‘చిన్న థియేటర్లు నిర్మించుకోవటం ద్వారానే సినిమా రంగాన్ని బతికించుకోగలం. వ్యాపార ధృక్పథంతో కాకుండా సినిమా రంగాన్ని బతికించుకోవాలనే తపనతో ఎన్నో ఏళ్లుగా ఇలాంటి కృషిచేస్తున్నాను. నగరాలు, పట్టణాల నడిబొడ్డున ఉన్న థియేటర్లు వ్యాపార సము దాయాలుగాను, కళ్యాణ మండపాలుగా మారిపోతున్నాయి. జనాభా విస్తరణకు అనుగుణంగా అందరికీ అందుబాటులో ఉండేలా చిన్న థియేటర్లు లేవు. నిర్మితం కావాలి. ఇప్పటికైనా సినీరంగ పెద్దలు ఈ విషయమై శ్రద్ధ తీసుకుని కార్యాచరణ చేపట్టాలని కోరుతున్నా’ అని బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సినీరంగ ప్రముఖులు బల్వంత్‌సింగ్ కోరారు. ముంబైలో జరుగుతున్న వేవ్స్ సమ్మిట్‌లో బాలీవుడ్ సూపర్ స్టార్స్ అమీర్‌ఖాన్, షారూక్‌ఖాన్ కూడా మాట్లాడుతూ ‘థియేటర్లు పెంచుకోకపోతే సినిమారంగం మెల్లగా చచ్చుపడిపోవడం ఖాయం..సూపర్‌డూపర్ హిట్టయిన సినిమాలను సైతం మన దేశ జనాభాలో రెండు శాతం మంది మాత్రమే చూస్తున్నారు. ప్రేక్షకులకు థియేటర్లు అందుబాటులో లేకపోవటమే కారణం’ అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. తాజాగా బల్వంత్‌సింగ్ వారి ప్రసంగాన్ని స్వాగతిస్తూ తాను కూడా సినిమా పరిశ్రమ బాగుపడాలనే సదాశయంతో పనిచేస్తున్నానని వివరించారు.
