‘జగదేక వీరుడు.. అతిలోక సుందరి’ రెండోభాగంలో రామ్‌చరణ్‌తేజ్, జాన్వీ కపూర్ నటిస్తే చూడాలనేది తన కల అని, దాని కోసం ఎదురుచూస్తున్నానని టాలీవుడ్ హీరో చిరంజీవి వ్యాఖ్యానించారు. గతంలో చిరంజీవి, శ్రీదేవి ఈ సినిమా చేసిన విషయం తెలిసిందే. సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్-2024లో భాగంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘సినిమాల్లోకి రావాలనే ఆలోచన ఉన్నప్పుడు నేనెప్పుడూ మెగాస్టార్ అవుతానని అనుకోలేదు. కానీ, మంచిస్థానంలో ఉంటానని అనుకున్నారు. ఎందుకంటే నా ప్రతిభపై నమ్మకం ఉంది. ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నా. దాని ఫలితమే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నా. నాకు మంచి పాత్రలు ఇచ్చిన దర్శకులకు ధన్యవాదాలు. అభిమానుల ప్రేమను కొలవలేను. నా అభిమానులు మాస్ సినిమాల్లో నన్ను చూడాలనుకునేవారు. నాకేమో క్లాసికల్ సినిమాలు చేయాలని ఉండేది. ‘ఖైదీ’ నాకు స్టార్ స్టేటస్ ఇచ్చింది. అందులోని యాక్షన్ సీన్లు, డ్యాన్సులు, భావోద్వేగ సన్నివేశాలు మంచి పేరు తెచ్చాయి. ఆ తర్వాత వచ్చిన ‘మంత్రి గారి వియ్యంకుడు’, ‘శుభలేఖ’ లాంటి చిత్రాలను కూడా ప్రేక్షకులు ఆదరించారు. ప్రేక్షకులు రెండు రకాల సినిమాలు చూడటానికి ఇష్టపడతారని అర్థమైంది. కె.బాలచందర్ దర్శకత్వంలో ‘రుద్రవీణ’ చేశాం. నాకు మంచి పేరు వచ్చింది. అయితే ప్రొడ్యూసర్‌గా నా తమ్ముడికి లాభాలు రాలేదు. అందుకే నిదానంగా కమర్షియల్ వైపు వెళ్లాల్సివచ్చింది. చరణ్‌తో కలిసి జాన్వీ ఓ సినిమా చేస్తోంది. ఇటీవల ఆమెతో మాట్లాడుతున్నప్పుడు కొంచెం భావోద్వేగంగా అనిపించింది. శ్రీదేవి గుర్తుకు వచ్చింది. జగదేక వీరుడు.. అతిలోక సుందరికి సీక్వెల్ చరణ్, జాన్వీ నటిస్తే చూడాలని ఉంది. ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలు, సినిమాలతో సంతృప్తిగా ఉన్నానని చెప్పలేను. మనం ఎదురుచూసే పాత్రలు వాటంతట అవే రావాలి. నాకు ఫ్రీడమ్ ఫైటర్‌గా చేయాలని ఉండేది. సైరా చేశాను. ఆంధ్రాలో యావరేజ్‌గా నిలిచింది. మిగతా ప్రాంతాల్లో బాగానే ఆడింది. ఆ సినిమా వల్ల చాలానే నష్టపోయాం. నా సంతృప్తి కోసం సినిమాలు చేస్తే ప్రొడ్యూసర్ జేబు ఖాళీ అవుతుంది. మంచి కంటెంట్ కోసం ఎదురుచూస్తున్నా. నాకు ఎలాంటి అంచనాలు లేవు’ అంటూ వ్యాఖ్యానించారు.
