14 రోజుల రిమాండ్… బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
ఉత్తర్వులు ఆలస్యంతో రాత్రికి చంచల్‌గూడ జైలులోనే
ప్రజాశక్తి- హైదరాబాద్, అమరావతి బ్యూరోలు : పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో నిందితుడిగా ఉన్న పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అనంతరం నాంపల్లి కోర్లు 14 రోజులు రిమాండ్ విధించడం, చంచల్‌గూడ జైలుకు ఆయన్ను తరలించడం, హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం వంటి పరిణామాలు చకచకా చోటుచేసుకున్నాయి. అయితే, బెయిల్ ఉత్తర్వులు జైలు అధికారులకు చేరడంలో అనూహ్యంగా జాప్యం చోటుచేసుకుంది. రాత్రి 11 గంటల వరకు ఉత్తర్వులు అందలేదు. దీంతో శుక్రవారం రాత్రికి ఆయన్ను జైలులోనే ఉంచుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ఉదయం నుండి చోటుచేసుకున్న ఈ నాటకీయ పరిణామాలు తీవ్ర ఉత్కంఠను రేకెత్తించాయి. అంతకుముందు పోలీసులు శుక్రవారం ఉదయం 11.45 గంటల సమయంలో జూబ్లిహిల్స్‌లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించి ఆయన స్టేట్‌మెంట్ నమోదు చేసుకొన్నారు. ఆ తర్వాత గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. అయితే, అప్పటికే ముందస్తు బెయిల్ కోసం అల్లు అర్జున్ హైకోర్టులో దాఖలు చేసిన లంచ్‌మోషన్ పిటిషన్‌పై వాదనలు జరుగుతుండడంతో కాసేపు కోర్టు హాలులోనే ఉన్న పోలీసులు సాయంత్రం ఐదు గంటలకు అల్లు అర్జున్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. జైలు ఫార్మాలిటీ ముగించుకుని లోపలికి వెళ్లిన కాసేపటికే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జైలు వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు, అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు బెయిల్ ఉత్తర్వుల కోసం ఎదురుచూశారు. ‘తక్షణమే విడుదల చేయాలి’ అని న్యాయమూర్తి ఆదేశించడంతో బెయిల్ ఉత్తర్వులు అందగానే అల్లు అర్జున్ విడుదల ఖాయమని భావించారు. దీనికి తగ్గటుగానే జైలు అధికారులు ఏర్పాట్లు కూడా చేశారు. అయితే, బెయిల్ ఉత్తర్వులు అందడంలో జాప్యం చోటుచేసుకుంది. వెబ్‌సైట్‌లోకూడా అప్‌లోడ్ కాలేదు. దీంతో అసహనానికి మిగతా 7లో
గురైన అల్లు అర్జున్ తండి అరవింద్ జైలు వద్ద నుండి వెళ్లిపోయారు. రాత్రి పదకొండు గంటల వరకు బెయిల్ ఉత్తర్వులు అందకపోవడంతో శుక్రవారం రాత్రికి జైలులోనే అల్లు అర్జున్‌ను ఉంచాలని అధికారులు నిర్ణయించారు. ఆ మేరకు ప్రకటన కూడా చేశారు. అయితే, అధికారులు ఈ ప్రకటన చేసిన కాసేపటికే బెయిల్ ఉత్తర్వులు అందాయి. అయితే, ఆయన్ను విడుదల చేయడానికి అధికారులు నిరాకరించారు. ఈ కేసులో ఇప్పటికే సంధ్య థియేటర్ యాజమాన్యంతోపాటు ఇద్దరు మేనేజర్లను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ఇప్పుడు అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్ వద్దకు అభిమానులు, ప్రముఖ నిర్మాత దిల్ రాజు, అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, అల్లు అరవింద్, పలువురు దర్శకులు వచ్చారు.
అల్లు అర్జున్ ఇంటికి చిరంజీవి
అరెస్టు విషయం తెలుసుకున్న కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి, ఆయన భార్య హుటాహుటిన అల్లు అర్జున్ ఇంటికి చేరుకొని, ఆయన భార్యను ఓదార్చారు. అక్కడే ఉండి అడ్వకేట్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ అల్లు అర్జున్‌కు బెయిల్ వచ్చేవరకూ అక్కడే ఉన్నారు.
చట్టం తన పని తాను చేసుకుపోతుంది : తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి
ఢిల్లీ టూరులో ఉన్న తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి… అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించారు. గతంలో అగ్రనటులు సంజరుదత్, సల్మాన్ ఖాన్ అరెస్ట్ కాలేదా? అని ప్రశ్నించారు. ‘బెనిఫిట్ షోకు అల్లు అర్జున్ వచ్చి కారెక్కి ర్యాలీ చేయడం వల్ల తొక్కిసలాటలో మహిళ చనిపోయింది. బాలుడు చావుబతుకుల్లో ఉన్నాడు. ఇంత జరిగినా కేసు పెట్టకుండా ఉండాలా? చట్టం తన పని తాను చేసుకుపోతుంది. సినిమా స్టార్లకు, పొలిటికల్ స్టార్లకు ప్రత్యేక చట్టాలు ఏమీ ఉండవు. చట్టం అందరకూ సమానమే’ అని పేర్కొన్నారు.
అరెస్టు సమ్మతం కాదు : వైఎస్ జగన్
క్రిమినల్ కేసులు నమోదు చేసి అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం సమ్మతం కాదని వైసిపి అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎక్స్ వేదికగా శుక్రవారం పోస్టు చేశారు. ఈ ఘటనకు నేరుగా అల్లు అర్జున్‌ను బాధ్యుడిని చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.