అమరావతి : సంక్రాంతి వేళ … విడుదల కానున్న కొత్త సినిమాల టిక్కెట్ రేట్లపై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సినిమాల టికెట్ రేట్లను 14 రోజులు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతినివ్వగా, ఈ అనుమతిని 10 రోజులకు కుదిస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. సంక్రాంతికి కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ నుండి హీరో రామ్ చరణ్ నటించిన చిత్రం గేమ్ ఛేంజర్, నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్.. విక్టరీ వెంకటేశ్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు పండుగ బరిలో నిలిచాయి. ఇందులో గేమ్ ఛేంజర్ మూవీ ఈనెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈనెల 12న డాకు మహారాజ్ విడుదల కానుంది. జనవరి 14న సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ కానుంది. ఈ సినిమాల విడుదల సందర్భంగా టికెట్ల ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతులనిచ్చింది. అయితే … ఈ సినిమాల టికెట్ల పెంపునకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయిన సంగతి విదితమే. టికెట్ల ధరలను పెంచడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఇందులో గేమ్ ఛేంజర్, డాకు మహరాజ్ సినిమాలకు సంబంధించిన మూవీ టీమ్‌లను ప్రతివాదులుగా చేర్చారు. నిబంధనలకు విరుద్ధంగా టికెట్ల పెంపు జరిగిందని ప్రభుత్వ ఉత్తర్వులు రద్దు చేయాలని పిల్‌లో కోరారు. ఈ పిటిషన్ పై బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు టికెట్ల రేట్లపై సంచలన తీర్పును వెల్లడించింది. ఈ రెండు సినిమాల టికెట్ రేట్లను 14 రోజులు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతినివ్వగా, ఈ అనుమతిని 10 రోజులకు కుదించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం … విడుదలైన 10 రోజుల వరకు పెంచిన రేట్లు అందుబాటులో ఉంటాయి.