- థియేటర్లకు పెరుగుతున్న ఆక్యుపెన్సీ
పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2’ విడుదలకు తేదీ దగ్గరపడుతుండటంతో ఆ చిత్ర యూనిట్ దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ప్రపంచవ్యాప్తంగా టిక్కెట్ల బుకింగ్‌లు కొనసాగుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ‘బాహుబలి-2 రికార్డును బ్రేక్ చేసి పుష్ప 2 మొదటిస్థానంలో నిలిచింది. అమెరికాలో 15వేల టిక్కెట్లు ముందస్తుగా బుకింగ్ కావటం సరికొత్త రికార్డు.
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా ‘పుష్ప 2 ది రూల్’. 2021లో విడుదలైన బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘పుష్ప’ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 5న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ను ఈనెల 15న దేశవ్యాప్తంగా ఒకేరోజు విడుదల చేయటానికి మేకర్లు ఏర్పాటుచేస్తున్నారు. దేశంలో ప్రధాన నగరాలైన పాట్నా, కొచ్చి, చెన్నై, బెంగుళూరు, ముంబై, హైదరాబాద్ నగరాల్లో ఒకేసారి ట్రైలర్ విడుదల చేయనున్నారు. పుష్పరాజ్‌గా అల్లు అర్జున్, హీరోయిన్ శ్రీ వల్లి పాత్రలో రష్మికా మందన్నా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వై.రవిశంకర్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన ‘బాహుబలి 2’ చిత్రం తమిళనాడులో రికార్డు సృష్టించింది. తమిళంలో మొదటిరోజున దళపతి విజరు, అజిత్, రజనీకాంత్‌ల తర్వాత ఎవరికి డబుల్ డిజిట్ కలెక్షన్లు లేవు. తమిళంలో విజరు ‘గోట్’ సినిమాను 530 లొకేషన్స్‌లో 803 థియేటర్లలో విడుదలచేశారు. ఇప్పుడు ‘పుష్ప-2′ ను కూడా అదే రేంజ్‌లో విడుదల చేయబోతున్నాం’ అంటూ డిస్ట్రిబ్యూటర్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు తమిళంలో ‘బాహుబలి 2’ రికార్డు ఉంది. ఈ చిత్రం అక్కడ రూ.80 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే ఈ రికార్డును ‘పుష్ప 2′ అవలీలగా బ్రేక్ చేస్తుంది’ అని తమిళ డిస్ట్రిబ్యూటర్ (ఎజిఎస్ బ్యానర్) మాలి నవీన్ వ్యాఖ్యానించటం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ సినిమాలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ శ్రీలీల ఓ ప్రత్యేక పాటలో నటించబోతున్నారు. అమెరికాలో ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే 15 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయని మేకర్లు ప్రకటించారు. బాహుబలి 2 తర్వాత అత్యధిక బజ్ ఉన్న చిత్రంగా తమ సినిమా నిలిచిందని వారు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 11,500 స్క్రీన్లలో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. మన దేశంలో 6500, ఓవర్సీస్‌లో 5000 స్క్రీన్లు ఉన్నాయి.
పీరియాడికల్ చిత్రాలైన ‘కంగువా’, ‘మట్కా’పైనా ఆసక్తి
‘కంగువా’, ‘మట్కా’ రెండూ పీరియాడికల్ యాక్షన్ సినిమాలే. హీరోలు సూర్య, వరుణ్‌తేజ్‌లు ఇద్దరూ ఇప్పటివరకూ కనిపించని లుక్‌లో నటించటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో ఈ నెల 14న విడుదల కానున్న ‘కంగువా’ సినిమా కూడా భారీగానే థియేటర్లలో విడుదల కాబోతోంది. అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాకు ధనుంజరు నిర్మాత. ప్రపంచవ్యాప్తంగా 10 వేల స్క్రీన్లలో ఈ సినిమాను ప్రదర్శించటానికి ఏర్పాట్లుచేశామని నిర్మాత ప్రకటించారు. ఏకంగా మొత్తంగా రూ.1000 కోట్లు వసూలు చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లుగా ఇటీవల ఆయన ప్రకటించారు. పార్ట్ 2, పార్ట్ 3 కూడా కథలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ఈ సినిమాలో సూర్య ఆరు భిన్నమైన అవతారాల్లో కనిపించనున్నారు. దిశా పఠానీ కథానాయిక. బాబీదేవోల్ ప్రతినాయకుడు. జగపతిబాబు,యోగిబాబు, కోవై సరళ తదితరులు కీలకపాత్రలు పోషించారు. వరుణ్‌తేజ్ హీరోగా కరుణకుమార్ దర్శకత్వంలో ఈనెల 14న విడుదల కాబోతున్న చిత్రం ‘మట్కా’. వైరా yవైరా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ గోదావరి జిల్లా బ్యాక్ డ్రాప్‌లో గ్యాంబ్లింగ్, జూదం మెయిన్ థీమ్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించింది. ఈ సినిమాలో వరుణ్ సరసన మీనాక్షి చౌదరి నటించారు. బాలీవుడ్ నటి నోరా ఫతే, సలోనితో పాటు నవీన్ చంద్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం. మూడు విభిన్న గెటప్‌లలో వరుణ్‌తేజ్ నటించారు.
హిందీ చిత్రాల సీక్వెల్ జోరు
బాలీవుడ్‌లో ఆడియన్స్‌ను విశేషంగా అలరించిన చిత్రాల్లో ‘భూల్ భూలయా 3’, ‘సింగం అగైన్’ ఉన్నాయి. హారర్ కామెడీ ఫ్రాంచైజీ ‘భూల్ భూలయా’ మూడో భాగమైన ‘భూల్ భూలయా 3’, కార్తీక్ ఆర్యన్ హీరోగా ‘సింగం’ ఫ్రాంచైజీలో మూడు సినిమా ‘సింగం అగైన్’ సైతం సందడి చేస్తున్నాయి. అజరుదేవ్‌గణ్ హీరో కాగా అక్షరుకుమార్, జాకీ ష్రాఫ్, అర్జున్ కపూర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
విడుదలకు సిద్ధమైన సినిమాలు
టాలీవుడ్‌లో ఈనెల మూడోవారంలో విడుదలకు మరికొన్ని సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. అశోక్ గల్లా నటించిన ‘దేవకీ నందన వాసుదేవ’ ఈనెల 14న విడుదల కానుంది. నవీన్‌చంద్ర ప్రధాన పాత్రలో నటించి క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ ‘లెమెన్’ ఈనెల 15న విడుదల కానుంది. ‘గ్లాడియేటర్ 2’ కూడా అదేరోజు విడుదల కానుంది. హిందీ సినిమా ‘ది సబర్మతీ రిపోర్ట్’ కూడా అదే రోజు విడుదల కానుంది. గోద్రా రైలు దమనకాండ ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో విక్రాంత్ మస్సే ప్రధాన పాత్రధారి. విశ్వక్‌సేన్ హీరోగా నటించిన ‘మెకానిక్ రాకీ’ ఈనెల 22న విడుదల కానుంది. సత్యదేవ్, డాలీ ధనుంజయ హీరోలుగా నటించిన చిత్రం ‘జీబ్రా’ కూడా అదే రోజు విడుదల కానుంది.