లి పీటలెక్కారు. తన భార్యను పరిచయం చేస్తూ.. సుబ్బరాజు సోషల్ మీడియాలో ఫొటోను పోస్ట్ చేశారు. నూతన వధూవరులిద్దరూ బీచ్ ఒడ్డున, పెళ్లి బట్టల్లో, కళ్లజోడు పెట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు సుబ్బరాజు దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే సుబ్బరాజు తన భార్య పేరు కానీ, పెళ్లి ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగిందనే వివరాలను మాత్రం బయటపెట్టలేదు.
కాగా, ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఖడ్గం’ సినిమాతో పి. సుబ్బరాజు వెండితెరకు పరిచయమయ్యారు. ఇప్పటివరకు ఆయన వందకు పైగా సినిమాల్లో నటించారు. తెలుగు, తమిళం, మలయాళం వంటి పలు భాషా చిత్రాల్లో ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు.