హైదరాబాద్ : అనంత్ అంబానీ పెళ్లి వేడుకలకు వెళ్లకపోవడంపై నటి తాప్సీ తన మనసులోని మాట చెప్పారు. రిలయన్స్ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ చిన్నకుమారుడు అనంత్ అంబానీ, రాధికల పెళ్లి వేడుక అత్యంత వైభవంగా ముంబయి నగరంలోని జియో వరల్డ్ కన్వెన్ష్‌న్ సెంటర్‌లో జరిగిన సంగతి విదితమే. దాదాపు రూ.5 వేల కోట్ల ఖర్చుతో జరిగిన ఈ వివాహ వేడుకలో దేశ విదేశాలకు చెందిన వ్యాపార, రాజకీయ, బాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరోహీరోయిన్స్, సినీ తదితర రంగాల ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. ఈ నేపథ్యంలో … కొందరు సినీతారలు ఈ పెళ్లి దూరంగా ఉన్నారు. వారిలో స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను ఒకరు. తాజా ఇంటర్వ్యూలో అనంత్ అంబానీ పెళ్లికి ఎందుకు వెళ్లలేదు ? అన్న ప్రశ్నకు ఆమె స్పందించారు. వివాహానికి ఎందుకు హాజరు కాలేదో కారణాలను వెల్లడించారు.
” నిజం చెప్పాలంటే వాళ్లు నాకు వ్యక్తిగతంగా తెలియదు. పెళ్లి అనేది ఎన్నో అనుబంధాలతో కూడుకున్నది. ఆతిథ్యం ఇచ్చే కుటుంబానికి, అతిథికి మధ్య కనీసం ఏదో ఒకరకమైన అనుబంధం ఉండాలని నేను భావిస్తా. అలాంటి వివాహాలకు మాత్రమే హాజరవుతాను ” అని తాప్సీ తన మనసులోని మాట చెప్పారు. తాప్సీతో పాటు కరీనా కపూర్ ఖాన్, కరిష్మా కపూర్, సైఫ్ అలీ ఖాన్, కార్తీక్ ఆర్యన్, అక్షయ్ కుమార్, కంగనా రనౌత్ లాంటి సెలబ్రిటీలు అంబానీ పెళ్లికి హాజరు కాలేదు.