ప్రజాశక్తి- హైదరాబాద్, అమరావతి బ్యూరోలు : సీనియర్ నటి, నిర్మాత కృష్ణవేణి (101) కన్నుమూశారు. వయోభార సమస్యలతో ఆదివారం ఉదయం హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. సినీ పరిశ్రమకు కృష్ణవేణి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఎన్‌టిఆర్, ఘంటసాల వెంకటేశ్వరరావు, గాయని పి.లీల వంటి ప్రముఖులను ‘మనదేశం’తో ఆమె తెలుగు తెరకు పరిచయం చేశారు. ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తూనే ఎన్‌టిఆర్‌కు జంటగా అందులో నటించారు. పశ్చిమగోదావరి జిల్లాలో 1924 డిసెంబర్ 24న కృష్ణవేణి జన్మించారు. ఆమె తండ్రి వైద్య వృత్తి నిర్వర్తించేవారు. కృష్ణవేణి డ్రామా ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ఆరంభించారు. 1936లో విడుదలైన ‘సతీ అనసూయ’తో ఆమె బాలనటిగా సినీరంగంలోకి అడుగుపెట్టారు. సినిమా అవకాశాల్లో భాగంగా కృష్ణవేణి కుటుంబం చెన్నరులో స్థిరపడింది. 1939లో మీర్జాపురం జమీందార్ మేకా రంగయ్యతో ఆమె వివాహం జరిగింది. భర్తకు చెందిన శోభనాచల స్టూడియోస్ సారథ్యంలో పలు సినిమాలకు ఆమె నిర్మాతగా వ్యవహరించారు. ‘దక్షయజ్ఞం’, ‘జీవన జ్యోతి’, ‘భీష్మ’, ‘గొల్లభామ’, ‘ఆహుతి’ వంటి చిత్రాల్లో ఆమె నటించారు. తన పాటలను తానే పాడుకున్న నట గాయనిగా కూడా ఆమె పేరు సంపాదించారు. 1942లో కుమార్తె రాజ్యలక్ష్మీ అనూరాధకు కృష్ణవేణి జన్మనిచ్చారు. తల్లి కృష్ణవేణి బాటలో నిర్మాతగా ఆమె రాణించారు. ‘కీలుగుర్రం’ సినిమాలో అంజలీదేవికి కృష్ణవేణి నేపథ్యగానం అందించారు. 2004లో ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు. ఇటీవల ‘మనదేశం’ వజ్రోత్సవ వేడుకలో ఆమె పాల్గొన్నారు.
ప్రముఖుల సంతాపం
కృష్ణవేణి మృతి బాధాకరమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్, మాజీ సిఎం వైఎస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అలనాటి నటి సీ.కృష్ణవేణి… సినిమాలలోకి రాక ముందు రంగస్థల నటిగా పనిచేశారు. 1936లో ‘సతీఅనసూయ’, ధృవ చిత్రంతో బాలనటిగా సినీ రంగప్రవేశం చేశారు. ఆ తరువాత కథానాయకిగా తెలుగులో దాదాపు 15 చిత్రాలలో నటించారు. కొన్ని తమిళ, కన్నడ భాషా చిత్రాలలో కూడా కథానాయకిగా నటించారు. సీ కృష్ణవేణి తెలుగు సినిమా నిర్మాత మీర్జాపురం రాజా మేకా రంగయ్యను వివాహం చేసుకున్నారు. ఆమె స్వయంగా అనేక సినిమాలు నిర్మించారు. ఈమె తన సినిమాలలో తెలుగు సాంప్రదాయ విలువలకు అద్దంపట్టి జానపదగీతాలకు పెద్దపీట వేశారు. 1949 తెలుగులో సినిమా చరిత్రలో మైలురాయి అయిన మన దేశం చిత్రాన్ని నిర్మించి అందులో తెలుగు తెరకు నందమూరి తారక రామారావును, యస్వీ రంగారావును, నేపథ్య గాయకునిగా ఘంటసాల వెంకటేశ్వరరావును పరిచయం చేశారు. ఆ తరువాత సినిమాలలో అనేక గాయకులు నటులు, సంగీత దర్శకులను పరిచయం చేశారు. 1957 లో తీసిన దాంపత్యం సినిమాతో మరో సంగీత దర్శకుడు రమేష్ నాయుడును తెలుగు సినిమాకు పరిచయం చేశారు. తెలుగు సినిమా పరిశ్రమకు కృష్ణవేణి చేసిన జీవితకాలపు కృషిగాను 2004లో ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు. కృష్ణవేణి నిర్వహించిన నిర్మాణ సంస్థలు… భర్త ద్వారా స్థాపించిన సంస్థ – జయా పిక్చర్స్ ఆ తరువాతి కాలంలో దీన్ని శోభనాచల స్టూడియోస్ గా నామకరణం చేశారు. ఆమె స్వయంగా తన కుమార్తె మేకా రాజ్యలక్ష్మీ అనురాధ పేరు మీదుగా ఎంఆర్‌ఏ ప్రొడక్షన్స్ ను స్థాపించారు. సొంత బ్యానర్ లో మన దేశం (1949), లక్ష్మమ్మ (1950), దాంపత్యం (1957), గొల్లభామ (1947), భక్త ప్రహ్లాద (1942) వంటి చిత్రాలను నిర్మించారు.