చెన్నై : కమర్షియల్ చిత్రాలకు సంబంధించి 2010 నుంచి ఎన్నో మార్పులు వచ్చాయని, ముఖ్యంగా మహిళలను తక్కువ చేసి చూపిస్తున్నారని సినీనటి సుహాసిని అన్నారు. ప్రస్తుతం చిత్రపరిశ్రమలోని పరిస్థితులపై ఓ ఇంటర్వ్యూలో సుహాసిని కీలక వ్యాఖ్యలు చేశారు. ” పాశ్చాత్య పోకడలను అవలంభించడం ఎక్కువైంది. ఈ క్రమంలోనే స్కిన్ షో, ఇంటిమేట్ సీన్స్‌లో నటించడానికి ఇబ్బందిపడటం లేదు. గతంలో ఇలాంటి సీన్లలో నటించడానికి హీరోయిన్లు చాలా అరుదుగా అంగీకరించేవారు. కానీ, ఇప్పుడు అలా కాదు. ఏదైనా చేస్తున్నారు” అని సుహాసిని అన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో సినిమాల్లో మహిళలను తక్కువ చేసి చూపిస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. హీరోలకు స్ట్రాంగ్ రోల్స్ రాస్తున్నారని.. హీరోయిన్స్‌కు మాత్రం ప్రాధాన్యం లేని పాత్రలు ఇస్తున్నారని తెలిపారు. ఇదే ఇంటర్వ్యూలో ఆమె తన భర్త మణిరత్నం గురించి మాట్లాడారు. ”మాది పెద్దలు కుదిర్చిన వివాహం. ఇష్టాలు, అభిప్రాయాలు, వృత్తి.. ఇలా ప్రతి విషయంలో పరస్పరం గౌరవించుకుంటాం. మా మధ్య పెద్దగా గొడవలు జరగవు. చిన్న మనస్పర్థలు వచ్చినా సర్దుకుపోతుంటాం. ఆయన సినిమాలకు నేను వర్క్ చేస్తుంటా. ‘రోజా’, ‘తిరుడా తిరుడా’, ‘ఇరువర్’, ‘రావణ’ చిత్రాలకు డైలాగ్ రైటర్‌గా పనిచేశా” అని చెప్పారు.