తండ్రీ కొడుకులైన బ్రహ్మానందం, రాజా గౌతమ్ తెరపై తాత, మనవడుగా సందడి చేయనున్నారు. ‘బ్రహ్మా ఆనందం’ పేరుతో రూపొందుతున్న ఓ సినిమాలో ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్నారు. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ఆర్.వి.ఎస్.నిఖిల్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఫిబ్రవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం టీజర్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా గౌతమ్ మాట్లాడుతూ ఈ సినిమా తనకు ఎంతో ప్రత్యేకమన్నారు. తన తండ్రితో కలిసి కామెడీ చేయడం సవాలుగా అనిపించిందన్నారు. బ్రహ్మానందం మాట్లాడుతూ ‘నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా దీన్ని నిర్మించార’న్నారు. ‘ఈ సినిమా దర్శకుడు ఆర్.వి.ఎస్.నిఖిల్ నేను అంగీకరిస్తేనే ఈ సినిమా తెరకెక్కిస్తానని చెప్పారు. నేను తాత, మా కుమారుడు మనవడు అంటే కొత్తగా ఉందనుకున్నాను. వెన్నెల కిశోర్‌ను చూస్తేనే నవ్వు వచ్చేది. ఈ సినిమాలో రాజీవ్ కనకాల, తనికెళ్ల భరణి, రఘుబాబు వంటి నటులెందరో ఉన్నారు. హీరోయిన్ దివిజ తన పాత్రలో జీవించింది’ అని చెప్పారు.
